Civil panchayats
-
చేటు తెచ్చిన సివిల్ పంచాయితీ
ఒంగోలు: సివిల్ వ్యవహారం చేటు తెచ్చింది. ఇందుకు కారకులుగా భావిస్తూ విశ్రాంత పోలీసు అధికారి ఒకరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయగా కేసు విచారించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. పోలీసు శాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైర్ అయిన నరహరి.. దాసరి మాల్యాద్రి అనే వ్యక్తికి కొంత మొత్తం అప్పుగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈనెల 18న మాల్యాద్రి కుమారుడ్ని ఒంగోలు రైల్వేస్టేషన్ వద్దకు పిలిపించారు. అక్కడ నుంచి కారులో రామాయపట్నంకు చేరుకుని ఆయన తండ్రి మాల్యాద్రితో నేరుగా తాలూకా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నరహరి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ లక్ష్మణ్ ఇరువర్గాలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన మాల్యాద్రి తిరిగి రాలేదు. దీంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఉదయాన్నే మాల్యా ద్రి పెళ్లూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతదే హమై కనిపించారు. డబ్బులు చెల్లించాలంటూ మాన సికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి బంధువులు ఎస్పీకి ఐ క్లిక్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా గురువారం జీఆర్పీ పోలీసులకు శవ పంచనామా సందర్భంగా కూడా నరహరి స్టేషన్‌కు తీసుకువెళ్లి తమను కులం పేరుతో దూషించడం,డబ్బులు ఇవ్వా లంటూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి చేశా రని, ఈ విషయంలో తాలూకా సీఐ లక్ష్మణ్ కూడా తమను బెదిరించారంటూ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శవ పంచనామా అనంతరం లా అండ్ ఆర్డర్ పోలీసులకు జీఆర్పీ పోలీసులు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ప్రాథమికంగా తాలూకా సీఐ లక్ష్మణ్‌ను వీఆర్‌కు బదిలీ చేసి, సస్పెండ్ చేయడంతోబాటు నరహరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఎస్పీ సిఫార్సు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ జె.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్ మీద వచ్చిన ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. -
అవినీతిలో యువ ఎస్ఐల స్పీడ్
► దూకుడు ► విధుల్లో బాధ్యతా రాహిత్యం ► కేసుల నమోదులో ఏకపక్షం ► ప్రోబేషన్ పీరియడ్‌లోనే లెక్కలేనన్ని ఆరోపణలు ► వారం రోజుల క్రితం తలంటిన ఆదోని డీఎస్పీ ► ఇప్పటికే పలువురు వీఆర్‌కు.. ఒంటిపైకి ఖాకీ చొక్కా వస్తే చాలు.. ఆ కిక్కే వేరు. ఇక భుజానికి రెండు స్టార్లు ఉంటే.. అబ్బో చెప్పక్కర్లేదు. భూమ్మీద కాళ్లు నిలవమన్నా నిలవ్వు. సినిమాల ప్రభావమో.. సీనియర్ల అడుగుజాడల్లో నడుద్దామనో.. కొత్త ఎస్ఐలు కొందరు దూకుడు మీదున్నారు. సమాజ సేవ చేయడం అటుంచితే.. అత్యాశ, ఆవేశం, అనుభవ లేమి వీరి పెడదోవకు కారణమవుతోంది. కర్నూలు: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న 2013వ బ్యాచ్‌కు చెందిన సుమారు 54 మంది ఎస్ఐలు అప్పుడే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల నమోదు సమయంలో ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఉద్యోగాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ప్రొబేషన్ పూర్తి కాకముందే కొందరు ఎస్ఐల తీరు వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే పలు ఆరోపణలతో పది మందికి పైగా ఎస్ఐలు వీఆర్‌కు రావడం చూస్తే వీరి దూకుడు అర్థమవుతోంది. ఫిర్యాదుదారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం.. వివాదాలు.. సెటిల్మెంట్లు..