దొంగ నుంచి బంగారం దొంగిలించిన ఆర్మీ కల్నల్
ఐజ్వాల్: ఓ స్మగ్లర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించని ఓ సీనియర్ ఆర్మీ అధికారి అసోం రైఫిల్స్ కు చెందిన మరో ఎనిమిదిమంది పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని పట్టుకొని తిరిగి దాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో వారిని ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.14.5కోట్లు ఉంటుందని అంచనా. ఐజ్వాల్‌లో 2014 డిసెంబర్ నెలలో మయన్మార్ నుంచి బంగారాన్ని దొంగరవాణా చేస్తున్న సీ లాల్నున్ ఫెలా అనే వ్యక్తి వాహనాన్ని కల్నల్ జాసిత్ సింగ్, మరో ఎనిమిది మంది కలసి అడ్డుకున్నారు.
వీరిలో ఒకరకు జూనియర్ కమిషనర్ రేంజ్ అధికారి కూడా ఉన్నాడు. వారు తొలుత కారును ఆపేశారు. తమ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తూనే సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వారికి మొత్తం రూ.14.5కోట్ల విలువ చేసే 52 బంగారు కడ్డీలు లభించాయి. అనంతరం వారి కార్లలో వాటిని పెట్టుకొని అతడిని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అసలు తమకు ఎవరూ బంగారం అప్పగించలేదని చెప్పిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని ఆర్మీ యూనిట్ పై అనుమానం వచ్చి గత నెల(ఏప్రిల్ 21) కేసు ఫైల్ చేసి కల్నల్ సింగ్ ను దర్యాప్తునకు సహకరించాలని కోరారు. కానీ, ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునేందుకు వెళ్లడంతో పోలీసులు అరెస్టు చేశారు.