రాజధానిపై స్వైన్ ఫ్లూ
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : రాజధాని నగరంలో స్వైన్ ఫ్లూ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూ కూడా సాధారణమే అని చెప్పుకుంటూ రాగా.. ఇద్దరు మృతువాత పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బాలికకు సైతం స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలడంతో ఆందోళన కలిగించే అంశంగా చెపుతున్నారు. ఇద్దరు మృతి చెందిన తర్వాతే రిపోర్టులు రావడం గమనార్హం. నగరంలో నిర్ధారణ కాకుండా మరింత మందిలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అప్రమత్తత ఏదీ?
మూడు జాతీయ రహదారులు.. అతి పెద్ద రైల్వే స్టేషన్ ఉన్న రాజధాని నగరంలో స్వైన్ ఫ్లూ విషయంలో అంతగా జాగ్రత్తలు తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. జలుబు, జ్వరం వస్తే సాధారణ జ్వరంగానే భావించి చికిత్స చేయడంతో పరిస్థితి విషమిస్తున్నట్లు చెపుతున్నారు. బాపులపాడు మండలానికి చెందిన బాలిక ఈ నెల 2నే ప్రభుత్వాస్పత్రిలో చేరగా, తొలుత సాధరణ జ్వరంగానే భావించిన వైద్యులు పదిరోజుల అనంతరం ఈ నెల 22న వైరల్ ల్యాబ్‌కు శాంపిల్‌ను పంపించారు. ఆ రిపోర్టు వచ్చే సరికే బాలిక మృతి చెందడంతో శుక్రవారం రాత్రి బంధువులు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఇద్దరు బాలికల శాంపిల్స్ పంపిస్తే, ఇద్దరికీ పాజిటివ్ రావడం కూడా ఆందోళన కలిగిస్తోంది.
సేఫ్టీ పరికరాలు నిల్
స్వైన్ ఫ్లూ పాజిటివ్ రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన సేఫ్టీ పరికరాలు ప్రభుత్వాస్పత్రిలో అంతంత మాత్రంగానే ఉండటంతో తమకు ఎక్కడ సోకుతుందోనని వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మాస్కులు, ఇతర కిట్‌లు సరైనవి లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయగా, ఇద్దరు చిన్నారులు రావడంతో పాత ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి వారికి చికిత్స అందించారు. మరోవైపు వైద్య సిబ్బందికి రెండేళ్లుగా స్వైన్‌ఫ్లూ రాకుండా వ్యాక్సిన్‌లు కూడా వేయడం లేదని చెపుతున్నారు. ఇప్పుడు స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వస్తున్నాయని, ఎక్కడ వ్యాధి సోకుతుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారానికే పరిమితం
స్వైన్ ఫ్లూ విషయంలో ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందనే వాదన వినిపిస్తోంది. గుంటూరులో వైరల్ ల్యాబ్ ఏర్పాటు చేశారని, అక్కడికి శాంపిల్స్ పంపించాలని వైద్యులకు పైనుంచి ఆదేశాలు అందాయి. దీంతో విజయవాడ నుంచి అక్కడికి శాంపిల్స్ పంపగా, రిపోర్టులు మాత్రం తిరుపతి నుంచి వచ్చాయి. అంటే అక్కడికి వచ్చిన శాంపిల్స్‌ను తిరుపతికి పంపిస్తున్నట్లు వాటి ద్వారా నిర్ధారణ అవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రాణాంతక వ్యాధుల విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా ప్రచారానికే పరిమితం కావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన స్పందించి స్వైన్ ఫ్లూ మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.