civil supply dept
-
తప్పుడు వార్తలు నమ్మొద్దు: కోన శశిధర్
సాక్షి, తాడేపల్లి: ఖరీఫ్ సీజన్ లో 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆయన సోమవారం తాడేపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల పై కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. 1820 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. నాబార్డ్ నుంచి అడ్వాన్సు తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా బకాయిలు చెల్లించమని సీఎం వైఎస్ జగన్ సూచించారని చెప్పారు. రెండు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. రైతులు.. దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. తడిసిన ధాన్యాలకు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1902’ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమాచారం అందిస్తారని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని.. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని కోన శశిధర్ స్పష్టం చేశారు. -
తెలంగాణలో ఎక్కడ నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ను తీసుకునే వీలుగా పలు మార్పులు తీసుకువచ్చింది. ఇక నుంచి నిత్యావసర వస్తువులను ఎక్కడి నుంచైనా ( పోర్టబిలిటీ) తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి ఆనంద్ తెలిపారు. రేషన్ తీసుకోకపోయినా కార్డును రద్దుచేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. దీని ద్వారా రాష్ట్రంలోని 2.75 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలుగనుంది. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు కమిషనర్ తెలిపారు. -
పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు
కోదాడఅర్బన్ కోదాడ పట్టణంలోని పలుచోట్ల శనివారం పౌరసరఫరాల టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న సుమారు 60 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని రంగా థియేటర్ సమీపంలో గ్యాస్ స్టవ్ రిపేరింగ్ సెంటర్ల పేరుతో నడుస్తున్న గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లపై కూడా వారు దాడి చేసి అక్కడి గృహ వినియోగ సిలిండర్లు, కాటాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాల్లో దాడి చేసి అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కోదాడ, తుంగతుర్తి డీటీసీఎస్‌లు రమణారావు, బ్రహ్మయ్యలతో పాటు పలువురు డీటీసీఎస్‌లు, సివిల్‌సప్లైస్ అధికారులు పాల్గొన్నారు.