అవయవ దానంపై అవరోధాలను తొలగిస్తాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో అవయవ దానంపై చట్ట పరంగా ఉన్న అవరోధాలను తొలగిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ హామీ ఇచ్చారు. అవయవ దానంపై అవగాహన కల్పించడానికి ఇక్కడి యశవంతపురలోని కొలంబియా ఆసియా రెఫరల్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన చర్చా గోష్టిలో ఆయన ప్రసంగించారు. అవయవ దాతలు, వాటి కోసం ఎదురు చూస్తున్న వారి మధ్య ఎంతో అంతరం ఉందని చెప్పారు. మరణానికి ముందే అవయవ దానంపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని, మరణానంతరం దీనిపై కుటుంబ సభ్యులను ఒప్పించడం అంత తేలిక కాదని అన్నారు.
అవయవాలు ఎవరికి కావాలి.. దానం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు లాంటి వాస్తవ సమాచారం చాలా అవసరమన్నారు. దీని కోసం ఓ సమాచార కేంద్రాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రముఖ పాత్రను పోషించాల్సి ఉంటుందని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు వారంలో కనీసం రెండు గంటల పాటు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను అందించడం ద్వారా పేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు. నటుడు శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ తొలుత కళ్లు, తర్వాత తన దేహాన్నే దానం చేశానని తెలిపారు.
ఈ విషయంలో అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర న్యాయ కమిషన్ అధ్యక్షుడు వీఎస్. మళిమఠ్ మాట్లాడుతూ అవయవ దానంపై 1994లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. కొత్త చట్టం ద్వారా అవయవ దానాన్ని సులభతరం చేయాలని సలహా ఇచ్చారు. కొలంబియా ఆసియా ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నంద కుమార్ జైరాం ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోని చట్టాలను రాష్ట్రంలోనూ తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు పోలీసు కమిషనర్ కమల్ పంత్ ప్రభృతులు పాల్గొన్నారు.