Comedy Scene
-
స్పూఫ్ మత్తుకు చిత్తు అవుతున్న సోషల్ మీడియా
-
బ్లాక్ అండ్ వైట్ టూ కలర్ సినిమా.. దాని ప్రత్యేకతే వేరు!
మనసు కాస్త మందగించగానే.. ఏదైనా కామెడీ బిట్ పెట్టుకుని.. ఆస్వాదిస్తుంటాం. ఎల్లవేళలా అస్వాదాన్ని కలిగించే వినోదంలో సినిమా ప్రముఖపాత్ర పోషిస్తూ వస్తోంది. నిజానికి నటించడం ఓ ఎత్తు.. నవ్వించడం మరో ఎత్తు. ఎవరైనా నటించగలరేమో కానీ.. ఎవరు పడితే వాళ్లు నవ్వించలేరు. నవ్వనేది నాటికీ నేటికీ సినిమాల్లో ఒక భోగమే. పప్పులో ఉప్పులేకపోతే కూర ఎంత చప్పగా ఉంటుందో.. సినిమాలో కామెడీ లేకపోయినా అంతే చప్పగా సాగుతుంది. ఎన్ని యాక్షన్ సీక్వెన్సులున్నా.. గుండెల్ని బరువెక్కించే ఎమోషనల్ సీన్లున్నా.. వినసొంపైన పాటలున్నా.. కథలో కామెడీ లేకపోతే ఏదో లోటుగానే అనిపిస్తుంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా వినోదం లేకపోతే పెదవి విరుపులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ వుడ్ తీసుకున్నా కామెడీ ట్రాక్ లేకుండా సినిమాలు నడవవు. తెలుగు చిత్ర సీమ నవ్వుల వనంలో వికసించిన హాస్య పద్మాలెన్నో.. ఎన్నెన్నో. బ్లాక్ అండ్ వైట్ కాలంలో రేలంగి, రాజబాబు, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం వీళ్లంతా నవ్వుకి నాట్యం నేర్పిన వారే. ఆ తరువాత కాలంలో.. బ్రహ్మానందం, బాబు మోహన్, కోటా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవిఎస్, అలీ, సుత్తివేలు, ఆహుతి ప్రసాద్, కొండవలస, గుండు హనుమంత రావు, సునీల్, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా చాలామంది నవ్వుల రారాజులున్నారు. మరి నవ్వుల రాణులు లేరా అంటే.. నవ్వుల సామ్రాజ్యానికి మహారాణిగా నిలిచింది సూర్యకాంతం. ఆ తరువాత.. శ్రీలక్ష్మి, రమాప్రభ, తెలంగాణ శకుంతల, కోవై∙సరళ ఇలా చాలామందే ఆ వారసత్వాన్ని కొనసాగించారు. చాలా సార్లు బాధలో ఉన్నప్పుడు కూడా మనల్ని గిలిగింతలు పెట్టించేవి ఈ సినీ నవ్వులే. ఇక నటుడు జంధ్యాల సృష్టించిన చిత్ర విచిత్రమైన పాత్రలు నవ్వుకి జీవం పోశాయంటే అతిశయోక్తి కాదేమో. ఆ తరువాత ఈవీవీ.. ఆయన పెట్టించిన ‘కితకితలు’ ప్రేక్షకుల మోవి మీద నవ్వులు పూయించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారంటే.. ఆయన అస్త్రం కూడా ఈ నవ్వే. యాక్షన్, సెంటిమెంట్, లవ్, థ్రిల్లర్, హారర్, డ్రామా ఇలా ఏ జానర్ చూసుకున్నా.. అందులో కామెడీ ఉంటేనే కిక్కు. అందుకే ఎంతటి బాహుబలి సినిమా అయినా.. కామెడీ ప్రధానం కాబట్టే కట్టప్పతోనూ జోకులు వేయించాడు రాజమౌళి. అలాగే అనుష్క బావ కుమార వర్మగా సుబ్బరాజుతో హాస్యం పండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్ర సీమలో నవ్వుకు ఉన్న ప్రాధాన్యం వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. -
‘అజ్ఞాతవాసి’ అక్కడే లెక్క తప్పిందా..!
బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. త్రివిక్రమ్, పవన్‌ల కాంబినేషన్‌పై భారీ అంచనాలతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు నిరాశగా వెనుతిరిగారు. ఎప్పుడు అర్థవంతమైన సంభాషణలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించే త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీయటంపై అభిమానులు పెదవి విరిచారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు, ఆ సీన్స్‌లో పవన్ నటన, కొడకా కోటేశ్వరరావు పాటలోని పవన్ చేసిన స్టెప్స్ పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో గుడుంబా శంకర్, సర్థార్ గబ్బర్‌సింగ్ లాంటి సినిమాల్లోనూ ను పవన్ ఇలాంటి కామెడీ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. పవన్ ఒత్తిడి వల్లే అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ తన స్టైల్‌కు పవన్ ఆలోచనలు జోడించి ఇలాంటి కామెడీ సీన్స్ చేసి ఉంటారంటున్నారు అభిమానులు. -
అసలేం జరిగింది! ఏం జరగబోతోంది?
కామెడీ సీన్ రమణ, గిరి... ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన పార్ధూని కలుసుకుంటారు. పలకరింపులయ్యాక కొద్దిసేపు బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటారు. తెలిసీ తెలియని వయసులో జరిగిన ఒక పొరపాటుకు చింతిస్తారు. పార్థుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గిరి, రమణ ఇద్దరే అంతా మాట్లాడేస్తారు. ఆ సందర్భంగా ఒక సరదా సంఘటన ఇది. గిరి: అలా బయటకు వెళ్లి, కాఫీ తాగి దమ్ము కొడదాం రారా!(పార్ధూతో) పార్ధు: ఒక్క నిమిషం అత్తయ్యకు చెప్పి వస్తా! రమణ: ఇప్పుడు సిగరెట్లు గురించి ఆవిడకెందుకు? అనవసరం కదా! పార్ధు: కాఫీ వరకూ చెప్పొస్తా రమణ: అయితే ఓకే కట్ చేస్తే...! (చిన్న హోటల్ ) (ఈ సీన్లోకి ఎమ్మెస్ నారాయణ కూడా ఎంటరవుతారు. ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరు లేదు. అందుకే ఈ సందర్భంగా ఆ పాత్రకు ఎంకట్రావ్ అని పేరు పెట్టాం) అక్కడ ఎంకట్రావ్ అప్పుడే మినపట్టు తెప్పించుకుంటాడు. మినపట్టు ముక్కను సాంబారులో నంచుకుని తింటూంటాడు ఎంకట్రావ్: (అమాయకంగా) సాంబారు చప్పగా ఉంది! సర్వర్: ఒరేయ్ గ్లాస్ మార్చండి. సాంబార్ అనుకొని మంచి నీళ్లలో ముంచుకు తినేస్తున్నాడు. (ఇంతలో అదే హోటల్లోకి పార్ధూ, గిరి, రమణ వస్తారు...) గిరి: చాన్నాళ్లయిందిరా ఇక్కడకు వచ్చి రమణ: ఏ అప్పున్నావా..? (వాళ్లు ముగ్గురూ వచ్చి ఎమ్మెస్ వెనుక టేబుల్ దగ్గర కూర్చుంటారు) రమణ: (పార్ధూతో) బావా! నీకెప్పుడూ మన శేఖర్గాడి విషయంలో బాధనిపించలేదా? నాకు మాత్రం చాలా సార్లు తప్పు చేశాం అనిపించింది. గిరి: ఇప్పుడవన్నీ ఎందుకురా! (ఎంకట్రావ్ తినడం ఆపేసి మరీ వీళ్ల మాటలు వింటూ ఉంటాడు) రమణ: ఎందుకంటావ్ ఏంట్రా! వీడు చేసింది తప్పు కదా! (దోశె నోట్లో పెట్టుకోబోతూ టెన్షన్లో తినడం మర్చిపోతాడు) గిరి: మరప్పుడు చెప్పచ్చు కదా! రమణ: అప్పుడు నా వయసు పదేళ్లు గిరి: అప్పుడు ఆడి వయసూ పదేళ్లే! రమణ: ఎన్నయినా చెప్పరా... నువ్ అలా చేయడం మాత్రం తప్పే! ఎంకట్రావ్: (మధ్యలో తగులుకుంటూ) ఎలా చేయడం? (రమణ, గిరి వింతగా ఒకళ్ల మొహాలు, ఒకళ్లు చూసుకుంటారు) జీవితంతో పందెం కాయడం, అదీ పదేళ్ల వయసులో... కరెక్ట్ అంటారా? ఎంకట్రావ్: ఎవరి జీవితం? ఎవరు పందెం కాశారు. ఎవరి వయసు పదేళ్లు? రమణ: నేను ఇన్ఫర్మేషన్ గురించి చెప్పట్లేదు. ఫీలింగ్ గురించి చెబుతున్నా ఎంకట్రావ్: ఎందుకు ఫీల్ అవుతున్నావ్? రమణ: ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి! ఎంకట్రావ్: ఏంటా సంఘటన? గిరి: ఎందుకు సార్! పాత గాయాన్ని మళ్లీ రేపుతారు? ఎంకట్రావ్: ఎవరు రేపిందీ?. ఏంటా గాయం? రమణ: ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది! ఎంకట్రావ్: అదే ఏంటా విషయం? రమణ: చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది! ఎంకట్రావ్: (కోపంతో ఊగిపోతూ) ఒరేయ్ అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టార్రా?? నా మానాన నేను మాడిపోయిన మసాల దోశె తింటూంటే... జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించీ వినిపించ కుండా, కనిపించీ కనిపించకుండా, చూపించీ చూపించకుండా మాట్లాడింది ఎవరు?... అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది తెలియాలి... తెలియాలి... తెలియాలి... తెలిసి తీరాలి! (త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌కు బాగా విజిల్స్ పడటం ఈ ‘అతడు’ సినిమా నుంచే మొదలైంది. పార్ధుగా మహేశ్‌బాబు, గిరి, రమణ పాత్రల్లో గిరి, సునీల్ నటించారు. ఇక ఎమ్మెస్ కనిపించింది ఒక్క సీన్ అయినా ఆయన చెప్పిన ఈ డైలాగ్ అందరి నోళ్లల్లో ఇప్పటికీ నానుతోంది) - శశాంక్ బి -
మేఘాల్లో మీటింగ్!
నరకంలో యముడు అంటే అందరికీ హడల్. అలాంటి యముడు చిత్రగుప్తునితో కలసి భూలోకానికి వస్తాడు. కానీ మనోళ్లకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఇంతలో చిత్రగుప్తుని పాపాల చిట్టా మిస్సింగ్. అది దొరికితే గాని పాపులను శిక్షించడానికి కుదరదు. చిత్రగుప్తుడు రకరకాల గెటప్స్‌లో దాని గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ దొరకదు. ఇక డెరైక్ట్‌గా వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇస్తాడు. నగర పౌరుల శ్రేయస్సే భాగంగా పనిచేసే ఎస్ఐ రంజిత్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికెళ్లి, చిత్రగుప్తుడు ఏం ఫిర్యాదు చేశాడో చూడండి! చిత్రగుప్తుడు: అయ్యా! నా పుస్తకం పోయిందండీ! ఎస్ఐ: ఎక్కడ పడేసుకున్నావ్? చిత్రగుప్తుడు: ఆకాశంలో ఎస్ఐ: ఆ....(ఆశ్చర్యంగా) ఆకాశంలోనా...? అక్కడికి నువ్వెందుకు వెళ్లావ్? చిత్రగుప్తుడు: మేఘాల్లో మీటింగ్ ఉండి...! ఎస్ఐ: మేఘాల్లో... చిత్రగుప్తుడు: మీటింగ్.. మీటింగ్...? అప్పుడు కానిస్టేబుల్‌తో... అసలు మన గురించి వీడు ఏమనుకుంటున్నా డురా. కానిస్టేబులో ఓ వెకిలి నవ్వు నవ్వుతాడు. దీంతో ఎస్ఐ అసహనంతో ఎస్ఐ: నవ్వకు నవ్వకు... నగరపౌరులు చూస్తున్నారక్కడ...! ఈ సూట్‌కేస్ ఏంటి? చిత్రగుప్తుడు: సూట్‌కేస్ ఎస్ఐ: అదే అందులో ఏమున్నాయ్? అని అడుగుతున్నా. చిత్రగుప్తుడు: వజ్ర వైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యమ్ములు కూర్చబడిన కంకణములు, నవరత్నములు చేర్చబడిన కిరీటము ఇంకనూ..... ఎస్ఐ: ఊ......ఐ...సీ (ఆపమని చేయి చూపిస్తూ) చిత్రగుప్తుడు: ఓకే యూ...సీ... (ఎస్ఐ సూట్‌కేస్ తెరిచి చూసి అవాక్కవుతాడు. అన్నీ ఆకులే...!) ఎస్ఐ: ఇందులో ఏమున్నాయ్ నాన్నా....? వజ్ర వైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యమ్ములు కూర్చబడిన కంకణములు..... ఎస్ఐ: ఊ....!ఆపేయ్!! అప్పుడు పక్కన కానిస్టేబుల్‌తో... అసలు మన గురించి వీడు ఏమనుకుంటున్నాడురా... కానిస్టేబులో ఓ వెర్రి నవ్వు నవుతాడు. దీంతో ఎస్ఐ అసహనంతో టేబుల్‌ను చేతితో కొడుతూండగా... చిత్రగుప్తుడు: ఏంటి సార్! అన్ని ఆభరణములు చూసేసరికి కళ్లు తిరుగుతున్నాయా! ఎస్ఐ: తిరుగుతాయ్ తిరుగుతాయ్..! ముందు పుస్తకాల పాయింట్‌కు రా..! ఆఫ్ట్రాల్ పుస్తకం పోయిందని పోలీస్ స్టేషన్‌కొచ్చి రిపోర్టు ఇస్తున్నావంటే అది చాలా ఇంపార్టెంట్ బుక్ అయి ఉంటుంది. చిత్రగుప్తుడు: ఔను సార్! ఎస్ఐ: అందులో ఏముంది? చిత్రగుప్తుడు: ఎవరి ప్రాణం ఎప్పుడు తీయవలెనో రాసుంది. ఎస్ఐ: ఆ...!(ఆశ్చర్యంగా) వెంటనే పక్కనున్న కానిస్టేబుల్‌తో ఏంట్రా ఈడి బిహేవియరూ! నా పేరు చెబితే టైస్టులకే టై... హిట్ లిస్ట్ పుస్తకం పోయిందని నాకే కంప్లైంటు ఇస్తున్నాడు. అసలు ఏంటంటావ్ ఈడి బ్యాకింగూ...? ఎస్ఐ: ఆ... ఏంటి బాబూ! అందులో ఎప్పుడు చచ్చిపోతామో రాసుందా..? మరి నా చావు రాసి ఉందా? చిత్రగుప్తుడు: ఆ ఉంది కదా! (వెంటనే ఎస్ఐ స్పృహ తప్పి పడిపోతాడు) - ఈ సన్నివేశం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల’ చిత్రంలోనిది. ఇందులో బ్రహ్మానందం వల్ల ముప్పుతిప్పలు పడే ఎస్ఐగా కోట శ్రీనివాసరావు నటన హైలై ట్. - శశాంక్.బి -
అరటిపండు లంబా లంబా!
కామెడీ సీన్ - చంటబ్బాయ్ ‘ఆంధ్రవీణ’ పత్రిక కార్యాలయం... ఎడిటర్ బిజీగా ఉన్నాడు. పానకంలో పుడకలా వాగ్దేవి ఎంటరయింది. వాగ్దేవి: నమస్కారమండీ ఎడిటర్‌గారూ! ఎడిటర్: నమస్కారం...ఎవరమ్మా..? వాగ్దేవి: ఈ వారం మన ‘ఆంధ్ర వీణ’ ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ ‘చెత్త బతుకులు’ నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవీణ మా ఇంటికి రాగానే నేను ముందు చద వాలి అంటే నేను ముందు చదవాలి అంటూ మా వారూ నేను పోట్లాడుకుంటాం. డయానా రెటీనా ప్రకటన మీ పత్రికకే హైలైట్. ఎడిటర్: నీ పేరేంటమ్మా? వాగ్దేవి: వాగ్దేవి అండీ? రెండేళ్ల క్రితం నా రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి. గుర్తు లేదూ..? ఎడిటర్: ఆ...ఆ...గుర్తులేకేం? కేవలం ఆ రెండు ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10 వేలకు పడిపోయింది. నువ్వే నా తల్లీ! ఏం కావాలి..? శ్రీలక్ష్మి బ్యాగ్‌లోంచి కవర్ తీసి చేతికి అందించబోయింది. వెంటనే ఎడిటర్ భయపడి చేతులు వెనక్కి తీసుకుంటూ ఎడిటర్: ఏమిటది? వాగ్దేవి: నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుకు కొన్ని కవితలు వినిపిస్తాను వినండి. ‘‘ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక.’’ ఎడిటర్ ఈ కవితలు వింటూ అసహనంతో... ఎడిటర్: ‘‘ఇవి విన్నాక కూడా ఎందుకు బతుకున్నాను? నాకు చావు రాలేదు గనక.’’ వెంటనే శ్రీలక్ష్మి ఆయన చేతిల్లో పెన్ను లాక్కొని రాస్తూ... శ్రీలక్ష్మి: చాలా బాగుందండీ, ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను ఇవి మీ పత్రికలో వేయించండి ఎడిటర్ పెన్నూ, కవర్ లాక్కొని... ఎడిటర్: వీటిని ఇక్కడే ఉంచుతాను. మేమిక పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక నీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజయ్యేసరికి మేము ఏ ఆఫ్రికాకో, అండమాన్‌కో పారిపోతాం. వీటిని ఇక్కడే ఉంచుతామమ్మా! వాగ్దేవి: చాలా థ్యాంక్స్. ఇకపోతే... అంటూ బ్యాగ్‌లోంచి ఓ కవర్ బయటకి తీసింది. ఎడిటర్: ఎవరు పోతేనమ్మా! నేనా? శ్రీలక్ష్మి కవర్‌ను టేబుల్ మీద పెట్టింది. శ్రీలక్ష్మి: ఇవి కాస్త తినండి! ఎడిటర్: ఎందుకమ్మా? పోవడానికా? వాగ్దేవి: నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండీ. వంటా వార్పూ శీర్షికన మీరు దీన్ని ప్రచురించాలి. ‘అరటి పండు లంబా లంబా’ అని దీనికి పేరు పెట్టాను. వెంటనే ఎడిటర్ గుసగుసగా ఎడిటర్: (నెమ్మదిగా )ఎడిటర్ బొంద బొంద అనకపోయావేం అనుకుని పైకి ‘‘అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్లీ తినడం ఎందుకు రిస్క్. జీవితం మీద ఆశ ఉన్నవాడిని ఇది ఇక్కడే ఉంచమ్మా’’ వాగ్దేవి: వస్తానండీ. వచ్చేసారి ఇంకొన్ని కవితలు, స్వీట్లు తెస్తాను ఎడిటర్: ఈ సారి వచ్చే ముందు చెబితే ఆ రోజు సెలవు పెట్టుకుంటాను. వాగ్దేవి: అబ్బా సెలవు పెట్టి వినాల్సిన అవసరం లేదండీ? ఆఫీసులోనే వినచ్చు. (ఈ ఎపిసోడ్ ‘చంటబ్బాయ్’ సినిమాలోనిది. జంధ్యాల మార్కు కామెడీకి నిలువుటద్దం. ఎడిటర్‌గా పొట్టిప్రసాద్, వాగ్దేవిగా శ్రీలక్ష్మి నటన ఆద్యంత చమత్కారభరితంగా ఉంటుంది.) నిర్వహణ: శశాంక్ బూరుగు