గుడిపాల / మదనపల్లె రూరల్: జిల్లాలో మరో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. గుడిపాల మండలం చీలాపల్లె గ్రామ ఉపసర్పంచ్ ఇందిర (31) ఈ వ్యాధి బారినపడి వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ సమాచారం జిల్లా వైద్యాధికారులకు శుక్రవారం అందింది. చీలాపల్లె ఉప సర్పంచ్ ఇందిర(31) తొమ్మిది నెలల గర్భవతి. రెండో కాన్పు కోసం సీఎంసీ ఆస్పత్రిలో ప్రతి నెలా చికిత్స పొందుతున్నారు.
ఈ నెల రెండో తేదీ ఆమెకు జ్వరం రావడంతో కుటుంబసభ్యులు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెను వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉందని నిర్ధారించారు. అప్పటి నుంచి ఆమెకు అవసరమైన మేరకు చికిత్సలు చేశారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. స్వైన్‌ఫ్లూకు సంబంధించిన మాత్రలను ఇచ్చి ఇంటికి పంపారు. అనంతరం సీఎంసీ ఆస్పత్రి వైద్యాధికారులు ఈ సమాచారాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయానికి అందజేశారు. దీంతో చీలాపల్లె గ్రామం బొమ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో ఉండగా, ఆ ఆరోగ్య కేంద్ర డాక్టర్ షీలాబాను సిబ్బందితో వెళ్లి చీలాపల్లెలో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకకుండా ఉండేందుకు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు.
పెద్దమండ్యం మండలంలో..
పెద్దమండ్యం మండలం పాపేపల్లి పంచాయతీ వెలుగింటివారిపల్లెకు చెందిన ఆనంద్‌కు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. గతనెల 31న స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆనంద్ మదనపల్లె ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కోసం హైదరాబాదుకు పంపారు. అతనికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు శుక్రవారం రాత్రి నిర్ధారించారు.
మరో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ
Published Sat, Feb 7 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement