colleges development
-
మార్పు మొదలైంది.. నాలుగేళ్లలో గణనీయమైన ప్రగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు నేషనల్ అసెస్మెంటు అండ్ అక్రిడిటేషన్ (న్యాక్), నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు ఉండాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మూడేళ్లలో న్యాక్, ఎన్బీఏల్లో రెండింటిలో ఏ గ్రేడ్‌లో నిలిచేలా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గడువులోపల న్యాక్, ఎన్బీఏ గుర్తింపు సాధించలేని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయాలని, గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించారు. ఈ గుర్తింపు సాధన కోసం ఉన్నత విద్యా మండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఏర్పాటు చేయించి కాలేజీలకు సహకారం అందించారు. ఈ చర్యల ఫలితంగా గత నాలుగేళ్లలో కాలేజీలలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు న్యాక్ అక్రిడిటేషన్ సాధించే కాలేజీల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలతో ఏటేటా వాటి సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు 1323 వరకు ఉన్నాయి. 2019లో అక్రిడిటేషన్ సాధించిన కాలేజీలు 43 మాత్రమే. ఆ తరువాత రెండేళ్ల పాటు కరోనా కారణంగా కాలేజీలలో ప్రత్యక్ష బోధన అరకొరగా సాగింది. కరోనా అనంతరం న్యాక్ గుర్తింపు సాధించకుంటే అడ్మిషన్లు నిలిచిపోతాయని హెచ్చరించడంతో అన్ని కాలేజీలు ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా పలు కాలేజీలకు వనరులు, ప్రమాణాలూ ఉన్నా న్యాక్ గుర్తింపు ప్రక్రియలో వెనుకబడ్డాయి. ఇటువంటి కాలేజీలకు క్వాలిటీ అస్యూరెన్సు సెల్ ద్వారా మార్గదర్శనం చేసి, న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేయించారు. చిన్న లోపాలతో గతంలో న్యాక్ గుర్తింపు రాకుండా పోయిన అనేక కాలేజీలు గత రెండేళ్లలో గుర్తింపును పొందేలా ప్రభుత్వం తోడ్పాటునందించింది. 2023 నాటికి మొత్తం 209 కాలేజీలకు న్యాక్ అక్రిడిటేషన్ లభించింది. ఈ ఒక్క ఏడాదిలోనే 81 కాలేజీలకు న్యాక్ అక్రిడిటేషన్ రాగా అందులో 7 ఏ ప్లస్ ప్లస్‌లో నిలిచాయి. -
రూ.62.15 కోట్లతో కళాశాలల అభివృద్ధి
కోవూరు: రాష్ట్రంలో ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.62.15 కోట్లు మంజూరు చేసిందని ఆర్జేడీ వై.పరంధామయ్య తెలిపారు. కోవూరు టీఎన్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు నూతనంగా ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్లు్య కోర్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ కోర్సులను ఇప్పటికే ఆత్మకూరు, నెల్లూరు, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, కావలి ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఎంఎల్టీ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి కళాశాలకు కంప్యూటర్లను అందచేశామన్నారు. త్వరలో శ్రీ సిటీకి అనుసంధానంగా ఒక వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. ఏ కళాశాలకు ఎన్ని నిధులంటే.. కోవూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రూ.1.50 కోట్లు, దామరమడుగు రూ.62లక్షలు, దగదర్తికి రూ.1.28 కోట్లు, మనుబోలు రూ.1.85కోట్లు వెంగమాంబ పురం రూ.1.90కోట్లు, రాపూరు రూ.1.90 కోట్లు నాబార్డు కింద విడుదలకు సంబం«ధించి ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్ 3లో 120 జూనియర్ అధ్యాపక పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. వీటి స్థానంలో గెస్ట్ అధ్యాపకులతో భర్తీ చేయాలని సూచించామన్నారు. అందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. కళాశాలలో శిథిలావస్థకు చేరుకొని ఉన్న గదులను ఆయన క్షుణంగా పరిశీలించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది ఆర్జేడీ పరంధామయ్యను సన్మానించారు. కార్యక్రమంలో వి.వెంకటసుబ్బయ్య, అధ్యాపకులు సురేష్, వెంకటేశ్వర్లు, రాఘవయ్య, విష్ణువర్థన్, గోపి, సతీష్, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సురేష్ పాల్గొన్నారు.