టెండర్ ఇప్పిస్తానని టోకరా..
రూ.20వేలు, బంగారంతో ఉడాయించిన ఘనుడు
సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు
సుబేదారి సీఎస్‌లో కేసు నమోదు
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్.. నిత్యం ఉద్యోగులు, అధికారులతో రద్దీగా ఉంటుంది. అనువణువునా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో అధికారుల పేరుచెప్పి టెండర్లు ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టరు నుంచి రూ.20వేలు, బంగారం తీసుకుని ఉడాయించాడు ఓ ఘనుడు. విషయం తెలసుకుని లబోదిబోమన్న బాధితుడు చివరకు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు.
అసలేంజరిగింది...
ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జిల్లాలకు అవసరమైన బీరువాలు, కుర్చీలు, బల్లలు కొనుగోలు కోసం కలెక్టరేట్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ కలెక్టరేట్లో శుక్రవారం జరిగింగి. ఈ సమయంలో కాజీపేట ప్రాంతానికి చెందని ఒక వ్యాపారి టెండర్ ధాఖలు చేయడానికి వచ్చాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు. తనకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన ఓ ఆగంతకుడు వ్యాపారిని బయటకు తీసుకు వెళ్లాడు. కలెక్టరేట్లో టెండర్లు నిర్వహిస్తున్న అధికారి తనకు బాగా తెలుసని నమ్మబలికాడు. రూ.20వేలు ఇచ్చినట్లయితే టెండర్ నీకే వచ్చేట్లు చేస్తానని అన్నాడు. దీంతో ఆ మాటలు నమ్మిన వ్యాపారి అక్కడిక్కడే రూ.20వేలు తీసి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత సదరు వ్యక్తి కలెక్టరేట్లోని డైనింగ్‌హాల్, ఇతర గదుల్లో తిరిగాడు. తరువాత కొద్ది సేపటికి వ్యాపారి వద్దకు వెళ్లి నీకు టెండర్ ఇవ్వడానికి సార్.. ఓకే అన్నాడు. కానీ... నీ చే తికి ఉన్న బంగారు ఉంగరం సార్‌కు బాగానచ్చిందట. ఒకసారి ఇస్తే ఫొటో తీసుకుని ఇస్తాడట అని నమ్మబలికాడు. దీంతో ఆ వ్యాపారి తన చేతికి ఉన్న సుమారు రూ.20వేల విలువైన బంగారు ఉంగరం తీసి ఇచ్చేశాడు. ఉంగరం చేతిలో పడగానే కలెక్టరేట్ వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించిన అగంతకుడు ముందు వైపు నుంచి బయటకు వెళ్లి పోయాడు. గంటలు గడిచినా టెండర్ ఇప్పిస్తానన్న వ్యక్తి రాకపోవడంతో అధికారుల వద్దకు వెళ్లి వ్యాపారి ఆరా తీశాడు. దీంతో తాను మోసపోయానఽని ఆ వ్యాపారికి అప్పడు అర్ధం అయింది. లబోదిబో మంటూ అధికారులకు జరిగిన విషయం చెప్పాడు. ఆ వ్యక్తితో కలెక్టరేట్లో అధికారులకు, ఉద్యోగులకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. విషయంపై పోలీసుకుల ఫిర్యాదు చేయాలని సూచించారు.
సుబేదారి పీస్‌లో కేసు నమోదు
విషయంలో తమకేం సబంధం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితుడు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కలెక్టరేట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు. దీంట్లో డబ్బులు, ఉంగరం తీసుకున్న విషయం, కలెక్టరేట్లో అటు..ఇటు కలియ దిరిగిన విషయం సీసీ టీవీల్లో స్పష్టంగా నమోదైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
గతంలో మేడారం పాస్‌ల విషయంలో...
ప్రసుత్తం టెండర్ల పేరుతో డబ్బులు, బంగారం తీసుకుని ఉడాయింన తతంగం జరిగిన గదిలోనే మేడారం జాతర సమయంలో జాతర పాస్‌లు చోరీకి గురయ్యాయి. విషయం గుర్తించి అధికారులు సీసీ టీవీపుటేజీలు పరిశీలించారు. వాటి ఆధారంగా పాస్‌లు తస్కరించిన వ్యక్తిని గుర్తించి డీఆర్వో కేసు నమోదు చేయించారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఘటన అదే గదిలో జరగడం గమనార్హం.