CMC hospital
-
ఇటు పెళ్లి లోగిలి.. అటు మృత్యు కౌగిలి
కుమార్తె పెళ్లి రోజే తనువు చాలించిన తండ్రి కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు, బంధువులు లక్కిరెడ్డిపల్లె : ఓవైపు కన్న కూతురి పెళ్లి.. మరో వైపు మృత్యువుతో తండ్రి పోరాటం. చివరకు బిడ్డ పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కన్ను మూశాడు. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం లక్కిరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లెకు చెందిన ముబారక్ తన కుమార్తెకు ఈనెల 7న సోమవారం పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పెళ్లికి అవసరమైన సామగ్రి తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం రాత్రి వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. పెళ్లికి బంధువులంతా రావడంతో బరువెక్కిన హృదయాలతోనే సోమవారం ఆమె వివాహాన్ని జరిపించారు. అదే రోజు రాత్రి ఆసుపత్రిలో ముబారక్ మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. వివాహానికి హాజరైన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆ నవవధువు విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ చలించిపోయారు. మృతుడు గృహ నిర్మాణ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుండటంతో ఆ శాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
వి.కోట(చిత్తూరు జిల్లా): వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఓగు గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన కొంత మంది కారులో చిత్తూరు వెళ్తున్నారు. కాగా, మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వెలూరులో ఉన్న సీఎమ్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. -
మరో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ
గుడిపాల / మదనపల్లె రూరల్: జిల్లాలో మరో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. గుడిపాల మండలం చీలాపల్లె గ్రామ ఉపసర్పంచ్ ఇందిర (31) ఈ వ్యాధి బారినపడి వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ సమాచారం జిల్లా వైద్యాధికారులకు శుక్రవారం అందింది. చీలాపల్లె ఉప సర్పంచ్ ఇందిర(31) తొమ్మిది నెలల గర్భవతి. రెండో కాన్పు కోసం సీఎంసీ ఆస్పత్రిలో ప్రతి నెలా చికిత్స పొందుతున్నారు. ఈ నెల రెండో తేదీ ఆమెకు జ్వరం రావడంతో కుటుంబసభ్యులు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెను వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉందని నిర్ధారించారు. అప్పటి నుంచి ఆమెకు అవసరమైన మేరకు చికిత్సలు చేశారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. స్వైన్‌ఫ్లూకు సంబంధించిన మాత్రలను ఇచ్చి ఇంటికి పంపారు. అనంతరం సీఎంసీ ఆస్పత్రి వైద్యాధికారులు ఈ సమాచారాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయానికి అందజేశారు. దీంతో చీలాపల్లె గ్రామం బొమ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో ఉండగా, ఆ ఆరోగ్య కేంద్ర డాక్టర్ షీలాబాను సిబ్బందితో వెళ్లి చీలాపల్లెలో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకకుండా ఉండేందుకు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. పెద్దమండ్యం మండలంలో.. పెద్దమండ్యం మండలం పాపేపల్లి పంచాయతీ వెలుగింటివారిపల్లెకు చెందిన ఆనంద్‌కు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. గతనెల 31న స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆనంద్ మదనపల్లె ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కోసం హైదరాబాదుకు పంపారు. అతనికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు శుక్రవారం రాత్రి నిర్ధారించారు.