భారత బాక్సింగ్ బాధ్యతలు స్పాన్సర్లకు
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య గుర్తింపును గత మార్చిలో రద్దు చేసిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ), దేశంలో బాక్సింగ్ నిర్వహణ బాధ్యతల్ని తాజాగా రెండు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించింది. దీర్ఘకాలంగా భారత బాక్సింగ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న మోనెట్ ఇస్పాత్ లిమిటెడ్ సీఎండీ సందీప్ జజోడియా, భారత వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్ (డబ్ల్యూఎస్బీ) ఫ్రాంచైజీ యజమాని ఉదిత్ సేథ్‌లను తాత్కాలిక ప్రతినిధులుగా ఏఐబీఏ నిర్ణయించింది.
ఎన్నికలు నిర్వహించి, కొత్త సమాఖ్యను ఏర్పాటు చేసే వరకు వీరు ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. తాత్కాలిక బాధ్యతల్ని చేపట్టి, సమాఖ్య ఏర్పాటుకు చర్యలు తీసుకునే వారికోసం ఏఐబీఏ ఏప్రిల్ 28న దరఖాస్తులు కోరగా.. ఈ రెండు సంస్థలు బాక్సింగ్ ఇండియా పేరిట ఓ గ్రూపుగా ఏర్పడి తమ ప్రణాళికను వివరించాయి. ‘రింగ్ బయట బౌట్’ పేరుతో తాము ఇచ్చిన ప్రజెంటేషన్, భారత బాక్సింగ్ భవిష్యత్తుపై తమకు గల దూరదృష్టికి సంతృప్తి చెందిన ఏఐబీఏ ఈ బాధ్యతల్ని తమకు అప్పగించినట్లు బాక్సింగ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.