సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా నదులు, చెరువులు, భూగర్భం నుంచి సేకరించిన నీటిని వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి తాగేందుకు అనుకూలంగా మార్చడం గురించి విన్నాం. కానీ గాలిలోని తేమను స్వచ్ఛమైన జలాలుగా అందజేసే వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ‘మేఘ్‌దూత్ వాటర్ ఫ్రమ్ ఎయి ర్ కియోస్క్’ను దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గురువారం ప్రారంభించనున్నారు. 1వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని ఏర్పాటు చేస్తారు. మొదట వెయ్యి లీటర్లతో ప్రారంభించి 5 వేల లీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచనున్నారు. ‘ఈ నీరు వంద శాతం స్వచ్ఛం. ఎలాంటి కలుషితాలు ఉం డవు. అట్మాస్పెరిక్ వాటర్ జనరేషన్ టెక్నాలజీ ద్వారా గాలిలోని తేమ నుంచి ఈ నీటిని సేకరిస్తారు’అని ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎస్‌డీసీ) సికింద్రాబాద్ స్టేషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
స్వచ్ఛ జలం సేకరణ.. విక్రయం
దేశంలోనే తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అందుబాటులోకి..
నేడు 1వ నంబర్ ప్లాట్ ఫామ్‌పై మేఘ్‌దూత్ కియోస్క్ ప్రారంభం
తేమ నుంచి నీటి సేకరణ ఇలా..
- గాలిలోని తేమలో పుష్కలంగా ఉండే జలాన్ని రిఫ్రిజిరేషన్ టెక్నిక్స్‌ను అనుసరించి మేఘదూత్ అట్మాస్పెరిక్ వాటర్ జనరేటర్ సేకరిస్తుంది.
- బయటి గాలిని లోపలికి లాక్కొని ఒక మార్గంలో చల్లటి కాయిల్స్ ద్వారా పంపించే క్రమంలో తేమ.. నీరుగా మారుతుంది.
- ఆ నీటి నుంచి ఘన పదార్థాలు, వాసనలు, బ్యాక్టీరియా కారకాలను ఫిల్టర్లు తొలగిస్తాయి.
- వివిధ రకాలుగా నీటిని శుద్ధి చేశాక వంద శాతం స్వచ్ఛమైన నీటిని నిల్వ చేస్తారు.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ నీరు ఉంటుంది.
- సికింద్రాబాద్ స్టేషన్ 1వ నంబర్ ప్లాట్‌ఫా మ్‌పై ఈ మేఘదూత్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు.
రక్షణ శాఖ తరువాత మన దగ్గరే..
మేఘదూత్ అట్మాస్పెరిక్ వాటర్ జనరేటర్, రెమినరలైజర్ ద్వారా తేమ నుంచి నీటి సేకరణ ప్రక్రి య నిర్వహిస్తారు. నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ మైత్రి ఆక్వాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. రక్షణశాఖలో మాత్రమే ఇప్పటి వరకు గాలి లోని తేమ నుంచి నీటిని సేకరించే వ్య వస్థ ఉంది. కేంద్ర జల్‌శక్తితో పాటు, ఐఐసీటీ, ఎన్‌ఐపీఈఆర్, ఈపీటీఆర్‌ఐ) వంటి సంస్థలు ఈ నీటిని వంద శాతం శుద్ధ జలాలుగా ఆమోదించాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం రైల్‌నీర్ ద్వారా అందజేస్తున్నట్లుగానే మేఘదూత్ కియోస్క్ నుంచి లభించే నీటినీ లీటరు రూ.8 చొప్పున విక్రయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment