8 మంది చిన్నారులకు స్వైన్‌ఫ్లూ
గాంధీ ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది చిన్నారులు స్వైన్‌ఫ్లూ బారినపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన పాప (9 నెలలు), నల్లగొండకు చెందిన బాలుడు (08), రంగారెడ్డి జిల్లా బాబాపూర్‌కు చెందిన చిన్నారి (6 నెలలు)ని స్వైన్‌ఫ్లూ లక్షణాలతో కొద్దిరోజుల క్రితం నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. నిర్ధారణ వైద్యపరీక్షల్లో వారికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో చేరాలని ఈ నెల 6న రిఫర్ చేశారు.
నగరంలోని వివిధ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు బొల్లారం ప్రాంతానికి చెందిన బాలిక (03), గాంధీనగర్‌కు చెందిన బాలుడు(05), చాంద్రాయణగుట్టకు చెందిన బాలుడు(01), ఘట్కేసర్‌కు చెందిన బాలిక (02), వికారాబాద్ జిల్లా తాండురుకు చెందిన బాలుడు (5 నెలలు)లకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు వారిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారులకు పీఐసీయూలో వైద్యసేవలు అందిస్తున్నామని, వారంతా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఎండాకాలంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని, చిన్నారులు దీని బారిన పడుతున్నారని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూపాంతరం చెందిన స్వైన్‌ఫ్లూ వైరస్‌పై సమగ్ర పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.