Coal generation
-
హైడ్రో పవర్‌పై సింగరేణి ఫోకస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి సంస్థ ఇప్పుడు తన పరిధి ని విస్తరిస్తోంది. ఇప్పటికే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ మరో యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఏడాదిన్నరలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందుబాటులో ఉన్న వనరుల ను ఉపయోగించుకోవడం ద్వారా సోలార్ –హైడ్రో పవర్‌పై కూడా దృష్టి పెట్టింది. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరి యాల్లో విస్తరించి ఉంది. సంస్థ ఆధీనంలో 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ 11 ఏరియాల పరిధిలో గత కొన్నేళ్లుగా సింగరేణి సోలార్ పవర్ స్టేషన్లను నెలకొల్పుతోంది. ప్రస్తుతం సింగరేణి సోలార్ విద్యుత్ సామర్థ్యం 220 మెగావాట్లుగా ఉంది. మరికొన్ని నెలల్లో మరో 70 మెగావాట్ల యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకో 200 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే టెండర్లు ఆహా్వనించింది. 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే సింగరేణి సంస్థ వాయు కాలుష్యం విషయంలో నెట్ జీరో సంస్థగా అవతరిస్తుంది. ఇక్కడితో ఆగకుండా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా సింగరేణి అడుగులు వేస్తోంది. సోలార్ ‘డిమాండ్’ సోలార్ విద్యుత్ పగటి వేళలోనే ఉత్పత్తి అవుతుంది. సహజంగా ఆ సమయంలో విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ ఉండే డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మార్గాలపై ఇటీవల సింగరేణి ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీని ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. తద్వారా సింగరేణి సంస్థకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సోలార్ పవర్ ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంపై ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సోలార్ టూ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీలో నేల మట్టానికి దిగువ స్థాయిలో ఉన్న నీటిని మోటార్ల సాయంతో పైకి తోడుతారు. తిరిగి అదే నీటిని కిందకు వదులుతారు. నీరు కిందికి వెళ్లే మార్గంలో టర్బైన్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ విధానంలో చాలా విద్యుత్ కేంద్రాలు పని చేస్తున్నాయి. అందుబాటులోకి గ్రీన్ ఎనర్జీ.. పగటి వేళ అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో ఉన్న నీటిని తోడి పై భాగంలో ఉన్న రిజర్వాయర్‌లో నింపుతారు. సాయంత్రం వేళ పీక్ అవర్స్‌లో విద్యుత్ డిమాండ్ ఉండే సమయంలో పైనున్న రిజర్వాయర్‌లో ఉండే నీటిని కిందికి పంపడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో నీటిని తోడేందుకు ఉపయోగించిన సోలార్ విద్యుత్‌లో 80 శాతం తిరిగి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం విధానంలో కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. వనరులపై దృష్టి.. ఓపెన్ కాస్ట్ విధానంలో నేలలో నిక్షిప్తమైన బొగ్గు కోసం భూమి పై పొరలను రెండు వందల మీటర్లకు పైగా తొలగిస్తారు. దీంతో భారీ గోతులు ఏర్పడుతాయి. ఇందులో సహజ నీటి ఊటలతో పాటు వర్షపు నీరు భారీగా చేరుకుంటుంది. బొగ్గు ఉత్పత్తి సమయంలో ఈ నీటిని ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా తోడేస్తారు. ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత భారీ గోతులు, నీరు అక్కడే నిలిచి ఉంటాయి. ఇలా భారీగా నీరు నిల్వ ఉన్న ఓపెన్‌కాస్ట్ గనులు ఎక్కడ ఉన్నాయి.. ఈ మైన్స్‌కు సమీపంలో ఉపరితలంపై భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించేందుకు అనువైన ఓపెన్‌కాస్ట్‌లు ఎక్కడున్నాయనే అంశంపై సింగరేణి దృష్టి సారించింది. -
ఏటా వంద మిలియన్ టన్నులు..
గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏటా వంద మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 78 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ప్రణాళికలను రూపొందించిన సంస్థ, నూతన ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తూ.. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను విస్తరించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల ద్వారా సుమారు 26 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని భావిస్తోంది. ఈ ఐదు ప్రాజెక్టుల్లో నైనీ బ్లాక్ కొత్త ప్రాజెక్టు కాగా, మిగతా నాలుగు ప్రాజెక్టుల జీవితకాలం పొడిగింపునకు వెళ్తున్నాయి. దీంతో ఒక్కో ప్రాజెక్టుకు 11నుంచి 43 ఏళ్ల వరకు జీవితకాలం పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని యాజమాన్యం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు శనివారం సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ సంస్థ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని ఏరియాల నుంచి ప్రాజెక్టు నివేదికలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఒడిశాలోని నైనీబ్లాక్ కోల్‌మైన్ ద్వారా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా పెరగనుంది. నాలుగు పాత ప్రాజెక్టుల విస్తరణ వల్ల మరో 16.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని చెపుతున్నారు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో మరో 4.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ముందుకు విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం బొగ్గు నిల్వలు ముగిసిన ప్రాజెక్టులకు ఎక్స్టెన్షన్ పేరుతో అనుమతులు పొందాం. వచ్చే ఏడాది మరో రెండు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నాం. పర్యావరణ, అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. – వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ డైరెక్టర్, సింగరేణి సంస్థ -
వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన ఉత్పత్తి
మంచిర్యాల (ఆదిలాబాద్) : వర్షం కారణంగా ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురియడంతోపాటు, శుక్రవారం కూడా వర్షం కొనసాగడంతో మధ్యాహ్నం వరకూ ఉత్పత్తికి వీలు కాలేదు. దీంతో సుమారు మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగినట్టు సమాచారం.