CM Convoy
-
సీఎం కాన్వాయ్‌ని తనిఖీ చేసిన ఎస్ఎస్టీ.. కానీ అందులో సీఎం లేరు..!
తిరుమలగిరి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం పరిధిలోని ఈదులపర్రె తండా సమీపంలో ని చెక్‌పోస్టు వద్ద సీఎం కాన్వాయ్‌ని మంగళవారం స్టాటిస్టిక్ సర్వేలైన్ టీమ్(ఎస్ఎస్టీ) క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన సీఎం బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి జనగామ, తిరుమలగిరి మీదుగా ఈ కాన్వాయ్ వెళ్తోంది. ఇందులో బస్సుతో పాటు రెండు ఫార్చూనర్లు ఉన్నాయి. కేసీఆర్ మాత్రం ఈ కాన్వాయ్‌లో లేరు. సీఎం హెలికాప్టర్లో వెళ్లారు. ఈ తనిఖీలో టీమ్ లీడర్ జాన్ మహ్మద్, వీరన్న, రమేష్, తానీషా ఉన్నారు. -
సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో గాయపడ్డ ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న వనస్థలిపురం వద్ద సీఎం కాన్వాయ్ ఢీకొనటంతో ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే హయత్‌నగర్ పద్మావతి కాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన సూర్య ప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడించారు. వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్య ప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.