‘నిర్మల భారత్’తో ఇంటింటా మరుగుదొడ్డి
జిల్లాలో 2.10 లక్షల మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం
జెడ్పీ సీఈఓ మహమ్మద్ సలావుద్దీన్
సాక్షి, బళ్లారి :నిర్మల భారత్ పథకం కింద ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించేందుకు మూడు రోజుల పాటు అధికారులు సర్వే జరిపేందుకు చర్యలు తీసుకున్నట్లు జెడ్పీ సీఈఓ మహమ్మద్ సలావుద్దీన్ తెలిపా రు. గురువారం ఆయన జెడ్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిర్మల భారత్లో ఇంటింటా మరుగుదొడ్డిని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మొదట ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు అభియాన్ కార్యక్రమం ఉంటుందని, 26 నుంచి మరో మూడు రోజుల పాటు నిర్మించిన వాటికి డబ్బులు చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబర్ 14 నుంచి మూడు రోజుల పాటు నిర్మించిన మరుగుదొడ్లను తనిఖీ చేస్తామని, మరుగుదొడ్లు నిర్మించక పోతే నిధులు ఇవ్వబోమన్నారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి రూ.10,100 ఉంటుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4,700, మిగిలిన వాటా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,11,799 కుటుంబాలు ఉండగా, ఇందులో 1,01,852 కుటుంబాలు మరుగుదొడ్లు పొంది ఉన్నారని, ఇంకా 2,09,947 కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. 2013 -14లో 22 వేల మరుగుదొడ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 13,998 మాత్రమే నిర్మాణం జరిగిందన్నారు. 2014-15లో 48,684 మరుగుదొడ్లు లక్ష్యం ఉండగా, ఇందులో ఆగస్టు నెలాఖరు వరకు 4,474 నిర్మాణం జరిగిందన్నారు. నిర్మల భారత్ అభియాన్ పథకం ద్వారా రూ.2.10 కోట్లు, ఉపాధిహామీ పథకం ద్వారా రూ.2.41 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.
ఈ మొత్తం నిధులన్నీ మరుగుదొడ్ల కోసం ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా 48 పాఠశాలలు, 28 అంగన్వాడీ కేంద్రాల్లోనూ మరుగుదొడ్లు నిర్మించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ఈ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీకి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ ఉప కార్యదర్శి శివరామగౌడ పాల్గొన్నారు.