హావెల్స్ ఇండియా లాభం 74% డౌన్
► అంతర్జాతీయ వ్యాపారానికి గుడ్‌బై
► ఒక్కోషేర్‌కు రూ.3.5 డివిడెండ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఉపకరణాల సంస్థ హావెల్స్ ఇండియా స్టాండ్ అలోన్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.95 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో సాధించిన నికర లాభం రూ.366 కోట్లతో పోలిస్తే 74 శాతం క్షీణించినట్లు లెక్క. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,598 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.1,873 కోట్లకు పెరిగింది.
స్థూల లాభం రూ.219 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.234 కోట్లకు పెరిగినట్లు హావెల్స్ ఇండియా సీఎండీ అనిల్ రాయ్ గుప్తా చెప్పారు. అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి వైదొలగినందుకు గాను రూ.77 కోట్లు కేటాయింపులు జరిపామని వెల్లడించారు. మొత్తం వ్యయాలు రూ.1,379 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.1,640 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.3.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు.
తగ్గిన మార్జిన్లు: అన్ని సెగ్మెంట్లలో వృద్ది బాట పడుతున్నామని గుప్తా చెప్పారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దును తట్టుకోవడానికి డీలర్లకు ఇచ్చిన ప్రోత్సాహాకాలు, ముడి పదార్ధాల ధరలు పెరిగినప్పటికీ, ధరలు పెంచకపోవడంతో మార్జిన్లు తగ్గాయని తెలియజేశారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2015–16లో రూ.1,300 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం తగ్గి రూ.494 కోట్లకు పరిమితమయింది.
మొత్తం ఆదాయం రూ.8,101 కోట్ల నుంచి 17 శాతం క్షీణించి రూ.6,751 కోట్లకు తగ్గింది. యూరోప్ లైటింగ్ బిజినెస్ సిల్వేనియాలో మిగిలిన 20 శాతం వాటాను చైనాకు చెందిన ఫీలో అకౌస్టిక్స్‌కు రూ.242 కోట్లకు విక్రయించనున్నామని, దీంతో అంతర్జాతీయ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగినట్లవుతుందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. చివరకు 2.5 శాతం లాభంతో రూ.514 వద్ద ముగిసింది.