దొంగలొచ్చారు..జాగ్రత్త!
⇒ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు
⇒ ఇంటికి తాళాలు వేశారో అంతే సంగతులు
⇒ జిల్లాలో జోరుగా దొంగతనాలు
కర్నూలు: ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏదో భయం... అత్యవసర పనుల మీద, శుభకార్యాలకు అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు, ఊరు వెళ్లాలంటే ఆందోళన. తిరిగి వచ్చేలోపు దొంగలు ఇల్లు గుల్ల చేస్తారేమోనని భయం. కష్టపడి సంపాదించుకున్న సొత్తు కొల్లగొట్టేస్తారేమోనన్న బాధ. ఇలా అనునిత్యం జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముష్కరులు చెలరేగి వరుస దొంగతనాలకు పాల్పడుతూ నగలు, నగదు దోచుకుంటున్నారు. కొన్నిచోట్ల ఆగంతకులు దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు ముఠాలుగా వచ్చి దోచుకుపోయేవారు కొందరైతే, జిల్లాకు చెందిన కొన్ని ప్రాంతాల్లోని కరుడుగట్టిన నేరస్థులు మరికొందరు ఈ చోరీలకు పాల్పడుతున్నారు.
కొన్ని చోట్ల పోలీస్‌స్టేషన్లకు కూతవేటు దూరంలో కూడా చోరీలు జరుగుతున్నాయి. జిల్లాలో దొంగతనం జరిగినప్పుడు ఆ ప్రాంతాలను పరిశీలించిన పోలీసులకు చోరీలకు పాల్పడిన దొంగలెవరనేది సంఘటనను బట్టి ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ దిశగా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టకపోవడంతో నేరస్తులు.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. చోరీల్లో బాధితులు కోల్పోయిన సొత్తులు రికవరీ చేయడంలో కూడా పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత పది నెలల కాలంలో 675 చోరీలు జరగ్గా రూ.5.12 కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురైంది. అందులో పోలీసులు రాబట్టింది రూ1.93 కోట్లు మాత్రమే. ఇప్పటికీ 455 కేసులు దర్యాప్తు దశలోనే ఉండటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది.
మారుమూల పల్లెల్లో నివాసముండే ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ దేవుడెరుగు. అధికార యంత్రాంగమంతా కేంద్రీకృతమై ఉండే జిల్లా కేంద్రంలో కూడా శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు కష్టతరంగా మారింది. నెల రోజుల్లోనే కర్నూలు నగరంలో రెండు భారీ దోపిడీలకు పాల్పడి పోలీసు శాఖకు దొంగలు సవాలు విసిరారు. రోజురోజుకు పెరుగుతున్న నేర ప్రవృత్తి, పోలీసులకు పట్టింపు లేమితనం, నెలల తరబడి సాగుతున్న కేసుల పరిశోధన వెరసి ప్రజలకు సత్వర న్యాయం అందని ద్రాక్షలా మారుతోంది.
కర్నూలును స్మార్ట్ సిటీగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం, వై-ఫై సేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో జిల్లా ప్రజలకు సాధారణ భద్రత కల్పించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉండటం గమనార్హం. సిబ్బంది, ఆర్థిక, మానవ వనరుల కొరతను పోలీసులు సాకుగా చూపుతున్నప్పటికీ పౌరులకు భద్రత కల్పించాలనే ప్రాథమిక బాధ్యతను విస్మరించే పరిస్థితి తలెత్తకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నెన్నో సమస్యలు...
⇒ జనాభాకు అనుగుణంగా పోలీసులు లేరు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక కానిస్టేబుల్ ఉండాలనే లెక్క ఆంగ్లేయుల కాలం నుంచి ఉంది. రెండు వేల మందికి ఒకరు కూడా జిల్లాలో సిబ్బంది లేరు.
⇒ పోలీస్‌స్టేషన్లకు ఇప్పటికే మంజూరైన పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రతి స్టేషన్‌కు తక్కువలో తక్కువగా ఐదు నుంచి పది పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.
⇒ చిన్నచిన్న కేసులకు కూడా స్టేషనరీ అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ స్టేషనరీ ఖర్చు కోసం ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపులు లేవు. దీంతో ఫిర్యాదుదారులు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ నెట్టుకొస్తున్నారు.
⇒ వాహనాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయడం లేదు. దీంతో నిందితులు ఫిర్యాదుదారులను ఆదాయ వనరులుగా ఎంచుకోవలసిన దుస్థితి.
⇒ బందోబస్తు డ్యూటీలు పెరిగిపోవడం, సిబ్బంది తక్కువగా ఉండటంతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది.
⇒ సివిల్ పంచాయతీలు, స్థిరాస్తి తగాదాలకు స్టేషన్లు అడ్డాగా మారాయి.
⇒ పోలీసు అధికారులపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పైరవీకారుల జోక్యం పెరిగింది. గస్తీ బృందాల వ్యవస్థ పటిష్టంగా లేదు. నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర పోలీసుల మధ్య సంబంధాలు సరిగా లేవు. గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. సైబర్ నేరాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో మూస ధోరణిలో కేసుల విచారణ సాగుతోంది.