Classical dance performance
-
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
సంస్కృతికి కళ
సంస్కృతిని మనం బతికిస్తున్నాం అనుకుంటాం. కానీ సంస్కృతే మనిషికి బతుకునిస్తుంది. మానవ జీవితంలో కొరవడిన ఉల్లాసాన్ని కళల ద్వారా తిరిగి తీసుకొచ్చి, జీవితేచ్ఛను కలిగించేందుకు ‘గుడి సంబరాల’ పేరుతో సంగీత నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు శశికళ, ఆమె స్నేహితురాలు శ్రీనగి. రోష్నీ కౌన్సెలింగ్ సెంటర్ వ్యవస్థాపక సభ్యురాలు శశికళ. జీవితం ఏ పట్టాలెక్కాలో నిర్ణయించేది ఇరవైలలో ఉండే ఉత్సాహమే. ఆ వయసులోనే సోషల్ లైఫ్లోకొచ్చారు శశికళ. ‘సహాయ్’ అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్‌గా పని చేశారు. అదే సంస్థలో పూనమ్ సింగ్ కూడా ఉండేవారు. కొన్నాళ్లకు సహాయ్ సంస్థ... కార్యకలాపాలను ఆపి వేసింది. అప్పుడు శశికళ, పూనమ్.. మరో సేవా సంస్థలో చేరడం కంటే సొంతంగా ఒక సంస్థను స్థాపించడమే కరెక్ట్ అనుకున్నారు. అలా ఏర్పాటైనదే ‘రోష్నీ’. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడే వారికి జీవితేచ్ఛను కలిగించడమే రోష్నీ ప్రధాన లక్ష్యం. ఆ సర్వీస్‌లో పాతికేళ్లు గడిచాయి. ఏడెనిమిదేళ్ల కిందట శశికళకు మరో ఆలోచన వచ్చింది. మనిషి మానసిక ఉల్లాసం కోసం కూడా ఏదైనా చేయాలనిపించింది. అలా రూపొందిన మరో ఫౌండేషన్ ‘పరంపర’. ఈ సంస్థ యేటా రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక ప్రదేశాలలో ‘గుడి సంబరాలు’ నిర్వహిస్తుంటుంది. గ్రామీణుల కోసమే ‘‘మనిషి ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటే జీవితం మీద నిరాసక్తతలు తలెత్తవు. నాగరక జీవితం కోసం ఎవరైనా పట్టణాల పట్టాల్సిందే. యువత ఉద్యోగాల కోసం గ్రామాలను వదిలి నగరాలకు వలసపోకా తప్పడం లేదు. దాంతో మానసిక ఉల్లాసాన్నిచ్చే కళాప్రదర్శనలూ నగరాలకే పరిమితం అవుతున్నాయి. కళాకారులు కూడా అవకాశాల కోసం నగరాలను ఆశ్రయిస్తున్నారు. కళాప్రదర్శనలన్నీ నగరాల్లోని ఏసీ ఆడిటోరియాల్లోనే జరగుతుంటే.. గ్రామాలనే నమ్ముకుని, దుక్కి దున్ని, భూమిని సాగు చేసి పంట పండించే రైతులు, ఆ వ్యవసాయరంగంలో పని చేస్తున్న వాళ్లు... ఒక కూచిపూడి నాట్యాన్ని కానీ ఒడిస్సీ నృత్యాన్ని కానీ చూడాలంటే కుదిరే పని కాదు. అందుకే మన సంప్రదాయ కళలను వాళ్ల దగ్గరకు తీసుకెళ్లడమే మా ప్రయత్నం. కథక్, మణిపురి, మయూర్ భంజ్, చావ్ వంటి ఒరిస్సా జానపద నృత్యాలను కూడా మన గ్రామాల్లో ప్రదర్శిస్తున్నాం’’ అని చెప్పారు శశికళ, పరంపర కో ఫౌండర్ డాక్టర్ శ్రీనగి. ‘సంబరాలకు’ ప్రేరణ శశికళది నిజామాబాద్, శ్రీనగిది వరంగల్. ఇద్దరివీ వ్యవసాయ కుటుంబాలే. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకూడదు, సమాజం కోసం కూడా పని చేయాల్సిన అవసరం ఉందని నమ్మే కుటుంబాలే ఇద్దరివీ. