
సాక్షి, హైదరాబాద్: జ్వరం.. జలుబు... తలనొప్పి... ఇలా ఏ చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్లినా సరే... రోగ నిర్ధారణలో భాగంగా వైద్యులు కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ) పరీక్ష చేయిస్తుంటారు. క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతూ ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులకు మాత్రమే కాదు, అవుట్ పేషెంట్(ఓపీ) విభాగానికి వచ్చే సాధారణ జ్వరపీడితులకూ ఈ టెస్టు చేయిస్తుంటారు. ఈ పరీక్షలో వచ్చే ఫలితాన్ని పరిశీలించిన తర్వాతే రోగులకు తగిన మందులు సిఫారసు చేస్తుంటారు. ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ వంటి ఖరీదైన వైద్యపరీక్షలే కాదు, సాధారణ సీబీపీ టెస్టులు కూడా జరగడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ నిర్వాకం వల్ల గత వారం నుంచి సీబీపీ టెస్టులు నిలిచిపోయాయి. రక్తపరీక్షలకు అవసరమైన కెమికల్స్(రీఏజెంట్స్) సరఫరా నిలిచిపోవడమే దీనికి కారణం.
సరఫరాకు అంగీకరించి..ఆ తర్వాత చేతులెత్తేసి...
గాంధీ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 2,500 మంది రోగులు వస్తుంటారు. మరో 2,000 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. ఓపీ రోగుల్లో రోజుకు సగటున 700 నుంచి 1,000 మందికి సీబీపీ టెస్ట్ అవసరం ఉంటుంది. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఆస్పత్రికి అత్యాధునిక వైద్య పరికరాన్ని సరఫరా చేసింది. వైద్య పరీక్షల్లో ఉపయోగించే రీఏజెంట్స్‌ను ఆస్పత్రి కొనుగోలు చేయకూడదని స్పష్టం చేసింది. ఆయా రీఏజెంట్స్‌ను తామే సరఫరా చేస్తామని టీఎస్‌ఎంఐడీసీ స్పష్టం చేసింది. కానీ గత ఐదు నెలలుగా సరఫరా చేయడం లేదు. అయితే, రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా గాంధీ ఆస్పత్రి అధికారులు అప్పటి నుంచి ఆరోగ్యశ్రీ నిధులు వెచ్చించి వీటిని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు వీటికి రూ.కోటికిపైగా వెచ్చించారు. ఆడిట్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ఇటీవల వీటి కొనుగోలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి సీబీపీ టెస్టులు నిలిచిపోయాయి. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించిన రోగులకు కనీస వైద్యసేవలు అందకపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సంస్థ ఐదు నెలలుగా రీఏజెంట్స్ సరఫరా చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కొనుగోలు చేసి సీబీపీ టెస్ట్‌లు చేస్తున్నాం. నిరుపేద రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతాం. గాంధీ సెంట్రల్ ల్యాబోరేటరీపై ఒత్తిడి తగ్గించేందుకు ఓపీలో సీపీబీ టెస్ట్‌లు చేసేందుకు త్వరలోనే మరో యంత్రాన్ని సమకూర్చుతాం. దానికి అవసరమైన రీఏజెంట్స్‌కు ఆస్పత్రి అభివృద్ధి నిధులను కేటాయిస్తాం.
– శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment