Colony problems
-
ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ
సాక్షి, తరిగొప్పుల: దెయ్యం తిరుగుతోందన్న భయంతో బేడ, బుడగజంగాల ప్రజలు తాముంటున్న కాలనీని ఖాళీ చేసి వలస పోయారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో ఇలా సుమారు 40 కుటుంబాలు కాలనీని విడిచిపెట్టి పోవడంతో ఇప్పుడా కాలనీ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. పదేళ్లుగా కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందని, ఓ మహిళ నగ్నంగా బోనం ఎత్తుకుని నృత్యం చేస్తోందని కాలనీ వాసులు నమ్ముతున్నారు. వరుస మరణాలతో ఆందోళన.. బేడ బుడగ జంగాల కాలనీలో అన్నదమ్ములు చింతల భాను, చింతల బాలరాజు గతేడాది అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే మరణించారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ మరణాలకు చేతబడి, దెయ్యమే కారణమని కాలనీవాసులు నమ్మడంతో ఒక్కొక్కరుగా వలస వెళ్లిపోతుండటంతో మంగళవారానికి కాలనీ పూర్తిగా ఖాళీ అయింది. ఇక కాలనీకి చెందిన గంధం శేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..తమ కాలనీలో యువకులు మాత్రమే చనిపోతున్నారని, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదంటున్నారని తెలిపారు. దీంతో భయం వేసి కాలనీని వదిలి మండల కేంద్రానికి వెళ్లి గుడిసెలు వేసుకుంటున్నట్లు వివరించారు. ►పోలీసులు, కళాజాత బృందం ఆధ్వర్యంలో దెయ్యం, భూతం లేదని అవగాహన కల్పించినా ఎవరూ నమ్మడం లేదు. వేరేచోట స్థలం కేటాయిస్తామని చెప్పినా ఎవరూ వినట్లేదు. –ఎండబట్ల అంజమ్మ, గ్రామ సర్పంచ్ -
'వైఎస్ జగన్‌పై మాకు విశ్వాసం ఉంది'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ధర్నాచౌక్‌లో వెంకటాపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు.పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం కాలనీలో గత 20సంవత్సరాలుగా పోరంకి గ్రామస్తులు చెత్తను తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వెంకటాపురం కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. మా కాలనీ మొత్తాన్ని ఒక డంపింగ్ యార్డుగా తయారు చేసి ఇష్టం వచ్చినట్లుగా చెత్తను పారవేస్తున్నారు. మొత్తం 52 ఎకరాలు కలిగిన వెంకటాపురం కాలనీని కబ్జా చేసి అందులో 642 ఫ్లాట్లు నిర్మించాలని చూస్తున్నారు. 20 సంవత్సరాలుగా చెత్తను తొలిగించాలని గత ప్రభుత్వాలను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాకు విశ్వాసం ఉందని, కేవలం మా సమస్యలు పరిష్కరించాలనే నిరసన చేపట్టామని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి చేర్చాలని, మా కాలనీని స్వచ్చ వెంకటాపూర్‌గా తీర్చిదిద్దాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. -
సమస్యల లోగిలి
• పక్కా ఇళ్లు కరువు..డ్రెయినేజీలు తెలియవు • రోడ్డుపైనే పారుతున్న మురుగునీరు • రెచ్చిపోతున్న పందులు • బుడిగజంగాల కాలనీ సమస్యలమయం కొత్తపల్లి : పూరిగుడిసెలు..కనిపించని డ్రెయినేజీలు..కంపుకొడుతున్న పరిసరాలు..ఇవన్నీ ఏదో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం రేకుర్తి పంచాయతీ పరిధిలోని బుడిగజంగాలకాలనీ దుస్థితి. పక్కా ఇళ్లు లేక వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోలేక కాలనీవాసులతో సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు జీవిస్తున్న ఈ కాలనీలో కనీసం డ్రెయినేజీలు లేవు. బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంతోపాటు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు విన్నవిస్తున్నారు. కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి దేవస్థాన భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసిస్తున్న బుడిగ జంగాలను రేకుర్తికి తరలించారు. 128 సర్వేనంబర్‌లో మొదటి విడతగా 148 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 250 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు రద్దు కాగా డబుల్ బెడ్ రూమ్ పథకం కింద బుడిగ జంగాల కాలనీ ఎంపికవకపోవడంతో గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్నా వాటికి కనీస వసతుల్లేవు. 148 గృహాల్లో కేవలం 30 గృహాలకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. మిగతా వారు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి. దీనికితోడు పాలిథిన్ కవర్లతో స్నానాల గదులను ఏర్పాటు చేసుకున్నారు. వీటినుంచి వచ్చే వ్యర్థ నీరు డ్రైనేజీలు లేక రోడ్లపైనే ప్రవహిస్తున్నాయి. అధ్వానంగా అంతర్గత రోడ్లుŠ, రోడ్లపై పారుతున్న మురికినీటితో కాలనీ కంపుకొడుతోంది. పక్కా ఇళ్లు లేకపోవడంతో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లకు అర్హత పొందలేకపోయారు. స్తంభాలు లేకపోవడంతో కర్రల మద్దతుతో సర్వీస్ వైర్ల ద్వారా విద్యుత్ పొందుతున్నారు. తాగునీటి ట్యాంకు ఉన్నా ఇంటింటికి పైప్‌లైన్ లేకపోవడంతో ప్లాస్టిక్ పైప్‌లను ఏర్పాటు చేసుకొని నీటిని వాడుకుంటున్నారు.