మెరుపు సమ్మె
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్: సింగరేణిలో బొగ్గు లారీల యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. గనుల నుంచి ఉత్పత్తి బొగ్గును దూర ప్రాంతాల్లోని పరిశ్రమకు వీరు సరఫరా చేస్తుంటారు. రవాణా చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ లారీల యాజమానులు సోమవారం మధ్యాహ్నం నుంచి సమ్మెకు దిగారు. శ్రీరాంపూర్, మందమర్రి డివిజన్లకు చెందిన లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది.
బెల్లంపల్లి డివిజన్లో కూడా నేడు లేదా రేపు మొదలయ్యే అవకాశం ఉంది. సమ్మె మూలంగా ఈ రెండు డివిజన్ల పరిధిలోని 800 లారీలు బుకింగ్ యార్డుల వద్దే నిలిచాయి. దీంతో బొగ్గు రవాణాపై ప్రభావం పడింది. సింగరేణి బొగ్గును ఈ యాక్షన్ ద్వారా కొనుగోలు చేసిన కంపెనీలకు ఇక్కడి నుంచి లారీల ద్వారా రవాణా చేస్తోంది.
రవాణా చేసే కంపెనీలకు, లారీ యజమానులకు మధ్య కోల్ట్రాన్స్పోర్టర్లు ఉంటారు. టన్ను బొగ్గు రవాణాకు దూరంను బట్టి ట్రాన్స్పోర్టర్లు కిరాయిని చెల్లిస్తారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా కి రాయి ఇవ్వడం లేదని కిరాయి పెంచాలని డిమాండ్ చేస్తూ లారీల యాజమానులు సమ్మెకు దిగారు.
రెండేళ్ల కిత్రం లీటరు డీజిల్ ధర రూ.41.45 పైసలు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు కిరాయి టన్నుకు రూ. 724 ఇచ్చే వారని ఇప్పుడు డీజిల్ ధర రూ.59.68 పైసలకు పెరిగినా కూడా అదే కిరాయి ఇవ్వడంతో గిట్టుబాటు కావడం లేదని లారీ యాజమానులు వాపోతున్నారు.
ఇప్పుడున్న పాత కిరాయిపై 20 శాతం చార్జీ పెంచి టన్నుకు రూ.150 తగ్గకుండా కిరాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు లారీల విడిభాగాల ధరలు, లారీ డ్రైవర్ల, క్లీనర్ల జీతం పెరిగిందని, టోల్‌టాక్స్‌లు కూడా పెరిగాయని లారీ యజమానులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీలు పెంచాలని కోల్ట్రాన్స్పోర్టర్లను డిమాండ్ చేస్తున్నామని ఓనర్లు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, లారీల ద్వారా దూర ప్రాంతాలకు జరగాల్సిన బొగ్గు రవాణా ఆగిపోవడంతో అధికారులు పంపించాల్సిన బొగ్గును టిప్పర్ల ద్వారా సీఎస్పీకి తరలిస్తున్నారు. శ్రీరాంపూర్ డివిజన్లో రోజుకు 7 వేల టన్నులు, మందమర్రి డివిజన్లో రోజుకు సుమారు 1,800 టన్నుల బొగ్గు లారీల ద్వారా రవాణా అయ్యేది. ఇప్పుడు దాన్ని సీఎస్పీలో స్టాక్ చేస్తున్నారు. దీనిని వ్యాగన్ల ద్వారా పంపించే అవకాశం ఉంది.
నష్టాలు వస్తున్నాయి.
కిరాయి తక్కువగా ఉండటంతో నష్టాలు వస్తున్నాయి. రెండేళ్ల నుంచి బొగ్గు రవాణా చార్జీలు పెంచలేదు. దీంతో లారీల నిర్వాహణ భారం అయ్యింది. దీంతో లారీలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్పోర్టర్లు మా డిమాండ్లను తీర్చి రవాణా చార్జీ పెంచాలి. - బింగి రవీందర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రీరాంపూర్ అన్నింటికి ధరలు పెరిగాయి.
నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని రెండేళ్లలో అన్నింటికి ధరలు పెరిగాయి. వాటికి అనుగుణంగానే బొగ్గు రవాణా చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. నాకు 3 లారీలు ఉన్నాయి. సమ్మెతో రోజుకు రూ. 6వేల నష్టపోతున్నా. కిరాయి పెరిగేంత వరకు లారీలు నడపం. - పుప్పాల సత్తయ్య, లారీ ఓనర్