సాక్షి ప్రతినిధి, విజయనగరం: వివాదాస్పదంగా నిలిచిపోయిన జిల్లా మత్స్యకార సహకార సంఘం ఎన్నిక విషయంలో హైడ్రామా నడుస్తోంది. టీడీపీ ఆడుతున్న నాటకంలో అధికారు లే పాత్రధారులవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ ఆదేశించినా ఆ దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు. ఇప్పటికి ఐదురోజులు గడుస్తున్నా ఎన్నిక ప్రక్రియపై కనీసం మాట్లాడక పోవడం చూస్తుంటే అధికార పార్టీ నేతలు చెప్పినట్లే అధికారులు తలాడిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల అధికారి అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడడం వల్లే ఎన్నికను నిలిపివేసినట్టు మత్స్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఫణిప్రకాశ్ ప్రకటించినా దాని వెనుక పెద్ద కథే నడిచిందన్నది అందరికీ విదితమే. అంతవరకు ఆరోగ్యంగా ఉన్న ఎన్నికల అధికారి కరెక్ట్‌గా ఎన్నికల సమా యానికి అనారోగ్యం పాలయ్యానంటూ ఆస్పత్రిలో చేరడం వెనుక కుట్ర దాగి ఉందనడంలో అందరిదీ ఒకటే అభిప్రాయం. జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిళ్ల మేరకు ఓ ఉన్నతాధికారి యుద్ధప్రాతిపదికన ఎన్నికల అధికారికి ఫోన్ చేసి, తక్షణమే అనారోగ్యం సాకుతో గైర్హాజరవ్వాలని హకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఎన్నికల అధికారి అయిష్టంగానే ఆ రోజు ఆస్పత్రిలో చేరినట్టు కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సెలవుపై వెళ్లిపోవాలని కూడా ఆ ఉన్నతాధికారి సలహా పారేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకటి రెండు రోజుల్లో ఎన్నిక నిర్వహణపై చర్యలు తీసుకోవాలని జేసీ రామారావు ఆదేశించినా ఇంతవరకు ఆ ఊసేలేదు. కానీ, మత్స్య శాఖ ఎ.డి. ఫణిప్రకాశ్ మాత్రం ఎన్నిక నిర్వహణ విషయమై కలెక్టర్‌కు ఫైల్ పెట్టామని చెప్పుకొస్తున్నారు. అయితే ఇంతవరకు ఆ ఫైలు కనీసం పరిశీలన దశలో కూడా లేదని, ఈ విషయంలో అధికార పార్టీ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఇంతవరకు తాత్సారం చేసిన ఆయన నూతన కలెక్టర్‌కు సోమవారం బాధ్యతలు అప్పగించి రిలీవ్ కానున్నారు. ఓ రెండు శాఖలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దండు మారమ్మ కల్యాణ మండపం స్థల వివాదంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అనుకున్నది సాధించేవరకు పట్టుబట్టి ముందుకెళ్లిన కలెక్టర్ కాంతిలాల్ దండే ఈ విషయంలో తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే కలెక్టర్ వెనక్కి తగ్గారా అన్న అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది. ఆ స్థాయి అధికారులు కూడా ఒత్తిళ్లకు లొంగిపోతే సామాన్యులు తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనే వాదన విన్పిస్తోంది.
టీడీపీ వలలో అధికారులు
Published Mon, Jul 14 2014 3:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement