Cognizant Hyderabad center
-
హైదరాబాద్‌లో ఆస్తులు అమ్మనున్న టాప్ ఐటీ కంపెనీ..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న కాగ్నిజెంట్.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్‌కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు కాగ్నిజెంట్ ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్, చెన్నైలోని తన ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఇది నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ద్వారా నగదు సంపాదించడానికి సహకరిస్తుందని తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. రెండు సంవత్సరాల్లో రూ.3300 కోట్లు ఆదా చేసే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్‌ను, చెన్నైలోని సిరుసేరిలో 14 ఎకరాల క్యాంపస్‌ను విక్రయించాలని యోచిస్తోంది. రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా తన వర్క్‌స్పేస్‌ను తగ్గించుకుని, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను ఎంచుకుంది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్‌కల్చర్‌కు అనుగుణంగా హైబ్రిడ్‌వర్క్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..! ఇటీవల ఐటీ సేవల రంగంలోని కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. వారి వ్యాపారాల్లో జనరేటివ్ ఏఐను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి కాగ్నిజెంట్‌లో 3,46,600 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ నికర లాభం 16 శాతం క్షీణించి 525 మిలియన్లకు చేరుకుంది. ఆదాయం దాదాపు 4.89 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. -
హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ
* 500 కోట్లతో గచ్చిబౌలి కేంద్ర విస్తరణ * అదనంగా 8,000 సీట్ల సామర్థ్యం * ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 18,000 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ. 500 కోట్లు వ్యయం చేయనుంది. గచ్చిబౌలిలో ఉన్న 11 ఎకరాల క్యాంపస్‌లో ఈ విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. 8,000 సీటింగ్ సామర్థ్యం గల 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం కాగ్నిజెంట్‌కి 2.25 లక్షల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని అందిపుచ్చుకునే విధంగా హైదరాబాద్ కేంద్ర విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు కాగ్నిజెంట్ వైస్ చైర్మన్ లక్ష్మి నారాయణన్ తెలిపారు. మా వ్యాపార విజయంలో హైదరాబాద్ కేంద్రం అత్యంత కీలకమైనదన్నారు. ఈ సందర్భంగా వ్యాపార విస్తరణ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2002లో 180 మందితో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించగా, ఇప్పుడు 18,000 మందికిపైగా పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఉన్న 20 ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలను సందర్శించి 8,000 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించింది.