గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏటా వంద మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 78 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ప్రణాళికలను రూపొందించిన సంస్థ, నూతన ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తూ.. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను విస్తరించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల ద్వారా సుమారు 26 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని భావిస్తోంది.
ఈ ఐదు ప్రాజెక్టుల్లో నైనీ బ్లాక్ కొత్త ప్రాజెక్టు కాగా, మిగతా నాలుగు ప్రాజెక్టుల జీవితకాలం పొడిగింపునకు వెళ్తున్నాయి. దీంతో ఒక్కో ప్రాజెక్టుకు 11నుంచి 43 ఏళ్ల వరకు జీవితకాలం పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని యాజమాన్యం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు శనివారం సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్‌వీకే శ్రీనివాస్ సంస్థ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని ఏరియాల నుంచి ప్రాజెక్టు నివేదికలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఒడిశాలోని నైనీబ్లాక్ కోల్‌మైన్ ద్వారా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా పెరగనుంది. నాలుగు పాత ప్రాజెక్టుల విస్తరణ వల్ల మరో 16.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని చెపుతున్నారు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో మరో 4.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
డిమాండ్‌కు అనుగుణంగా ముందుకు
విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం బొగ్గు నిల్వలు ముగిసిన ప్రాజెక్టులకు ఎక్స్‌టెన్షన్ పేరుతో అనుమతులు పొందాం. వచ్చే ఏడాది మరో రెండు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నాం. పర్యావరణ, అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం.
– వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ డైరెక్టర్, సింగరేణి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment