మనసు కాస్త మందగించగానే.. ఏదైనా కామెడీ బిట్ పెట్టుకుని.. ఆస్వాదిస్తుంటాం. ఎల్లవేళలా అస్వాదాన్ని కలిగించే వినోదంలో సినిమా ప్రముఖపాత్ర పోషిస్తూ వస్తోంది. నిజానికి నటించడం ఓ ఎత్తు.. నవ్వించడం మరో ఎత్తు. ఎవరైనా నటించగలరేమో కానీ.. ఎవరు పడితే వాళ్లు నవ్వించలేరు. నవ్వనేది నాటికీ నేటికీ సినిమాల్లో ఒక భోగమే. పప్పులో ఉప్పులేకపోతే కూర ఎంత చప్పగా ఉంటుందో.. సినిమాలో కామెడీ లేకపోయినా అంతే చప్పగా సాగుతుంది. ఎన్ని యాక్షన్ సీక్వెన్సులున్నా.. గుండెల్ని బరువెక్కించే ఎమోషనల్ సీన్లున్నా.. వినసొంపైన పాటలున్నా.. కథలో కామెడీ లేకపోతే ఏదో లోటుగానే అనిపిస్తుంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా వినోదం లేకపోతే పెదవి విరుపులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ వుడ్ తీసుకున్నా కామెడీ ట్రాక్ లేకుండా సినిమాలు నడవవు. తెలుగు చిత్ర సీమ నవ్వుల వనంలో వికసించిన హాస్య పద్మాలెన్నో.. ఎన్నెన్నో. బ్లాక్ అండ్ వైట్ కాలంలో రేలంగి, రాజబాబు, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం వీళ్లంతా నవ్వుకి నాట్యం నేర్పిన వారే. ఆ తరువాత కాలంలో.. బ్రహ్మానందం, బాబు మోహన్, కోటా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవిఎస్, అలీ, సుత్తివేలు, ఆహుతి ప్రసాద్, కొండవలస, గుండు హనుమంత రావు, సునీల్, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా చాలామంది నవ్వుల రారాజులున్నారు. మరి నవ్వుల రాణులు లేరా అంటే.. నవ్వుల సామ్రాజ్యానికి మహారాణిగా నిలిచింది సూర్యకాంతం. ఆ తరువాత.. శ్రీలక్ష్మి, రమాప్రభ, తెలంగాణ శకుంతల, కోవై∙సరళ ఇలా చాలామందే ఆ వారసత్వాన్ని కొనసాగించారు.
చాలా సార్లు బాధలో ఉన్నప్పుడు కూడా మనల్ని గిలిగింతలు పెట్టించేవి ఈ సినీ నవ్వులే. ఇక నటుడు జంధ్యాల సృష్టించిన చిత్ర విచిత్రమైన పాత్రలు నవ్వుకి జీవం పోశాయంటే అతిశయోక్తి కాదేమో. ఆ తరువాత ఈవీవీ.. ఆయన పెట్టించిన ‘కితకితలు’ ప్రేక్షకుల మోవి మీద నవ్వులు పూయించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారంటే.. ఆయన అస్త్రం కూడా ఈ నవ్వే. యాక్షన్, సెంటిమెంట్, లవ్, థ్రిల్లర్, హారర్, డ్రామా ఇలా ఏ జానర్ చూసుకున్నా.. అందులో కామెడీ ఉంటేనే కిక్కు. అందుకే ఎంతటి బాహుబలి సినిమా అయినా.. కామెడీ ప్రధానం కాబట్టే కట్టప్పతోనూ జోకులు వేయించాడు రాజమౌళి. అలాగే అనుష్క బావ కుమార వర్మగా సుబ్బరాజుతో హాస్యం పండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్ర సీమలో నవ్వుకు ఉన్న ప్రాధాన్యం వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment