నిమ్మకాయ చేతిలో పట్టుకున్న సీఎం సిద్ధరామయ్య
సాక్షి బెంగళూరు: వచ్చే నెలలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలు తాజాగా ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతిలో నిమ్మకాయ పట్టుకుని ప్రచారం చేయడంపై బీజేపీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. చేతిలో నిమ్మకాయ ఎందుకో అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. సీఎం సిద్ధరామయ్య చేతిలో నిమ్మకాయ పట్టుకుని ప్రచారం చేస్తుండటంతో హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అధికారికంగా ట్వీట్లు చేశారు. ఈమేరకు చేతిలో నిమ్మకాయ పట్టుకుని ఉన్న సీఎం చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా నిమ్మకాయ చేత పట్టి ప్రచారం చేయడం ఆయనకే నష్టమని బీజేపీ పేర్కొంది.
నిమ్మకాయతో స్వాగతం : ఏదైనా గ్రామంలో సీఎం ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు నిమ్మకాయతో ఆయనకు స్వాగతం పలకడం పరిపాటిగా మారింది. ఇది మూఢనమ్మకం కాదా అని ఓ భారతీయుడు ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్రంలో మూఢనమ్మకాలను వీడాలి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిమ్మకాయ పట్టుకు తిరుగుతూ హిందూ సంప్రదాయాలను అణగదొక్కుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ వార్తలపై బీజేపీ నకిలీ వార్తలను ప్రచారం చేస్తోందని సీఎం ఆరోపించారు. కాగా సిద్ధరామయ్య పచ్చి అబద్ధాల కోరు అని బీజేపీ తిప్పికొట్టింది. అయితే సీఎం కుర్చీలో ఐదేళ్లుగా ఉన్నారనే విషయాన్ని వయసు మీద పడటంతో మరిచారని బీజేపీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment