వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ వైరస్
- నగరంలో ఒకే రోజు భిన్న వాతావరణ పరిస్థితులు
- ఇదే ఈ వైరస్ విస్తరణకు కారణమంటున్న వైద్య నిఫుణులు
- ముందు జాగ్రత్త చర్యలు అవసరమని సూచన
- బుధవారం ఒక్కరోజే వివిధ ఆస్పత్రుల్లో 25 మంది చేరిక
సాక్షి, హైదరాబాద్: చాపకింద నీరులా హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా (స్వైన్‌ఫ్లూ) వైరస్ విస్తరించడానికి కారణం వాతావరణమా..? హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ విస్తరణకు వాతావరణ మార్పులకు సంబంధం ఉందా..? వీటికి అవుననే అంటున్నారు వైద్య నిఫుణులు. భిన్న వాతావరణ మార్పుల వల్లే స్వైన్‌ఫ్లూ వైరస్ వేగంగా విస్తరిస్తోందని వారు చెపుతున్నారు. నగర వాతావరణంలో ఇటీవల అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యానికి తోడు రాత్రి చలి, పగలు ఎండ, సాయంత్రం ఉక్కపోత ఇలా ఒకే రోజు భిన్న వాతావరణ పరిస్థితులు పరోక్షంగా ఈ వైరస్ బలపడటానికి దోహదపడుతున్నాయని వివరిస్తున్నారు. వాతావరణంలో 15 రకాల ఫ్లూ కారక వైరస్‌లు ఉన్నాయని, హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా(స్వైన్‌ఫ్లూ) వైరస్ వీటిలో కలసిపోయిందని ఛాతీ వైద్య నిపుణులు గుర్తించారు.
38 రోజులు.. 260 పాజిటివ్ కేసులు
తెలంగాణవ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 260 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, బాధితుల్లో 69 మంది హైదరబాద్ వాసులే. వీరిలో ఏడుగురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో 25కుపైగా కేసులు నమోదు కాగా.. వైద్యులు వారిని అనుమానిత స్వైన్ ఫ్లూ కేసులుగా అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. వికారాబాద్‌కు చెందిన 56 ఏళ్ల వృద్ధురాలితో పాటు వనస్థలిపురానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు, చాంద్రాయణగుట్టకు చెందిన 11 నెలల పాప గాంధీలో అడ్మిట్ కాగా, మిగిలిన వారు వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ఫ్లూ బారిన పడిన బాధితుల్లో 46 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులేనని వైద్యులు చెపుతున్నారు.
అవగాహన లేకనే..
బస్తీవాసులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వైన్‌ఫ్లూపై సరైన అవగాహన లేకపోవడంతో వైరస్.. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి తోడు ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న రోగులను ఉస్మానియా, గాంధీ, ఇతర ఆస్పత్రుల్లో జనరల్ వార్డుల్లోనే సాధారణ రోగుల మధ్య ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. పరీక్షల్లో ఫ్లూ పాజిటివ్‌గా నిర్థారణ అయిన తర్వాతే రోగులను ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. అప్పటికే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ఇలాంటివేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెంటిలేటర్ లేక వెనక్కి..
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ స్వైన్‌ప్లూ వార్డులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుతుంది. కానీ ఒక్క గాంధీ మినహా మరే ఆస్పత్రిలోనూ స్వైన్‌ఫ్లూ వైద్య సేవలు అందడం లేదు. స్వైన్‌ఫ్లూ సహా వివిధ వ్యాధులతో బాధపడుతూ శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతున్న వారికి కృత్రిమ శ్వాస అందించేందుకు ఐసోలేషన్ వార్డులో ఐదు, ఏఎంసీలో రెండు, డిజాస్టర్ వార్డులో ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. అప్పటికే ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్న వారికి వీటిని అమర్చుతుండటంతో.. ఆరోగ్య పరిస్థితి విషమించి, అత్యవసర పరిస్థితుల్లో గాంధీకి వస్తున్న రోగులకు ఇవి అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
మాస్క్ ధరించాలి..
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్ వాతావరణంలో రెండు గంటలకుపైగా ఉంటుంది. ఈ వైరస్ గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వైరస్ బలపడేందుకు ప్రస్తుతం వీస్తున్న చలిగాలులు దోహదపడే అవకాశం ఉంది. ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లోనూ కనిపిస్తాయి. ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి ఉంటుంది. ముక్కుకు మాస్క్ ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనన్ని సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే ఉత్తమం.
– డాక్టర్ నరేందర్, నోడల్ ఆఫీసర్, గాంధీ ఆస్పత్రి