స్థలాల విషయాల్లో స్టేషన్లోనే సివిల్ పంచాయితీలు చేయడం కొందరికి రివాజుగా మారింది. క్రైం రేటు ఎక్కువగా ఉండే స్టేషన్లలో అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. వారం రోజుల క్రితం ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని కొందరు యువ ఎస్ఐలను డీఎస్పీ శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో హెచ్చరించడం చూస్తే వీరి పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. రాజీ పడరనుకుంటే..యువకులు, ఉత్సాహవంతులు శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తారని భావించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగులుతోంది. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాకుండానే పలువురు ఎస్ఐలు ఆరోపణలపై శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. గత ఎన్నికల సమయంలో నేతలకు అనుకూలంగా పనిచేయడంతో పాటు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే దారులు వెతుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో కాకపోయినా పక్క మండలాలకు వెళ్లి పంచాయతీలకు యత్నించి గతంలో ఇద్దరు యువ ఎస్ఐలు చిక్కుల్లో పడ్డారు. పైరవీకారులు స్టేషన్‌కు వెళ్తే సీటులో నుంచి లేచి మరీ స్వాగతిస్తున్నట్లు ఘటనలు జిల్లాలో కోకొల్లలు. తింటే తప్పేంటి? 30 ఏళ్లకు పైగా బంగారు భవిష్యత్తు ఉందనే విషయం మర్చిపోయి ఏడాదో.. రెండేళ్లో అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు కొందరు యువ ఎస్ఐలు. తింటే తప్పేంటి..? అనే జాడ్యం వీరిలో కనిపిస్తోంది. శిక్షణ కాలంతో కలిపి ఎస్ఐలకు రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత సబ్ డివిజన్ అధికారి ఇచ్చే పనితీరు నివేదిక ఆధారంగా ఎస్పీ వీరి ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేస్తారు. ఈలోగా మాండేటరీ కోర్సులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న ఎస్ఐలు ఎవరు కూడా మాండేటరీ కోర్సులు పూర్తి చేయకుండానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. గతంలో ఉలిందకొండ, ఓర్వకల్లు ఎస్‌ఐలపైనా అవినీతి ఆరోపణలతో బదిలీ వేటు పడటం తెలిసిందే. చర్యలు తీసుకుంటున్నా.. షరా మామూలే.. పారదర్శక పాలన, ప్రజామిత్ర పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరయ్యేందుకు జిల్లా పోలీసు బాస్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవినీతి మరకలు, ఆరోపణలు పోలీసు శాఖ పరువు బజారునపడుతోంది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ అనే తేడా లేకుండా కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అవినీతికి దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరిస్తూ.. అక్రమార్కుల ఆట కట్టించేందుకు డీఐజీ స్థాయిలో పట్టు బిగిస్తున్నా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధి లోపిస్తోంది. పోలీసులంటే.. వాళ్లు ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఁకొత్తగా* విధుల్లో చేరినప్పుడు తమ పనితీరుతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కొందరు పోలీసు అధికారుల పేరు చెబితే అక్రమార్కులకు ఇప్పటికీ వణుకే. సిఫారసు చేయడానికి స్టేషన్‌కు వెళ్లాలంటే కూడా ఆలోచించే పరిస్థితి. కొన్ని తరహా నేరాల్లో రాజీ పడకపోవడం వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఒకరిద్దరిని పక్కనపెడితే.. పరిస్థితి భిన్నంగా ఉంది. కొన్ని ఉదాహరణలు ► నందవరం ఎస్ఐ వేణుగోపాల్ రాజు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ► గత నెలలో జొన్నిగిరి ఎస్ఐని కూడా వివిధ ఆరోపణలతో శ్రీశైలం బందోబస్తు విధుల్లో ఉండగానే వీఆర్‌కు రప్పించారు. మరో ఐదుగురు యువ ఎస్‌ఐలపైనా విచారణ జరుగుతోంది. ► ఓ యువతి కిడ్నాప్ కేసులో భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసి విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో జిల్లా సరిహద్దు స్టేషన్లో పని చేస్తున్న ఓ యువ ఎస్ఐ శాఖాపరమైన చర్యలకు లోనయ్యాడు. ► వివిధ ఆరోపణలో చార్జిమెమోలు అందుకున్న ఎస్ఐల సంఖ్య కూడా అధికంగానే ఉంది. -
దొంగలొచ్చారు..జాగ్రత్త!
