పాత బంగారాన్ని కొంటాం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు స్థిరంగా ఉన్నా అమ్మకాలు పెరగలేదని, ఎన్నికల తర్వాత బంగారంపై సుంకాలు తగ్గే అవకాశం ముందని ప్రముఖ జ్యూవెలరీ సంస్థ టైటాన్ (తనిష్క్) అంచనా వేస్తోంది. ఆభరణాల తయారీకి దిగుమతులపై కాకుండా స్థానికంగా ఉండే బంగారాన్ని సేకరించడానికి త్వరలోనే గోల్డ్ బై బ్యాక్ స్కీంను ప్రారంభిస్తామంటున్న టైటాన్ సీఈవో (జ్యూవెలరీ) సి.కె.వెంకటరామన్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు విధిస్తుండటంతో పరిశ్రమ ఏమైనా బంగారం కొరతను ఎదుర్కొంటోందా?
ప్రభుత్వ ఆంక్షలకు తోడు డిమాండ్ తగ్గడంతో దిగుమతులు క్షీణిస్తున్న అంశాన్ని చూస్తూనే ఉన్నాం. అమ్మకాలు బాగా తగ్గడంతో ప్రస్తుతం పరిశ్రమ బంగారం కొరతను ఎదుర్కొనడం లేదు. కరెంట్ ఖాతా లోటు అదుపులోకి రావడంతో వచ్చే ఎన్నికల తర్వాత బంగారంపై విధించిన సుంకాలు దిగొస్తాయని అనుకుంటున్నాం.
దిగుమతుల కంటే రీ-సైకిల్డ్ గోల్డ్‌పై ప్రధానంగా దృష్టిసారించమని ఆర్బీఐ సూచిస్తోంది? ఈ దిశగా టైటాన్ ఏమైనా ఆలోచిస్తోందా?
ప్రస్తుతం భారతీయుల దగ్గర 30,000 టన్నులకు పైగా బంగారం ఉంది. దీన్ని తిరిగి కొనుగోలు చేయడం ద్వారా అవసరాలను తీర్చుకోమని ఆర్బీఐ కోరింది. కాని దీనికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు లేవు. మా తనిష్క్ షోరూంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా ఈ ఏడాదిలోగా గోల్డ్ బైబ్యాక్ స్కీంను ప్రవేశపెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం.
సెంటిమెంట్ పరంగా చూస్తే భారతీయులు బంగారాన్ని విక్రయించడానికి అంతగా ఇష్టపడరు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్కీం జయవంతం అవుతుందని అనుకుంటున్నారా?
బంగారం సెంటిమెంట్ విషయంలో ఉత్తరాది వారికంటే దక్షిణాది వారికి సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. వీరు ఆభరణాలు అమ్మడానికి ఇష్టపడరు కాని కాయిన్స్ విక్రయించడానికి వెనుకాడరు. భారతీయులు కలిగిన 30 వేల టన్నుల బంగారంలో సుమారు 15 నుంచి 20 శాతం కాయిన్స్ ఉన్నట్లు అంచనా. అంటే 4,500 నుంచి 6,000 టన్నుల బంగారం కాయిన్స్ రూపంలో అందుబాటులో ఉంది. ఈ మొత్తాన్ని ఒకటి రెండు సంవత్సరాలు కొనుగోలు చేయడం ద్వారా దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది.
గత కొంతకాలంగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు తగ్గి స్థిరంగా ఉండటంతో అమ్మకాలు ఏమైనా పెరిగాయా?
రెండు సంవత్సరాల క్రితం నుంచి బంగారు ఆభరణాల పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంకా కోలుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం.
అమ్మకాలు తగ్గడంతో వ్యాపార విస్తరణను ఏమైనా తగ్గించారా? రాష్ట్ర విస్తరణ కార్యక్రమాల గురించి వివరిస్తారా?
ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా కొత్తగా మరో 30 షోరూంలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర విభజన సమస్య అమ్మకాలపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా బంద్‌లు, సమ్మెల వల్ల వ్యాపారం బాగా పడిపోయింది. దీంతో రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించాం.
ప్రస్తుతం బంగారు ఆభరణాల తయారీలో యాంత్రీకరణ ఏ స్థాయిలో ఉంది?
ఇతర రంగాలతో పోలిస్తే బంగారు ఆభరణాల తయారీకి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. ఈ రంగంలో ఇప్పుడిప్పుడే యాంత్రీకరణ జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం 30 శాతం ఆభరణాలు యంత్రాల ద్వారా తయారవుతుంటే, మిగిలినవి చేతి ద్వారానే తయారవుతున్నాయి. యంత్రాల ద్వారా తయారవుతున్న వాటిలో అత్యధికంగా చైన్లు, గాజులు ఉన్నాయి.
ఆభరణాల తయారీ పరిశ్రమ నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీని పరిష్కారం కోసం మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?
ఈ రంగంలోకి కొత్త వారసులు రాకపోవడంతో నిపుణులు కొరత ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దీనికి ప్రధాన కారణం సరైన ఆదాయం లభించకపోవడమే. అందుకే దీన్ని పరిష్కరించడానికి కారిగర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశాం. అన్ని సౌకర్యాలు ఒకేచోట అందిస్తుండటంతో స్వర్ణకారుల ఆదాయం రెట్టింపు అవుతోంది. సాధారణంగా ఒక స్వర్ణకారుడు నెలకు 600 గ్రాముల ఆభరణాలు తయారు చేస్తుంటే, ఈ కేంద్రాల్లో 1,500 గ్రాముల వరకు తయారు చేస్తున్నారు. రానున్న కాలంలో యాంత్రీకరణ పెంచడం ద్వారా ఈ సామర్థ్యాన్ని మూడు కేజీలకు పెంచాలన్నది మా ఆలోచన. అలాగే ఒక ఆభరణం తయారు కావడానికి సగటున 21 రోజులు పడితే ఈ కేంద్రాల్లో మూడు రోజుల్లోనే తయారవుతోంది.
దేశం నుంచి బంగారు ఆభరణాల ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి? వీటిల్లో టైటాన్ వాటా ఎంత?
బంగారం వినియోగంలో మనం ముందున్నా.. ఆభరణాల ఎగుమతులు అసలు లేవనే చెప్పాలి. దీనికి కారణం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మన ఆభరణాల తయారీ లేకపోవడమే. ఈ కారిగర్ కేంద్రాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభరణాలను తయారు చేసి ఎగుమతులు పెంచాలన్నది మా దీర్ఘకాలిక లక్ష్యం.