రక్తమోడిన పెషావర్ స్కూల్ మళ్లీ ప్రారంభం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాది దాడిలో నెత్తురోడిన పెషావర్ సైనిక పాఠశాల సోమవారం మళ్లీ ప్రారంభమైంది. కొన్ని వారాల తర్వాత విద్యార్థులు, టీచర్లు చేదు జ్ఞాపకాలతో ఈ రోజు పాఠశాలకు వచ్చారు.
ఉగ్రవాదులు పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని మట్టుబెట్టడం ప్రపంచాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది దాడిలో రక్తపుమడుగుల్లా మారిన తరగతి గదులను పూర్తిగా శుభ్రం చేశారు. అలాగే పాఠశాలలో ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టారు. ఈ దాడి అనంతరం పాకిస్థాన్లో భద్రత కారణాల రీత్యా విద్యాసంస్థలను మూసివేసి సెలవులు ప్రకటించారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు.