తోపుడు బళ్ల వ్యాపారానికి లైసెన్సు లు: మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాష్ట్రంలో తోపుడు బళ్ల వ్యాపారాన్ని చట్టబద్ధం చేశారు. ఈ ఘనత దేశంలో తమకు మాత్రమే దక్కుతుందని ఆమె చెప్పారు. బెంగాల్ లో వీధివ్యాపారాన్ని చట్టబద్దం చేస్తూ దీదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో దేశంలో తామే ఫస్ట్ అంటూ ప్రకటించుకున్నారు. గత 72 గంటలుగా సమ్మెచేస్తున్న చిరువ్యాపారులను ఉద్దేశించి మాట్లాడిన దీదీ.. చిరు వర్తకులకు ఈ వరాన్నందించారు.
తోపుడు బళ్ల వ్యాపారాన్ని చట్టబద్ధం చేసిన ఘనత దేశంలో తమకు మాత్రమే దక్కుతుందని, దీనిమూలంగా, చిరు వర్తకులకు భద్రత, భరోసాను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే రూపొందిస్తామని ఆమె చెప్పారు. వర్తకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలై 15 నుండి ప్రారంభిస్తామని, దరఖాస్తులను పరిశీలించిన మీదట ట్రేడ్ లైసెన్సులిస్తామని తెలిపారు. వ్యాపారం నిర్వహించుకునే క్రమంలో పాదచారులకు ఇబ్బంది కలిగించొద్దని మమత హాకర్లను కోరారు.