ప్రజలతో.. ఫేస్బుక్లో సీఎం లైవ్ చాటింగ్
కేరళలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సోషల్ మీడియాను ముమ్మరంగా ఉపయోగించుకుంటున్నారు. ఫేస్బుక్ ఇటీవల ప్రవేశపెట్టిన 'లైవ్ బ్రాడ్కాస్ట్' ఫీచర్ను ఉపయోగించుకుని ప్రజల వద్దకు వెళ్తున్నారు. దేశంలోనే ఎన్నికల సమయంలో ఓటర్ల వద్దకు ఇలా ఫేస్బుక్ ద్వారా వెళ్తున్న మొదటి సీఎం బహుశా చాందీయే అని చెబుతున్నారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు అరగంట పాటు వివిధ రంగాలకు చెందినవారితో లైవ్ చాటింగ్ చేశారు. ప్రజలు కూడా చాలా చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎంకు పలు ప్రశ్నలు సంధించారు.
విజిలెన్స్ శాఖను ఆర్టీఐ పరిధి నుంచి ఎందుకు తప్పించారని, భూమి కుంభకోణాల గురించి, కొచ్చి మెట్రోరైలు, కన్నూరు విమానాశ్రయ ప్రాజెక్టుల విషయాల్లో వచ్చిన ఆరోపణలపై ప్రశ్నలు గుప్పించారు. కన్నూరు విమానాశ్రయం ఈ యేడాదే పూర్తవుతుందని, నవంబర్ ఒకటో తేదీన ప్రారంభిస్తామని సీఎం చాందీ సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో చర్చించడానికి ఇది అద్భుతమైన వేదికగా ఉందని ఆ తర్వాత ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించడానికి ప్రజలు మనస్ఫూర్తిగా మద్దతివ్వాలని ఆయన కోరారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు మే 16వ తేదీన జరగనున్నాయి.