తొలిసారిగా... ఇళయరాజా
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇప్పుడు మరో కొత్త కృషికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి దాకా సినిమాలు, ఆల్బమ్‌ల ద్వారా తన సృజనాత్మకత చూపిన ఈ ‘సంగీత జ్ఞాని’ తాజాగా ఒక శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు సంగీతం అందించారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి కృత్తికా సుబ్రమణియన్ రూపకల్పన చేసిన ‘స్వప్నం’ అనే నాట్య ప్రదర్శనకు ఆయన స్వరాలు కూర్చారు. ‘సాగర సంగమం’ సహా అనేక నృత్య ప్రధానమైన చలనచిత్రాలకు గతంలో సంగీతం అందించినప్పటికీ, ఒక నృత్య నాటకానికి ఆయన ఆ పని చేయడం ఇదే ప్రథమం.
‘‘సినిమాలనేసరికి సామాన్యులకు సైతం చేరడమే ప్రధాన లక్ష్యం కాబట్టి, ఎంతో రాజీ పడతాం. ఇక్కడ కూడా సామాన్యులను చేరాలన్న సంగతి దృష్టిలో పెట్టుకున్నప్పటికీ, సంగీతం మొదలు నృత్యపరికల్పన దాకా అన్ని విషయాల్లో శాస్త్రీయ సంగీతం, భరతనాట్యాల్లోని నియమ నిబంధనలకు కట్టుబడ్డాం’’ అని ఇళయరాజా వివరించారు. నిజానికి, నృత్య నాటకానికి సంగీతం కూర్చమని అడిగితే ఏమంటారోనని భయపడుతూ, కొన్ని పాటలకు సంగీతం కోసం కృత్తిక ఆయనను సంప్రతించారట.
కానీ, ‘స్వప్నం’ స్క్రిప్టు విని చాలా సంతోషించిన ఆయన కొన్ని పాటలకే ఎందుకు, మొత్తం నృత్య నాటకానికి సంగీతం సమకూరుస్తానన్నారు. అలా, ఈ ‘స్వప్నం’ కోసం ఈ సంగీత ఋషి ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, దేశమంతా సంలీనమయ్యేలా బాణీలు కట్టారు. మొత్తం 30 సంగీత ట్రాక్‌లను సిద్ధం చేయగా, వాటిలో తొమ్మిదింటిని ఈ ఆదివారం సీడీగా విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సందర్భానికి తగ్గ రాగాలను ఎంచుకున్న ఇళయరాజా నందికేశ్వరుడు వాయించాడని భావించే ‘నందిచ్చొల్’కు ఏకంగా 18 వివిధ రకాల డ్రమ్స్ వాడారు.
ఇళయరాజా కుమారుడు - సంగీత దర్శకుడు కార్తీక్ రాజా కూడా పాలుపంచుకొన్న ఈ ప్రాజెక్ట్ కోసం సుధా రఘునాథన్, టి.వి. గోపాలకృష్ణన్ లాంటి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు పాడడం విశేషం. ‘‘శాస్త్రీయ కళలు సామాన్యులకు చేరవనే వాదనను అంగీకరించను. సరైన పద్ధతిలో ఆచరణలో పెడితే, వాటిని కూడా ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా చేయవచ్చు’’ అని ఇళయరాజా అభిప్రాయపడ్డారు. అవును మరి కళకైనా, ఇళయరాజా లాంటి కళాజీవికైనా ఎల్లలేమిటి?