నెలరోజుల్లో ఎన్సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా
సాక్షి, ముంబై: నెలరోజుల్లో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై సోమవారం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్పవార్తోపాటు ఇరు కాంగ్రెస్‌ల మహారాష్ట్ర అధ్యక్షులు పాల్గొననున్నారన్నారు.
అనంతరం నెల రోజుల్లోగా ఎన్సీపీ తమ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా ఈసారి అత్యధిక లోక్‌సభ స్థానాలకు దక్కించుకుని కేంద్రంలో కీలకపాత్ర పోషించేందుకు ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలో కంటే అధికస్థానాలు దక్కించుకేనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పొత్తులు ఖరారు చేసుకోవడంతోపాటు సీట్ల పంపకాల విషయంపై చర్చలు జరిపేందుకు ఇరు పార్టీల నాయకులు ఉద్రుక్తులవుతున్నారు. ఎన్సీపీ ఒక అడుగు ముందుకు వేసి నెలలోగానే అభ్యర్థులకు ప్రకటించనున్నట్టు పేర్కొనడం విశేషం.