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. శ్రీనగి మెడ్విన్ హాస్పిటల్ డైరెక్టర్. శశికళ సెంట్రల్ కోర్ట్ హోటల్ నిర్వహణతోపాటు ఇతర కుటుంబ వ్యాపారాలనూ చూసుకుంటారు. ‘‘ఓసారి హంపి ఉత్సవాలు చూడడానికి వెళ్లినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఉత్సవాలు జరగడం లేదనిపించింది. కర్నాటకలో హంపి ఉత్సవాలే కాదు, హొయసల మహోత్సవాలు కూడా ఉంటాయి. ఖరజురహో ఉత్సవాలు, కోణార్క్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అయితే దేశవిదేశాల్లో కూడా ప్రసిద్ధి. ఇక కేరళ, తమిళనాడు కూడా ఏ మాత్రం తీసిపోవు. మన దగ్గర కళలు లేవని కాదు, ఆదరణ తక్కువని చెబుతున్నాను. ఎవరైనా ముందుకు వచ్చి కళల కోసం ఏదైనా చేస్తే బావుణ్నని అనిపించింది. హైదరాబాద్ వచ్చాక నా ఫ్రెండ్స్, బంధువులు... అందరితో షేర్ చేసుకున్నాను. వాళ్లను ప్రభావితం చేయాలన్నంత పట్టుదలతో చెప్పాను. వాళ్లందరిలో ముందుకు వచ్చింది ఒక్క శ్రీనగి మాత్రమే. తను డాక్టర్ కాబట్టి పూర్తి సమయాన్ని కేటాయించడం కష్టం. దాంతో ‘ఇద్దరం కలిసి చేద్దాం’ అన్నది శ్రీనగి. అలా 2015, ఆగస్టు 15వ తేదీన పరంపర ఫౌండేషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి’’ అని వివరించారు శశికళ. ప్రదేశాల ఎంపిక గుడి సంబరాలు ఏటా సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు జరిగేవి. ఏడాదికి ఎనిమిది నుంచి పన్నెండు ప్రదర్శనలే ఉండేవి. ఈ ఏడాది పదిహేడు ప్రదర్శనలు ఉండడంతో సంక్రాంతికి ముందే మొదలు పెట్టి శ్రీరామనవమితో పూర్తి చేస్తున్నాం. ఇవి పూర్తి అయిన తర్వాత పూర్తి సమయం రోష్నీ సేవలకే. మిగిలిన టైమ్‌లో వచ్చే ఏడాది గుడి సంబరాల కోసం ప్రదేశాల ఎంపిక కోసం ఫీల్డ్ టూర్లుంటాయి. ఏడాదంతా పనిలోనే ఉంటాను. ఏదో ఒక పనిలో నిమగ్నం కాకపోతే రోజును వృథా చేశామనిపిస్తుంది’’.– శశికళ,రోష్నీ, పరంపర సంస్థల వ్యవస్థాపక సభ్యురాలు సంబరాల వేదికలు నలభై ఏళ్లకే పన్నెండు జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, మానస సరోవరం, అమర్నాథ్ యాత్రలు పూర్తి చేశాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లాలోనూ చిన్న చిన్న గుళ్లు కూడా చూసేశాను. ఆ యాత్రల అనుభవం ఇప్పుడు గుడి సంబరాల వేదికల ఏర్పాటులో బాగా ఉపయోగపడుతోంది. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పురాతన కట్టడాలే మాకు వేదికలు.– శ్రీనగి, గుడి సంబరాలు నిర్వహకురాలు పేరు కోసం పరిశోధన ‘‘మేము చేపట్టినది తెరమరుగవుతున్న మన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అందుకోసం సంస్కృతం నుంచి తెలుగు నుడికారాల వరకు మాకు తెలిసిన ఎన్నో పేర్లు అనుకున్నాం. చివరికి ‘పరంపర – గుడి సంబరాలు’ అని నిర్ధారించుకున్నాం. నిజానికి గుడి పెద్ద సామాజిక క్షేత్రం. ఆలయాల ప్రాంగణంలో సామూహిక కార్యక్రమాల కోసం వేదిక ఉంటుంది. ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు సమావేశాలకు వేదిక కూడా ఆలయ మండపమే. నగరాల్లోని ఆడిటోరియాలకు పరిమితమవుతున్న కళలను గ్రామాలకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఇవి టిక్కెట్ల ప్రదర్శనలు కావు, పూర్తిగా ఉచితం. పూర్వం కళలను పోషించడానికి రాజులుండేవాళ్లు. ఇప్పుడు కళల ఆదరణకు పూనుకోవాల్సిన బాధ్యత అందరిదీ. అందుకే ఇష్టంగా మొదలు పెట్టాం. మాకు చేతనైనట్లు, చేయగలిగినంత చేయగలుగుతున్నాం. శంషాబాద్ దగ్గర అమ్మపల్లిలో ఉన్న స్టెప్వెల్లో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా మన దగ్గర అలాంటి బావులున్నాయనే సంగతిని తెలియచేయగలిగాం. కొండపల్లి కోటలో నాట్య ప్రదర్శనను పదిహేను వందల మంది చూశారు. అంటే అంతమందికీ మన చారిత్రక కట్టడాన్ని కూడా దగ్గర చేయగలిగామనే అర్థం. ఇలాంటివి ఇంకా చేస్తాం’’ అన్నారు శశికళ, శ్రీనగి.– వాకా మంజులారెడ్డిఫొటోలు: జి. అమర్ -
తొలిసారిగా... ఇళయరాజా
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇప్పుడు మరో కొత్త కృషికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి దాకా సినిమాలు, ఆల్బమ్‌ల ద్వారా తన సృజనాత్మకత చూపిన ఈ ‘సంగీత జ్ఞాని’ తాజాగా ఒక శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు సంగీతం అందించారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి కృత్తికా సుబ్రమణియన్ రూపకల్పన చేసిన ‘స్వప్నం’ అనే నాట్య ప్రదర్శనకు ఆయన స్వరాలు కూర్చారు. ‘సాగర సంగమం’ సహా అనేక నృత్య ప్రధానమైన చలనచిత్రాలకు గతంలో సంగీతం అందించినప్పటికీ, ఒక నృత్య నాటకానికి ఆయన ఆ పని చేయడం ఇదే ప్రథమం. ‘‘సినిమాలనేసరికి సామాన్యులకు సైతం చేరడమే ప్రధాన లక్ష్యం కాబట్టి, ఎంతో రాజీ పడతాం. ఇక్కడ కూడా సామాన్యులను చేరాలన్న సంగతి దృష్టిలో పెట్టుకున్నప్పటికీ, సంగీతం మొదలు నృత్యపరికల్పన దాకా అన్ని విషయాల్లో శాస్త్రీయ సంగీతం, భరతనాట్యాల్లోని నియమ నిబంధనలకు కట్టుబడ్డాం’’ అని ఇళయరాజా వివరించారు. నిజానికి, నృత్య నాటకానికి సంగీతం కూర్చమని అడిగితే ఏమంటారోనని భయపడుతూ, కొన్ని పాటలకు సంగీతం కోసం కృత్తిక ఆయనను సంప్రతించారట. కానీ, ‘స్వప్నం’ స్క్రిప్టు విని చాలా సంతోషించిన ఆయన కొన్ని పాటలకే ఎందుకు, మొత్తం నృత్య నాటకానికి సంగీతం సమకూరుస్తానన్నారు. అలా, ఈ ‘స్వప్నం’ కోసం ఈ సంగీత ఋషి ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, దేశమంతా సంలీనమయ్యేలా బాణీలు కట్టారు. మొత్తం 30 సంగీత ట్రాక్‌లను సిద్ధం చేయగా, వాటిలో తొమ్మిదింటిని ఈ ఆదివారం సీడీగా విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సందర్భానికి తగ్గ రాగాలను ఎంచుకున్న ఇళయరాజా నందికేశ్వరుడు వాయించాడని భావించే ‘నందిచ్చొల్’కు ఏకంగా 18 వివిధ రకాల డ్రమ్స్ వాడారు. ఇళయరాజా కుమారుడు - సంగీత దర్శకుడు కార్తీక్ రాజా కూడా పాలుపంచుకొన్న ఈ ప్రాజెక్ట్ కోసం సుధా రఘునాథన్, టి.వి. గోపాలకృష్ణన్ లాంటి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు పాడడం విశేషం. ‘‘శాస్త్రీయ కళలు సామాన్యులకు చేరవనే వాదనను అంగీకరించను. సరైన పద్ధతిలో ఆచరణలో పెడితే, వాటిని కూడా ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా చేయవచ్చు’’ అని ఇళయరాజా అభిప్రాయపడ్డారు. అవును మరి కళకైనా, ఇళయరాజా లాంటి కళాజీవికైనా ఎల్లలేమిటి?