హామీల అమలెలా?
తెలంగాణ ఆర్థిక శాఖ తర్జనభర్జన
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వాటి అమలుకు ఎంత ఖర్చవుతుంది, అందుకవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ ఎలా అనేదానిపై ఆర్థిక, ప్రణాళిక సలహాదారులు తర్జనభర్జన పడుతున్నారు. లక్ష రూపాయల లోపు పంటరుణాల మాఫీ, రెండు బెడ్రూములతో ఇళ్ల నిర్మాణం, ఉచిత నిర్బంధ విద్య, పెన్షన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, దళితులకు మూడెకరాల భూమి వంటి ప్రధాన హామీలు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.
ఒక్క పంట రుణాల మాఫీతోనే ఈ ఏడాది ఖజానాపై దాదాపుగా రూ.19 వేల కోట్ల భారం పడనుంది. ఇక పునర్వ్యవస్థీకరణ కోసం ఒక్కో జిల్లాకు సుమారు వెయ్యి కోట్లు కావాలని ప్రాథమికంగా అంచనా వేశారు. అంటే 14 అదనపు జిల్లాలపై రూ.14 వేల కోట్లన్నమాట. నిర్బంధ ఉచిత విద్య అమలుకు ఏటా కనీసం రూ.10,000 కోట్లు కావాలంటున్నారు. అలాగాక దాన్ని ఒకేసారి పూర్తిస్థాయిలో అమలు చేయదలిస్తే ప్రభుత్వంపై భారం తీవ్రంగా ఉం టుందని అధికారులు చెబుతున్నారు. ఇక పెన్షన్ల కోసం ఏటా రూ.3,000 కోట్ల దాకా అవుతుందని అంచనా. దళితులకు మూడెకరాల భూమికి ఎంతవుతుందో ఇంకా స్పష్టత రాలేదు.