clean water
-
జల సంక్షోభం ముంచుకొస్తోంది!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడమే కాక.. వ్యర్థజలం మురుగునీటిని శుభ్రపరిచి పునర్వినియోగంలోకి తేకపోయినట్లయితే ప్రపంచం మొత్తం జల సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (యూఎన్‌యూ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రపంచ జలభద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనాసహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది (72 శాతం)ని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి.పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జలసంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలిచావులు పెరిగే అవకాశముందని కూడ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సుమారు వంద కోట్ల మంది (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో 195 దేశాలుండగా.. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది.ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (ఒక మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదిక (గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్)ను ఇటీవల విడుదల చేసింది.నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ..కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే..⇒ పపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు ప్రధాన కారణం.⇒ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భజలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. ⇒ పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటమూ నీటి ఎద్దడికి దారితీస్తోంది.ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం..రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాçÜ్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాతి్వయా తదితర దేశాల్లోని వంద కోట్ల మంది 49 దేశాల్లోని వంద కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.⇒ ప్రపంచ జలభద్రత నివేదిక ప్రకారం 2030 నాటికి నీటి కష్టాలు ఇలా..⇒నీటి కష్టాలు చుట్టుముట్టనున్న దేశాలు 113⇒113 దేశాల్లో నీటి కష్టాలు ఎదుర్కోనున్న జనాభా 560 కోట్లు⇒గుక్కెడు పరిశుభ్రమైన తాగునీరు కూడా లభించని దేశాలు 24⇒ఈ 24 దేశాల్లో జనాభా 6.42 కోట్లు⇒ ఒక మనిíÙకి రోజుకు కనీసం కావాల్సిన పరిశుభ్రమైన నీరు 50 లీటర్లు⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న దేశాలు 49⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న జనాభా 100 కోట్లు -
Hyderabad: మూసీని చూసి మురుస్తున్న నగరవాసులు
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లను జలమండలి వరుసగా తెరుస్తోంది. మూసీలో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. నగరంలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, మురికి వదిలింది. దీంతో చాదర్‌ఘాట్, మూసారాంభాగ్ వంతెనలపై నుంచి వీక్షిస్తే.. నదిలో నీరు స్వచ్ఛంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న సిటీజన్లు స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. మూసీ నీటిలో మల, మూత్రాదుల్లో ఉండే హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక సైతం స్పష్టం చేయడం గమనార్హం. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్ ఆక్సీజన్ డిమాండ్ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది. జూలై చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం.. మోస్ట్ ప్రాపబుల్ నంబరు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తేలింది. కొంచెం ఊరట... తెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో జంట జలాశయాలు, పలు నాలాల నుంచి మూసీలోకి వరద నీరు చేరుతుండడంతోనే మురుగు క్రమంగా వదులుతోంది. దీంతో వ్యర్థజలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పీసీబీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతున్న 1800 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తున్న 22 ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణమని భావిస్తున్నారు. మూసీ మురిసేదెప్పుడో? వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేసి దాని ప్రకారం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు), పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈటీపీ) నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు చేపడితేనే మూసీ నది ఉత్తరాదిలోని గంగా, సబర్మతి నదుల తరహాలో మెరుస్తుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని స్పష్టం చేస్తున్నారు. చదవండి: 16న ఏకకాలంలో ‘జనగణమన’ -
లాక్డౌన్ ఎఫెక్ట్.. క్లీన్ గంగా