⇒ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు ⇒ ఇంటికి తాళాలు వేశారో అంతే సంగతులు ⇒ జిల్లాలో జోరుగా దొంగతనాలు కర్నూలు: ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏదో భయం... అత్యవసర పనుల మీద, శుభకార్యాలకు అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు, ఊరు వెళ్లాలంటే ఆందోళన. తిరిగి వచ్చేలోపు దొంగలు ఇల్లు గుల్ల చేస్తారేమోనని భయం. కష్టపడి సంపాదించుకున్న సొత్తు కొల్లగొట్టేస్తారేమోనన్న బాధ. ఇలా అనునిత్యం జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముష్కరులు చెలరేగి వరుస దొంగతనాలకు పాల్పడుతూ నగలు, నగదు దోచుకుంటున్నారు. కొన్నిచోట్ల ఆగంతకులు దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు ముఠాలుగా వచ్చి దోచుకుపోయేవారు కొందరైతే, జిల్లాకు చెందిన కొన్ని ప్రాంతాల్లోని కరుడుగట్టిన నేరస్థులు మరికొందరు ఈ చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల పోలీస్స్టేషన్లకు కూతవేటు దూరంలో కూడా చోరీలు జరుగుతున్నాయి. జిల్లాలో దొంగతనం జరిగినప్పుడు ఆ ప్రాంతాలను పరిశీలించిన పోలీసులకు చోరీలకు పాల్పడిన దొంగలెవరనేది సంఘటనను బట్టి ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ దిశగా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టకపోవడంతో నేరస్తులు.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. చోరీల్లో బాధితులు కోల్పోయిన సొత్తులు రికవరీ చేయడంలో కూడా పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత పది నెలల కాలంలో 675 చోరీలు జరగ్గా రూ.5.12 కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురైంది. అందులో పోలీసులు రాబట్టింది రూ1.93 కోట్లు మాత్రమే. ఇప్పటికీ 455 కేసులు దర్యాప్తు దశలోనే ఉండటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. మారుమూల పల్లెల్లో నివాసముండే ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ దేవుడెరుగు. అధికార యంత్రాంగమంతా కేంద్రీకృతమై ఉండే జిల్లా కేంద్రంలో కూడా శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు కష్టతరంగా మారింది. నెల రోజుల్లోనే కర్నూలు నగరంలో రెండు భారీ దోపిడీలకు పాల్పడి పోలీసు శాఖకు దొంగలు సవాలు విసిరారు. రోజురోజుకు పెరుగుతున్న నేర ప్రవృత్తి, పోలీసులకు పట్టింపు లేమితనం, నెలల తరబడి సాగుతున్న కేసుల పరిశోధన వెరసి ప్రజలకు సత్వర న్యాయం అందని ద్రాక్షలా మారుతోంది. కర్నూలును స్మార్ట్ సిటీగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం, వై-ఫై సేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో జిల్లా ప్రజలకు సాధారణ భద్రత కల్పించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉండటం గమనార్హం. సిబ్బంది, ఆర్థిక, మానవ వనరుల కొరతను పోలీసులు సాకుగా చూపుతున్నప్పటికీ పౌరులకు భద్రత కల్పించాలనే ప్రాథమిక బాధ్యతను విస్మరించే పరిస్థితి తలెత్తకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నెన్నో సమస్యలు... ⇒ జనాభాకు అనుగుణంగా పోలీసులు లేరు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక కానిస్టేబుల్ ఉండాలనే లెక్క ఆంగ్లేయుల కాలం నుంచి ఉంది. రెండు వేల మందికి ఒకరు కూడా జిల్లాలో సిబ్బంది లేరు. ⇒ పోలీస్స్టేషన్లకు ఇప్పటికే మంజూరైన పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రతి స్టేషన్‌కు తక్కువలో తక్కువగా ఐదు నుంచి పది పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. ⇒ చిన్నచిన్న కేసులకు కూడా స్టేషనరీ అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ స్టేషనరీ ఖర్చు కోసం ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపులు లేవు. దీంతో ఫిర్యాదుదారులు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ⇒ వాహనాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయడం లేదు. దీంతో నిందితులు ఫిర్యాదుదారులను ఆదాయ వనరులుగా ఎంచుకోవలసిన దుస్థితి. ⇒ బందోబస్తు డ్యూటీలు పెరిగిపోవడం, సిబ్బంది తక్కువగా ఉండటంతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది. ⇒ సివిల్ పంచాయతీలు, స్థిరాస్తి తగాదాలకు స్టేషన్లు అడ్డాగా మారాయి. ⇒ పోలీసు అధికారులపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పైరవీకారుల జోక్యం పెరిగింది. గస్తీ బృందాల వ్యవస్థ పటిష్టంగా లేదు. నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర పోలీసుల మధ్య సంబంధాలు సరిగా లేవు. గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. సైబర్ నేరాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో మూస ధోరణిలో కేసుల విచారణ సాగుతోంది.