పుల్లంపేట:
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించి ఆ మేరక ఉత్తర్వులు జారీ చేశారు. రుణ మాఫీ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత అధికారులకు కాసులు సమర్పిస్తేనే ఆ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేస్తున్నారని..లేదంటే రకరకాల నిబంధనల పేరుతో వారిని వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుల్లంపేట మండలంలో మూడు వ్యవసాయ పరపతి సంఘాలున్నాయి. అనంతయ్యగారిపల్లి, అనంతంపల్లి, అనంతసముద్రం.
సహకార సంఘాల పరిధిలో అర్హత కలిగిన రైతులకు రూ.2కోట్ల రుణమాఫీకి బ్యాంకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.2కోట్లు నిధులు మంజూరు చేసింది. అయితే బ్యాంకు అధికారులు ఇప్పటివరకు రూ.1.40కోట్లు రుణమాఫీ పంపిణీ చేశారు. మిగిలిన రూ.60లక్షలు రైతులకు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అదేమంటే ఏదో ఒక సాకు చూపి ఈ డబ్బును ప్రభుత్వానికి తిప్పి పంపనున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రమంతటాలేని నిబంధనలు ఒక పుల్లంపేట సహకార సంఘంలోనే ఉన్నాయా అంటూ పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
మాకు అన్ని అర్హతలు ఉన్నా అధికారులు ఇలా వేధించడం తగదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసులు సమర్పించుకుంటే ఓ రకంగా లేదంటే మరో రకంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆర్.గొల్లపల్లికి చెందిన నరసింహారెడ్డి అనే రైతుకు ప్రభుత్వం రుణమాఫీ మంజూరు చేసినా బ్యాంకర్లు మాత్రం అతన్ని తిప్పుకుంటూనే ఉన్నారు. పుల్లంపేట సహకార సంఘాలలో భారీగా అవినీతి జరిగిందని దీనిపై విచారణ చేపడితే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రైతులు పేర్కొంటున్నారు.
బ్యాంకు మేనేజర్ వివరణ: సహకార బ్యాంకులో అవకతవకల గురించి బ్యాంకు మేనేజర్ బాలచంద్రను వివరణ కోరగా అర్హులైన రైతులకు వారి ఖాతాలో డబ్బులు జమ చేశామని, అర్హులుకాని వారికి నిలిపి వేశామని చెప్పారు.
– బాలచంద్ర, డీసీసీ బ్యాంకు మేనేజర్, పుల్లంపేట.
అనంతంపల్లి సొసైటీ బ్యాంకులో రూ.50వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం నుంచి నాకు రూ.25వేలు రుణమాఫీ వచ్చింది. పలుమార్లు కార్యాలయం చుటూ తిరిగినా అధికారులు మాత్రం కనికరించలేదు. ఉన్నతాధికారులు స్పందించి నా రుణమాఫీ మొత్తాన్ని నా ఖాతాలో జమచేయాలని కోరుకుంటున్నా.
– నరసింహారెడ్డి, రైతు, ఆర్.గొల్లపల్లి.