వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సిద్ధాపురానికి చెందిన నర్సయ్యకు జ్వరం వచ్చింది. ఊరిలో ఆస్పత్రి ఉంది. కానీ అందులో డాక్టర్ కాదు.. కనీసం ఓ ఉద్యోగి కూడా లేడు. వరంగల్ వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత నర్సయ్యకు లేదు. దీంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలు మండల కేంద్రంలోని రాజవీరుకు కడుపు నొప్పి వచ్చింది. అక్కడ ఆస్పత్రి ఉంది.. కానీ ఎప్పుడూ తెరుచుకోదు. చేసేది లేక దగ్గర్లోని ఆర్‌ఎంపీని సంప్రదించాడు. తాత్కాలికంగా ఉపశమనం పొందాడు.
ఇలాంటి పరిస్థితి ఈ రెండు చోట్ల మాత్రమే కాదు. గ్రామం, మండలం, పట్టణం, నగరం.. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ఇంతే. వైద్య సిబ్బంది లేక రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు దయనీయంగా ఉంటున్నాయి. కేన్సర్, గుండె, ఊపిరితిత్తులు వంటి ప్రత్యేక వైద్య సేవల గురించి దేవుడెరుగు.. సాధారణ అనారోగ్యానికి కూడా చికిత్స అందని దుస్థితి నెలకొంది. వైద్యులు లేని ఆస్పత్రులకు ప్రభుత్వం ఎన్ని వసతులు కల్పించినా ఏం లాభం? వెరసి ప్రజలకు ఉచిత వైద్యం అందడం లేదు.
– సాక్షి, హైదరాబాద్
నియామకాలేవీ..?
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులు, సిబ్బంది రిటైర్మెంట్ కావడమేగానీ కొత్తగా నియామకాలు జరగడం లేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆస్పత్రుల్లో వసతులు, పరికరాలను పెంచుతున్నారని, కానీ ఒక్క పోస్టునూ భర్తీ చేయని పరిస్థితి ఉందని ఆ శాఖ ఉన్నతాధికారులే వాపోతున్నారు. పెరిగిన అవసరాలకు తగినట్లుగా పోస్టులను మంజూరు చేయడం లేదు. ఖాళీ అవుతున్న వాటిని భర్తీ చేయడం లేదు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి ప్రస్తుతం 37,141 పోస్టులు ఉన్నాయి. అందులో 11,317 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవికాక రాష్ట్ర ప్రభుత్వ తాజా లక్ష్యాల ప్రకారం అన్ని ఆస్పత్రుల్లో 24 గంటల సేవలు అందించాలంటే మరో 12,353 పోస్టులు అవసరమవుతాయని వైద్యారోగ్య శాఖ నిర్ధారించింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 11,317 పోస్టులు, కొత్తగా అవసరమైన 12,353 పోస్టులు కలిపితే.. 23,670 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని విభాగాల్లో కలిపి 6,180 పోస్టుల భర్తీకే అనుమతి ఇచ్చింది. వీటిలోనూ కొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రమే మొదలైంది.
రోజుకు 2.5 లక్షల మంది..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు (ఎంబీబీఎస్ డాక్టర్లు) అందుబాటులో లేకపోవడంతో పేదలు ఆర్‌ఎంపీల వద్దకు వెళ్తున్నారు. ప్రాథమిక వైద్యమే కాకుండా, కొన్నిసార్లు అత్యవసర వైద్యానికి కూడా వీరి దగ్గరికే వెళ్తున్నారు. రాష్ట్రంలో 24,797 మంది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీసనర్స్ (ఆర్‌ఎంపీ), ప్రైవేటు మెడికల్ ప్రాక్టీసనర్స్(పీఎంపీ) సేవలను కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు వీరి వద్దకే వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున ప్రతి రోజు పది మంది వరకు ఆర్‌ఎంపీల వద్దకు వైద్యానికి వెళ్తున్నారని అంచనా. ఈ లెక్కన 2.5 లక్షల మంది ఆర్‌ఎంపీల వద్దనే వైద్యం పొందుతున్నారు. రాష్ట్రంలో అల్లోపతి, ఆయుర్వేద, యునాని, హోమియో వైద్యులు లేకపోవడంతో పేదలు పీఎంపీ వద్దకు వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment