ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్లో గాయపడ్డ ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్లో గాయపడ్డ ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న వనస్థలిపురం వద్ద సీఎం కాన్వాయ్ ఢీకొనటంతో ప్రకాశ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే హయత్‌నగర్ పద్మావతి కాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన సూర్య ప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడించారు.
వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్‌ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్య ప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.