వారణాసి : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు భారత్‌లో 21 రోజులపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా దేశంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. పరిశ్రమల బంద్ కారణంగా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నిలిచిపోయాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న నదిలోకి వెళ్లి కలుస్తుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూసివేయడంతో వారణాసి, హరిద్వార్ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి వ్యర్థాలు చేరకపోవడంతో నదిలోని నీరు రోజు రోజుకి శుద్ధి అవుతోంది. అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు కనిపిస్తోందని, అలాగే తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. (బ్రిటన్ కమెడియన్ కన్నుమూత) లాక్డౌన్ నేపథ్యంలో హరిద్వార్ ఘాట్లు మూసివేయడంతో ప్రజలు నీటిలో దిగడం, వ్యర్థాలను నీటిలో వేయడం వంటివి లేకపోవడంతో చూడటానికి నీళ్లు తేటగా కనిపిస్తున్నాయి. చేపలు ఇతర సముద్ర జీవులు కూడా నీటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంగా నదిలోకి పదోవంతు కాలుష్యం పరిశ్రమలు, సమీప హోటళ్ల నుంచి వచ్చ చేరుతుందని బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండటం, పరిశ్రమలు పనిచేయకపోవడం కారణంగా దాదాపు 40 నుంచి 50 శాతం వరకు గంగా నది నీరు నాణ్యత పెరిగిందని ఆయన చెప్పారు. అలాగే గత కొన్ని వారాలుగా ఆ ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదవ్వడంతో నీటి మట్టాలు పెరిగాయి. (కరోనా: వీధుల్లో తిరుగుతున్న దెయ్యాలు! ) కాగా కేవలం గంగా నది మాత్రమే కాకుండా యమునా నది నీటి నాణ్యత, నీటి పరిమాణంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కాలుష్యంతో నిండిన నది ప్రస్తుతం క్లీన్‌గా కనిపిస్తోంది. ఇక రోడ్లపై వాహానాలు తక్కువ ప్రయాణిస్తుండటంతో వాయు కాలుష్యం సైతం కనుమరుగయ్యింది. అలాగే ఇప్పటి వరకు కనిపించని అనేక వలస పక్షులు కూడా తిరిగి వచ్చాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో కొన్ని ప్రదేశాల్లో అడవిలో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. (సెహ్వాగ్‌కు ‘రామాయణం’ గుర్తొచ్చింది..! -
తేమ నుంచి తేటగా
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా నదులు, చెరువులు, భూగర్భం నుంచి సేకరించిన నీటిని వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి తాగేందుకు అనుకూలంగా మార్చడం గురించి విన్నాం. కానీ గాలిలోని తేమను స్వచ్ఛమైన జలాలుగా అందజేసే వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ‘మేఘ్‌దూత్ వాటర్ ఫ్రమ్ ఎయి ర్ కియోస్క్’ను దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో గురువారం ప్రారంభించనున్నారు. 1వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని ఏర్పాటు చేస్తారు. మొదట వెయ్యి లీటర్లతో ప్రారంభించి 5 వేల లీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచనున్నారు. ‘ఈ నీరు వంద శాతం స్వచ్ఛం. ఎలాంటి కలుషితాలు ఉం డవు. అట్మాస్పెరిక్ వాటర్ జనరేషన్ టెక్నాలజీ ద్వారా గాలిలోని తేమ నుంచి ఈ నీటిని సేకరిస్తారు’అని ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) సికింద్రాబాద్ స్టేషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. స్వచ్ఛ జలం సేకరణ.. విక్రయం దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అందుబాటులోకి.. నేడు 1వ నంబర్ ప్లాట్ ఫామ్‌పై మేఘ్‌దూత్ కియోస్క్ ప్రారంభం తేమ నుంచి నీటి సేకరణ ఇలా.. గాలిలోని తేమలో పుష్కలంగా ఉండే జలాన్ని రిఫ్రిజిరేషన్ టెక్నిక్స్‌ను అనుసరించి మేఘదూత్ అట్మాస్పెరిక్ వాటర్ జనరేటర్ సేకరిస్తుంది. బయటి గాలిని లోపలికి లాక్కొని ఒక మార్గంలో చల్లటి కాయిల్స్ ద్వారా పంపించే క్రమంలో తేమ.. నీరుగా మారుతుంది. ఆ నీటి నుంచి ఘన పదార్థాలు, వాసనలు, బ్యాక్టీరియా కారకాలను ఫిల్టర్లు తొలగిస్తాయి. వివిధ రకాలుగా నీటిని శుద్ధి చేశాక వంద శాతం స్వచ్ఛమైన నీటిని నిల్వ చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ నీరు ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ 1వ నంబర్ ప్లాట్‌ఫా మ్పై ఈ మేఘదూత్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ తరువాత మన దగ్గరే.. మేఘదూత్ అట్మాస్పెరిక్ వాటర్ జనరేటర్, రెమినరలైజర్ ద్వారా తేమ నుంచి నీటి సేకరణ ప్రక్రి య నిర్వహిస్తారు. నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ మైత్రి ఆక్వాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. రక్షణశాఖలో మాత్రమే ఇప్పటి వరకు గాలి లోని తేమ నుంచి నీటిని సేకరించే వ్య వస్థ ఉంది. కేంద్ర జల్‌శక్తితో పాటు, ఐఐసీటీ, ఎన్ఐపీఈఆర్, ఈపీటీఆర్ఐ) వంటి సంస్థలు ఈ నీటిని వంద శాతం శుద్ధ జలాలుగా ఆమోదించాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం రైల్‌నీర్ ద్వారా అందజేస్తున్నట్లుగానే మేఘదూత్ కియోస్క్ నుంచి లభించే నీటినీ లీటరు రూ.8 చొప్పున విక్రయించనున్నారు. -
శుద్ధ ప్రచారమే!
