సెక్యూరిటీగార్డు దారుణ హత్య
⇒తోటి గార్డే నిందితుడు
⇒ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఘటన
హయత్‌నగర్: డబ్బు కోసం తోటి సెక్యూరిటీ గార్డును అతికిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఈ గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన నావల్ కిషోర్‌సింగ్ (55) నెల రోజుల క్రితం కుంట్లూరులోని నాగోల్ ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా చేరాడు. ఇదే కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన బి.సక్యా కొత్తగా వచ్చిన వారిని వే ధించడం అలవాటుగా చేసుకున్నాడు.
గతంలో గార్డుగా చేరిన ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి పంపేశాడు. ఇదే క్రమంలో కొత్తగా చేరిన నావల్ కిషోర్సింగ్ను కూడా వేధిస్తున్నాడు. గురువారం రాత్రి నావల్ కిషోర్‌సింగ్, సక్యాలు కళాశాల గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి డబ్బు విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సక్యా ఇనుప రాడ్‌తో కిషోర్సింగ్పై దాడి చేశాడు. తల, ఇతర శరీర భాగాలపై విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో కిషోర్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు సంబంధించిన సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు ఘటనా స్థలాన్ని శుభ్రం చేశాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా విధులను నిర్వహిస్తున్నాడు.
నిందితుడిని పట్టుకున్న ‘అర్జున్’....
విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కళాశాల యాజమాన్యంతో పాటు పోలీసులకు సెక్యూరిటీ గార్డు సక్యాపై అనుమానం కలిగింది. పోలీసులు వెంటనే డాగ్‌స్క్వాడ్‌ను ర ప్పించారు. పోలీసు జాగిలం అర్జున్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నేరుగా అర కిలోమీటరు దూరంలో ఉన్న నిందితుడు సక్యా వద్దకు వెళ్లి అతని కాలు పట్టుకుంది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన హత్య కేసులో కూడా ‘అర్జున్’ నిందితుడి ఇంటికి వెళ్లి పట్టుకుందని తెలిసింది.