co-operative society
-
గ్రామీణుల కష్టాల సంగతేంటి?
• సహకార సంఘాల్లో నగదు కొరతపై ఏం చర్యలు తీసుకున్నారు? • ‘నోట్ల రద్దు’పై కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న • కావాలనే సహకార సంఘాల్ని నగదు మార్పిడి నుంచి తప్పించాం: కేంద్రం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అసౌకర్యాల్ని పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే సామాన్యులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు పరిష్కరించేందుకు తీసుకున్న చర్యల్ని పేర్కొంటూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందా? లేదా?, నగదు దొరక్క ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం శుక్రవారం వాదనలు ఆలకించింది. నోట్ల రద్దు అనంతరం వేర్వేరు అంశాలపై వివిధ హైకోర్టుల్లో అనేక కేసులు దాఖలయ్యాయని, కేరళ, కోల్‌కతా, జైపూర్, ముంబై... ఇలా వివిధ హైకోర్టుల్లో దాఖలైన కేసులు డీల్ చేయడం తమకు సాధ్యం కాదని, అన్నీ కలిపి ఏదోఒక హైకోర్టుకు బదిలీ చేయడమో లేదా... సుప్రీంకోర్టులో విచారించడమో చేయాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. నోట్ల రద్దు అనంతరం దాఖలైన అన్ని పిటిషన్లను సంబంధిత పార్టీలన్నీ కలిసి కూర్చుని పరిశీలించి... ఏ కేసులు హైకోర్టులకు బదిలీ చేయవచ్చో, ఏవి సుప్రీంకోర్టులో విచారించవచ్చో పేర్కొంటూ జాబితా సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ... పిటిషనర్లు అందరూ కలిసి కూర్చుని జాబితా రూపొందించి సోమవారం కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు. సహకార సంఘాల్లో నకిలీలను గుర్తించే సౌకర్యం లేదు: కేంద్రం సహకార సంఘాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడ్డారని, నోట్ల రద్దు అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ అటార్నీ జనరల్‌ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రోహత్గీ సమాధానమిస్తూ... మిగతా బ్యాంకులతో పోలిస్తే సహకార బ్యాంకుల్లో సరైన మౌలిక వసతులు, యంత్రాంగం లేదన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. కేంద్రం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో సహకార బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల్నే పేర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వం కావాలనే నగదు మార్పిడి, సరఫరా నుంచి సహకార సంఘాల్ని దూరం పెట్టిందని, నకిలీ కరెన్సీని గుర్తించే నిపుణత సహకార బ్యాంకుల వద్ద లేదని రోహత్గీ వాదించారు. సహకార సంఘాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పి.చిదంబరం వాదిస్తూ... సహకార సంఘాల్ని నగదు మార్పిడి పక్రియలో చేర్చకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. అనంతరం కోర్టు వాదనలను డిసెంబర్ 5కు వారుుదా వేసింది. -
కాసులిస్తే ఓకే.. లేదంటే బ్రేకే
పుల్లంపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించి ఆ మేరక ఉత్తర్వులు జారీ చేశారు. రుణ మాఫీ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత అధికారులకు కాసులు సమర్పిస్తేనే ఆ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేస్తున్నారని..లేదంటే రకరకాల నిబంధనల పేరుతో వారిని వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుల్లంపేట మండలంలో మూడు వ్యవసాయ పరపతి సంఘాలున్నాయి. అనంతయ్యగారిపల్లి, అనంతంపల్లి, అనంతసముద్రం. సహకార సంఘాల పరిధిలో అర్హత కలిగిన రైతులకు రూ.2కోట్ల రుణమాఫీకి బ్యాంకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.2కోట్లు నిధులు మంజూరు చేసింది. అయితే బ్యాంకు అధికారులు ఇప్పటివరకు రూ.1.40కోట్లు రుణమాఫీ పంపిణీ చేశారు. మిగిలిన రూ.60లక్షలు రైతులకు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అదేమంటే ఏదో ఒక సాకు చూపి ఈ డబ్బును ప్రభుత్వానికి తిప్పి పంపనున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రమంతటాలేని నిబంధనలు ఒక పుల్లంపేట సహకార సంఘంలోనే ఉన్నాయా అంటూ పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. మాకు అన్ని అర్హతలు ఉన్నా అధికారులు ఇలా వేధించడం తగదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసులు సమర్పించుకుంటే ఓ రకంగా లేదంటే మరో రకంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆర్.