‘ఫ్రీ’ పబ్లిసిటీ
= ప్రీ స్కూల్ పుస్తకాలపై సీఎం, మంత్రుల ఫొటోలు
= చిన్నారుల చదువుల్లోనూ వదలని ప్రచారం
= రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచార కసరత్తు
= వాటిని చూసి అవాక్కవుతున్న చిన్నారుల తల్లిదండ్రులు
ఒంగోలు టౌన్: అర్బన్ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మార్చి కాన్వెంట్ తరహా విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ కాన్వెంట్ల పోటీని తట్టుకొని చిన్నారులను ఆకట్టుకునేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రీ స్కూల్స్‌ను ప్రారంభించింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రత్యేకంగా పుస్తకాలను కూడా ముద్రించింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రీ స్కూల్ పేరుతో ముద్రించిన పుస్తకాల అట్టలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత, మున్సిపల్ శాఖా మంత్రి పి. నారాయణ ఫొటోలను ముద్రించారు. వీటిని చూసి చిన్నారుల తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లోని ప్రీ స్కూల్స్‌కు పుస్తకాలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా పేరు మార్చడంతోపాటు రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను ప్రీ స్కూల్స్‌కు తీసుకువచ్చి అక్కడి వాతావరణాన్ని చూసి తమ పిల్లలకు కాన్వెంట్ విద్య అందుతుందన్న భరోసాతో ఇళ్లకు వెళుతున్నారు. ప్రీ స్కూల్‌కు సంబంధించి ప్రభుత్వం అందించిన పుస్తకాలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. అందుకు కారణం ప్రీ స్కూల్స్‌లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పుస్తకాల పై అట్టలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండటమే. చిన్నారుల విద్యను కూడా ప్రభుత్వం ప్రచారానికి వాడుకుంటుందంటూ అనేకమంది తల్లిదండ్రులతోపాటు విద్యావేత్తలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రచారం ‘పీక్’ స్టేజీకి చేరుకుందంటూ అనేక మంది వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఒంగోలు అర్బన్ ప్రాంతంలో 171 అంగన్వాడీ కేంద్రాలు, చీరాల అర్బన్ ప్రాంతంలో 90 అంగన్వాడీ కేంద్రాలు, మార్కాపురం అర్బన్ ప్రాంతంలో 80 అంగన్వాడీ కేంద్రాలు, కందుకూరు అర్బన్ ప్రాంతంలో 60 అంగన్వాడీ కేంద్రాలను తొలి దశలో ప్రీ స్కూల్స్‌గా మార్చేశారు. ప్రీ స్కూల్‌కు సంబంధించి తొలి విడతగా నర్సరీకి 1400, ఎల్కేజీకి 2200, యూకేజీకి 1300 పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పుస్తకాల పంపిణీ ప్రక్రియను దశల వారీగా నిర్వహిస్తున్నారు.
ఇప్పటి నుంచే ‘ఫౌండేషన్’
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు నిండింది. ఎన్నికలకు రెండేళ్ల సమయం కూడా లేకపోవడంతో ప్రచారం అనే ఫౌండేషన్‌ను పటిష్టంగా వేసుకునేందుకు ప్రీ స్కూల్స్ పుస్తకాలను ఎంచుకున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పుస్తకాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు సబ్జెక్టు పుస్తకాలను అందిస్తోంది. అయితే వాటిపై ముఖ్యమంత్రి ఫొటోలు, సంబంధిత విద్యాశాఖ మంత్రి ఫొటోలు లేవు. అయితే ప్రీ స్కూల్స్ పేరుతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు సంబంధించి ప్రభుత్వం అందించే పుస్తకాల అట్టలపై ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల ఫొటోలు ఉండటం చర్చనీయాంశమైంది.
మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు స్కూల్స్‌కు వెళ్లి వస్తున్నారంటే వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. తమ పిల్లల పుస్తకాలు ఎలా ఉన్నాయి, అందులో వారు ఏమి రాస్తున్నారన్న ఆతృతతో తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రీ స్కూల్స్‌లోని చిన్నారులకు కాన్వెంట్ విద్య కోసం ముద్రించిన పుస్తకాల అట్టలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండటంతో ఆ పుస్తకాలు కలిగిన చిన్నారుల తల్లిదండ్రులు వాటిని చూస్తూ రాబోయే ఎన్నికల వరకు తమను గుర్తుంచుకుంటూ ఉంటారన్న దురుద్దేశ్యంతోనే ఈ విధంగా ముద్రించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.