సిద్దిపేట ముస్తాబు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సీఎం హోదాలో తొలిసారి సిద్దిపేట పట్టణానికి బుధవారం వస్తున్నారు. సీఎం రాకను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం అంతా సిద్దిపేట పట్టణంలో మకాం వేసింది. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు మంగళవారం రోజంతా బిజీ బిజీగా పర్యటన కార్యక్రమాలను పరిశీలించారు.
ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ నేత ృత్వంలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో హెలీప్యాడ్ స్థలాన్ని, కోమటి చెరువు వద్ద రూ. 6.8 కోట్ల వ్యయంతో పర్యాటక క్షేత్రంగా అభివ ృద్ధి చేయనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమాల పనులను, ఫిల్టర్ బెడ్ వద్ద ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర స్థాయి అధికారుల సమీక్ష సమావేశం కోసం చేస్తున్న ఏర్పాట్లను, ఎన్జీఓ భవన్, కోర్టు ఆవరణలను జేసీ శరత్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసచారిలతో కలిసి పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలాన్ని పోలీసులతో పాటు బ్యాంబ్ స్క్వాడ్ బృందం, సీఎం సెక్యూటిరీ సిబ్బంది తనిఖీ చేశారు. హెలీకాఫ్టర్ మినీ స్టేడియంలో రెండు దఫాలుగా ల్యాండింగ్ చేసి చూశారు.
సీఎం కార్యక్రమం ఇలా..
హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్లో ఉదయం 11 గంటలకు నేరుగా కరీంనగర్ వెళ్లనున్న సీఎం కేసీఆర్, అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 1.10 గంటకు సిద్దిపేట పట్టణంలోని మినీ స్టేడియానికి హెలీకాఫ్టర్లో చేరుకుంటారు. 1.15 గంటలకు కోమటిచెరువు వద్దకు చేరుకుని పర్యాటక క్షేత్రంగా అభివ ృద్ధి చేసే కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 2 నుంచి 2.30 గంటల వరకు భోజన విరామం తీసుకుంటారు. 2.30 గంటల నుంచి 4 గంటల వరకు మంత్రులు, అధికారులతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై సమీక్ష జరుపుతారు.
4.10 గంటలకు సిద్దిపేట ఎన్జీవో భవన్లో జరగనున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. 4.25 గంటలకు కోర్టుభవన్లో నిర్వహించే న్యాయవాదుల సమావేశంలో పాల్గొంటారు. 4.45 గంటలకు హెలీప్యాడ్ చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు మహ్మద్ అలీ, రాజయ్య, మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారకరామారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్నలు, జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో పాటు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా బుధవారం సిద్దిపేట రానున్నారు.