గొల్లపల్లికి చెందిన నరసింహారెడ్డి అనే రైతుకు ప్రభుత్వం రుణమాఫీ మంజూరు చేసినా బ్యాంకర్లు మాత్రం అతన్ని తిప్పుకుంటూనే ఉన్నారు. పుల్లంపేట సహకార సంఘాలలో భారీగా అవినీతి జరిగిందని దీనిపై విచారణ చేపడితే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. బ్యాంకు మేనేజర్ వివరణ: సహకార బ్యాంకులో అవకతవకల గురించి బ్యాంకు మేనేజర్ బాలచంద్రను వివరణ కోరగా అర్హులైన రైతులకు వారి ఖాతాలో డబ్బులు జమ చేశామని, అర్హులుకాని వారికి నిలిపి వేశామని చెప్పారు. – బాలచంద్ర, డీసీసీ బ్యాంకు మేనేజర్, పుల్లంపేట. అనంతంపల్లి సొసైటీ బ్యాంకులో రూ.50వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం నుంచి నాకు రూ.25వేలు రుణమాఫీ వచ్చింది. పలుమార్లు కార్యాలయం చుటూ తిరిగినా అధికారులు మాత్రం కనికరించలేదు. ఉన్నతాధికారులు స్పందించి నా రుణమాఫీ మొత్తాన్ని నా ఖాతాలో జమచేయాలని కోరుకుంటున్నా. – నరసింహారెడ్డి, రైతు, ఆర్.గొల్లపల్లి. -
ధాన్యం కొను‘గోల్మాల్’
- 5496.50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్టు రికార్డుల సృష్టి - పక్కా సమాచారంతో దాడిచేసి పట్టుకున్న జేసీ సత్యనారాయణ - డీసీసీబీ చైర్మన్ అధ్యక్షుడిగా ఉన్న సొసైటీలోనే ఈ అక్రమాలతంతు కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన సహకార సొసైటీలే అక్రమాలకు తెరలేపాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యకుండానే కొన్నట్లు రూ. 77 లక్షల విలువ గల ధాన్యం కొనుగోలు చేసినట్టు కాగితాల మీద కాకి లెక్కలు సృష్టించారు. మిల్లర్లు,సొసైటీ నిర్వాహకులు కలిసి సాగించిన ఈ దందాను పసిగట్టిన జాయింట్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా దాడి చేసి బట్టబయలు చేశారు. ఈ కుంభకోణం జరిగిన రెండు సొసైటీల్లో ఒకదానికి సాక్షాత్తు డీసీసీబీ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కోదాడటౌన్ : రైతులకు మద్దతు ధర కల్పించడానికి ఈ సంవత్సరం ఐకేపీ కేంద్రాలతో పాటు సహకార సోసైటీలకు ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ అనుమతి ఇచ్చింది. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, గుడిబండ(కోదాడ సొసైటీ సబ్‌సెంటర్) సొసైటీలు కూడ ధాన్యం కొనుగోలు చెయ్యడానికి ముందుకువచ్చాయి. ఈ విధంగా ధాన్యం కొన్నందుకు ప్రతి క్వింటాకు ప్రభుత్వం రూ.32 కమీషన్ రూపంలో సొసైటీకి చెల్లిస్తుంది. ఇది చాలదనుకున్నారో ఏమోగానీ ఎకంగా లక్షల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. ఈ రెండు సొసైటీలో గింజ ధాన్యం కూడా రైతుల నుంచి కొనుగోలు చెయ్యలేదు. కానీ రైతుల నుంచి 5496.50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కొనుగోలు చేసిన ఈ ధాన్యం కోదాడలోని శ్రీరంగాపురం సమీపంలో ఉన్న గౌరీశంకర్ రైస్ మిల్లును లీజుకు తీసుకుని నడుపుతున్న కాంట్రాక్టర్ జేవీ రామరావుకు సరఫరా చేసినట్లు దొంగ ట్రక్‌సీట్లు సృష్టించారు. అంటే రైతుల నుంచి గింజ ధాన్యం కొనకుండానే 5496.50 కింటాళ్ల(13,730 బస్తాలు) కొన్నట్లు, కోదాడకు రవాణా చేసినట్లు కాగితాల మీద కాకి లెక్కలు సృష్టించి డబ్బులను ఖాతాలో వేసుకోవడానికి బిల్లులను పౌరసరఫరాలశాఖకు సమర్పించారు. రహస్య ఫిర్యాదుతో కదిలిన డొంక... కాపుగల్లు, గుడిబండ సొసైటీలో జరుగుతున్న అక్రమ తంతును కొందరు అదే శాఖకు చెందిన ఉద్యోగులు జాయింట్ కలెక్టర్‌కు సమాచారం అందించడంతో ఆయన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు కలిసి కోదాడలోని గౌరిశంకర్ రైస్ మిల్లుపై శుక్రవారం ఆకస్మికదాడి చేశారు. మిల్లులో ఈ రెండు సోసైటీల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లేకపోవడంతో పాటు ట్రక్‌సీట్లు దొంగవని ఆయన గుర్తించారు. దీనిపై మిల్లు మేనేజర్ సరైన సమాధానం ఇవ్వక పొవడంతో జేసీ మండిపడ్డారు. ఈ సొసైటీలే కాకుండా ఇతర ఐకేపీ, సొసైటీల నుంచి సదరు మిల్లుకు 21 వేల క్విటాళ్ల ధాన్యం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేశామని, కొనుగోలు చెయ్యని 5496 క్వింటాళ్లు పోను మిగిలిన 16 వేల క్వింటాళ్లను స్వాధీనం చేసుకుని ఇతర మిల్లులకు సరఫరా చేస్తామన్నారు. మిల్లును సీజ్ చేసి మిల్లు లీజుదారుడిపై 6(ఏ) కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. సొసైటీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సొసైటీలకు ధాన్యం కొనుగోలు చెయ్యమంటే కొనకుండానే దొంగట్రక్సీట్లు సృష్టించి మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సబ్ సెంటర్ల వల్ల ఇబ్బందుల వస్తున్నందున వాటిని వెంటనే మూసివేయ్యాలని ఆదేశించామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని ఎక్కడ అక్రమాలు జరిగినా చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. -
పోలీసుల భక్తి
కర్నూలు : పోలీసులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ రాంపుల్లయ్య యాదవ్‌ను అవిశ్వాస తీర్మా నం ద్వారా తప్పించేందుకు టీడీపీ నేతలు అధికార దర్పాన్ని వినియోగించారు. అందు కు తగిన బలం లేకపోవడం.. తీర్మానం వాయిదా పడటంతో పోలీసులను రంగంలోకి దింపడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం రాత్రి గంట పాటు రాంపుల్లయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్‌లో 12 మంది డెరైక్టర్లు ఉండగా.. వైఎస్ఆర్సీపీకి చెందిన రాంపుల్లయ్య యాదవ్‌ను చైర్మన్ పోలీసుల భక్తి పదవి నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా 8 మంది డెరైక్టర్లను మభ్యపెట్టి అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం చేయించారు. అయితే తమను తప్పుదోవ పట్టించారని ఇరువురు డెరైక్టర్లు తమ్మన్న, పెద్దారెడ్డిలు అవిశ్వాసానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. షాక్ తిన్న టీడీపీ నేతలు రాంపుల్లయ్య యాదవ్‌ను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులను ఉసిగొలిపారు. సీఐలు ప్రవీణ్‌కుమార్, నాగరాజరావు నేతృత్వంలో నగరంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్న రాంపుల్లయ్య ఇంట్లో గంట పాటు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో లక్కీటూ బ్రదర్స్ రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ ఇంట్లో లేరు. తమ కుటుంబం రాజకీయంగా ఓ హోదాలో ఉందని.. సమాచారం లేకుండా ఎలా సోదాలు నిర్వహిస్తారంటూ మహిళలు నిలదీసినా పోలీసులు లెక్కచేయక ఇంట్లోకి ప్రవేశించి ‘దేశం’ భక్తిని చాటుకున్నారు. రాత్రి వేళ పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఏమి జరిగిందోనని కాలనీ ప్రజలు భారీగా గుమికూడారు. ప్రతిపక్ష పార్టీ నేతలను లొంగదీసుకునేందుకు టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని పాత కేసులను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. మూడో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో భూవివాదం కేసు పెండింగ్‌లో ఉందంటూ పోలీసులు మహిళలతో వాదనకు దిగారు. కేసులు ఏవైనా ఉంటే స్టేషన్‌కు పిలిపించుకొని మాట్లాడాలే కానీ.. ఇలా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఎలా వస్తారంటూ రాంపుల్లయ్య కుటుంబ సభ్యులు నిలదీశారు. చేసేది లేక వారితో ఓ విజ్ఞాపన పత్రం రాయించుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సాగులో ‘సహకార’o
ముథోల్ : సహకార సంఘం ఆ గ్రామ రైతులను అభివృద్ధి వైపు నడిపిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే విక్రయిస్తూ మరికొందరు రైతులకు చేయూతనిస్తోంది. పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడలపై అవగాహన కల్పిస్తూ.. సూచనలు, సలహాలు అందిస్తూ ఆసరాగా నిలుస్తోంది. మండలంలో ని ఎడ్బిడ్ గ్రామంలో 2007 జనవరి మొదటి వారంలో 36 మంది రైతులు కలిసి మల్లికార్జున పరస్పర సహకార పొదుపు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం రూ.వెయ్యి, రూ.1,500 చొప్పున చెల్లించారు. ఈ సంఘానికి చైర్మన్‌తోపాటు తొమ్మిది మంది డెరైక్టర్లను ఎన్నుకున్నారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడి నుంచి రూ.50 చొప్పున సేకరించి పొదుపు చేస్తున్నారు. ప్రతీ నెల ఐదో తేదీన సమావేశం ఏర్పాటు చేసి సంఘం కార్యకలాపాలపై సమీక్షిస్తారు. ఇలా పొదుపు చేసిన డబ్బులతో రూ.15లక్షలు వెచ్చించి సంఘ భవనాన్ని నిర్మించారు. 36మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 46 మంది సభ్యులు ఉన్నారు. నాలుగేళ్లలో సంఘానికి పొదుపు, ఇతర వనరుల ద్వారా రూ.కోటీ 50లక్షలు సమకూరిందని సంఘం అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. -
టీడీపీ వలలో అధికారులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వివాదాస్పదంగా నిలిచిపోయిన జిల్లా మత్స్యకార సహకార సంఘం ఎన్నిక విషయంలో హైడ్రామా నడుస్తోంది. టీడీపీ ఆడుతున్న నాటకంలో అధికారు లే పాత్రధారులవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ ఆదేశించినా ఆ దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు. ఇప్పటికి ఐదురోజులు గడుస్తున్నా ఎన్నిక ప్రక్రియపై కనీసం మాట్లాడక పోవడం చూస్తుంటే అధికార పార్టీ నేతలు చెప్పినట్లే అధికారులు తలాడిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల అధికారి అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడడం వల్లే ఎన్నికను నిలిపివేసినట్టు మత్స్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఫణిప్రకాశ్ ప్రకటించినా దాని వెనుక పెద్ద కథే నడిచిందన్నది అందరికీ విదితమే. అంతవరకు ఆరోగ్యంగా ఉన్న ఎన్నికల అధికారి కరెక్ట్‌గా ఎన్నికల సమా యానికి అనారోగ్యం పాలయ్యానంటూ ఆస్పత్రిలో చేరడం వెనుక కుట్ర దాగి ఉందనడంలో అందరిదీ ఒకటే అభిప్రాయం. జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిళ్ల మేరకు ఓ ఉన్నతాధికారి యుద్ధప్రాతిపదికన ఎన్నికల అధికారికి ఫోన్ చేసి, తక్షణమే అనారోగ్యం సాకుతో గైర్హాజరవ్వాలని హకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఎన్నికల అధికారి అయిష్టంగానే ఆ రోజు ఆస్పత్రిలో చేరినట్టు కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సెలవుపై వెళ్లిపోవాలని కూడా ఆ ఉన్నతాధికారి సలహా పారేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఎన్నిక నిర్వహణపై చర్యలు తీసుకోవాలని జేసీ రామారావు ఆదేశించినా ఇంతవరకు ఆ ఊసేలేదు. కానీ, మత్స్య శాఖ ఎ.డి. ఫణిప్రకాశ్ మాత్రం ఎన్నిక నిర్వహణ విషయమై కలెక్టర్‌కు ఫైల్ పెట్టామని చెప్పుకొస్తున్నారు. అయితే ఇంతవరకు ఆ ఫైలు కనీసం పరిశీలన దశలో కూడా లేదని, ఈ విషయంలో అధికార పార్టీ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఇంతవరకు తాత్సారం చేసిన ఆయన నూతన కలెక్టర్‌కు సోమవారం బాధ్యతలు అప్పగించి రిలీవ్ కానున్నారు. ఓ రెండు శాఖలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దండు మారమ్మ కల్యాణ మండపం స్థల వివాదంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అనుకున్నది సాధించేవరకు పట్టుబట్టి ముందుకెళ్లిన కలెక్టర్ కాంతిలాల్ దండే ఈ విషయంలో తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే కలెక్టర్ వెనక్కి తగ్గారా అన్న అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది. ఆ స్థాయి అధికారులు కూడా ఒత్తిళ్లకు లొంగిపోతే సామాన్యులు తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనే వాదన విన్పిస్తోంది.