♦ ఉద్దానంలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటులో కనిపించని వేగం ♦ కిడ్నీ వ్యాధుల ప్రభావిత గ్రామాలకు అందని శుద్ధజలం ♦ హామీలు నెరవేర్చకపోవడంపై ఉద్దానం వాసుల ఆగ్రహం కంచిలి, సోంపేట : జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి శుద్ధజలం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు నిజం కావడానికి ఇంకా చాలా కాలం పట్టేలా ఉంది. కిడ్నీవ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఉత్సాహంగా ప్ర కటించిన నేతలు పనుల్లో ఆ ఊపు చూపించడం లేదు. ఒకచోట పనులు చేసి వంద చోట్ల చేసినట్లు ప్రచారం మాత్రమే జరుగుతోంది. మండలానికి ఒక యూనిట్ ప్రాతిపదికన పనులు చేపడతామని వారు చేసిన ప్రకటనకు, క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులకు పొం తన కుదరడం లేదు. మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని స్థానిక టీడీపీ నేతలు చాలా సార్లు చెప్పారు. తీరా లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చి పలాస వరకు తిరిగి ఇచ్ఛాపురం ని యోజకవర్గానికి వెళ్లకపోవడంతో అ క్కడి ప్రజలు, పార్టీ క్యాడర్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఆర్ఓ ప్లాంట్ల పథకాన్ని సోంపేటలో ప్రారంభిస్తామనే అంశం కూడా అడుగున పడింది. ప్రాణాలు పోతున్నాయి.. కిడ్నీ వ్యాధి మూలాన ఉద్దానంలో ఎంతో మంది కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణాలను కనుగొనలేకపోయారు. అయితే కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో గల నీటిలో ఏదో సమస్య ఉందనే అనుమానంతో చా లా వరకు ఉద్దాన ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు, వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటి సరఫరాను చేపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా ఈ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. టెక్కలి డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మం డలానికో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన నీరందించటానికి ఏర్పాట్లు చేసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట పట్టణ పరిధి బిరుసువాడ వద్ద ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యింది. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో పరిశీలిస్తే.. కంచిలి మండలంలో మండపల్లి పంచాయతీ పరిధి ఒరియా నారాయణపురం గ్రామంలోను, కవిటి మండల కేంద్రంలోను, ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామంలో ఇప్పటి వరకు కేవలం బోర్ల తవ్వటం మాత్రమే అయ్యింది. దీంతో టీడీపీ నేతల ప్రకటన ఆరంభ శూరత్వమేనా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. సోంపేటలో రూ.1.88కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 16 హేబిటేషన్లలో, కంచిలిలో రూ.1.95కోట్లతో ప్లాంటు ఏ ర్పాటు చేసి 21 హేబిటేషన్లలోను, ఇచ్ఛాపురం మండలం లో రూ.1.47కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 13 హేబిటేషన్లలోను, కవిటిలో రూ.2.93కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసి 38 హేబిటేషన్లలో సబ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం మండలానికో ఆర్ఓ ప్లాంటు ప్రధానమైనది ఏర్పాటు చేసి, అక్కడ నుంచి కిడ్నీవ్యాధుల ప్రభావం ఉండే హేబిటేషన్ గ్రామాలకు 5వేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్లను ట్రాక్టర్ల సహాయంతో సరఫరా చేసి, అక్కడే సబ్పాయింట్లు పెట్టి 20 లీటర్ల నీటిని రూ.2లు చొప్పున స్వైపింగ్ కార్డులతో అమ్మకాలు జరుపుతామని సన్నాహాలు చేస్తున్నారు. అయితే పనుల్లో వేగం లేకపోవడం స్థానికులను అసహనానికి గురి చేస్తోంది. సమాధానాలు ఏవీ? ప్రభుత్వం తరఫున మండలానికో చోట ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి హేబిటేషన్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా తీసుకెళ్లి, అక్కడ సబ్పాయింట్ల వద్ద సరఫరా చేసే ప్రక్రియ ఎన్నాళ్లు సాగుతుందో అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. ఒక్కో హేబిటేషన్కు 5వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్ నీళ్లు సరిపోతాయా లేదా సరిపోకపోతే అవసరమైనన్ని నీళ్లు సరఫరా చేస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ దీనికి సమాధానం చెప్పేవారే లేకపోయారు. మందస : మందస మండలంలోని ఉద్దాన ప్రాంతానికి శుద్ధజలం అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన హామీ గాల్లో కలి సిపోయింది. ఉద్దాన ప్రాంతానికి కేంద్రం హరిపురం కావడంతో రివర్స్ ఆస్మాసిస్(ఆర్ఓ)ప్లాంట్‌ను హరిపురంలో ని ర్మించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. హరిపురంలో ఆక్రమణ భూములు, ప్రభుత్వ భూములుండగా వాటి ని వదిలేసిన అధికారులు శ్మశానం పక్కన ఉన్న భూమిని ఎంచుకున్నారు. అయితే ఆ నీటిని ఎలా తాగుతామని ఉద్దా నం వాసులు ముందు నుంచీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ లోగా ఏమైందో ఏమో ఈ స్థలాన్ని కాదని పాత ఆర్ అండ్ బీ ప్రాంతంలో ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. అధికారులు, సర్వేయర్లు వెళ్లి ఈ ప్రాంతంలోనే ఆర్ఓ ప్లాం ట్ నిర్మించాలని సర్వే కూడా చేశారు. కానీ పనులు ముం దుకు కదల్లేదు. ప్రభుత్వం తలచుకుంటే స్థల సమస్య పెద్దదేం కాదు. కానీ వారికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఉద్దానానికి శుద్ధజలం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
6 కోట్ల మందికి మంచి నీరు లేదు..
కొచీ: భారత్‌లో 6 కోట్ల 30 లక్షల మంది మంచి నీరు తాగడం లేదని ఓ సర్వేలో తేలింది. వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారని, ఇది యూనైటెడ్ కింగ్డమ్ (యూకే) జనాభాతో సమానమని ఆ సర్వేలో పేర్కొన్నారు. రేపు ‘ప్రపంచ నీటి దినోత్సవం’ సందర్భంగా ‘విల్డ్ వాటర్ సంస్థ’ ప్రపంచ వ్యాప్తంగా మంచి నీటిపై జరిపిన సర్వే వివరాలు వెల్లడించింది. దీనికి కారణం ప్రభుత్వాలు పథకాలు రూపోందించకపోవడం, నీటి వాడకం పెరగడం, జనాభా పెరుగుదల, కరువు పరిస్థితులు, వ్యవసాయానికి నీరును ఎక్కువగా ఉపయోగించడమేనని తెలిపింది. భారత్ జనాభాలో 6 కోట్ల 30 లక్షల జనాభా గ్రామాల్లోనే ఉందని, వీరంతా మంచినీరు త్రాగడం లేదని రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో వారు కలరా, మలేరియా, కంటిచూపు మందగించడం, డెంగీలాంటి రోగాల భారిన పడతున్నారని తెలిపింది. గ్రామ జీవనం వ్యవసాయంపై ఆధారపడిందని, వీరంతా ఆహారం సమకూర్చడం, పంట దిగుబడికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంది. మంచి నీరును తీసుకురావడంలో మహిళలదే ఎక్కువ బాధ్యత అని, కరువు పరిస్థితుల్లో చాలా దూరం నడిచి నీరు తీసుకొస్తారని రిపోర్ట్‌లో తెలిపింది. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, దేశంలో పెరుగుతున్న జనాభాకు మంచి నీటి భద్రత కల్పించడం ఒక పెద్ద సవాలని పేర్కొంది. ప్రపంచంలో ఆరు దేశాలకు ఒక దేశం భూగర్భజలాలను పూర్తిగా వాడుకున్నాయని విల్డ్ వాటర్ సంస్థ తెలిపింది. ఉత్తర భారతదేశంలోని బందెల్ఖండ్ ప్రాంతం పూర్తిగా కరువుమయం అయిందని, వరుసగా మూడు సంవత్సరాలు కరువు ఏర్పడటంతో ఆకలి, పేదరికంతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని చెప్పింది. ఈ రిపోర్ట్ వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతుందని హెచ్చరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం దేశాల్లోని జనాభా గ్రామల్లో నివసిస్తుందని, 66.3 కోట్ల జనాభా మంచి నీరు తాగడం లేదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సర్వే భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపినట్లు తెలిపింది.