ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలదేనని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ - స్వచ్ఛ విద్యాలయాలు కార్యక్రమంపై ఎంఈఓలు, హెచ్ఎంలు, డిప్యూటీ డీఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎంఈఓలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
జిల్లాలో ఎక్కడా బడి వయస్సు పిల్లలు బడి బయట కనిపించరాదన్నారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా సక్రమంగా విధులు నిర్వహించేలా చూడాలని, అదేవిధంగా విద్యార్థుల హాజరుపైన దృష్టి సారించాలన్నారు. పాఠశాలల్లోని పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. డిప్యూటీ డీఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో ఎంఈఓల జాబ్ చార్టును పరిశీలించాలన్నారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విద్యార్థుల హాజరు, డ్రాప్అవుట్స్, ఉపాధ్యాయుల హాజరు, సిలబస్ తదితర వివరాలు సేకరించాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతను పెంపొందించడం స్వచ్ఛ విద్యాలయాల లక్ష్యమన్నారు. మరుగుదొడ్ల ఏర్పాటు, నీటి వసతి, పరిశుభ్రతలను పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, డీఈఓ నాగేశ్వరరావు, ఎస్ఎస్ఏ పీఓ మురళీధర్, డీపీఓ శోభస్వరూపరాణి, జవహర్ బాల ఆరోగ్య రక్ష కో-ఆర్డినేటర్ హేమలత, డిప్యూటీ డీఈఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.