commercial space
-
ఆఫీస్ స్పేస్ లీజింగ్.. పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య లీజింగ్ కార్యకలాపాలు ఈ ఆర్థిక సంవత్సరంతోపాటు 2023–24లో సైతం 10–15 శాతం ఆరోగ్యకర వృద్ధిని సాధించే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక తెలిపింది. దీని ప్రకారం.. ఈ వృద్ధి రేటును అనుసరించి వాణిజ్య లీజింగ్ స్థలం 2022–23లో 2.8–3 కోట్ల చదరపు అడుగులను తాకుతుంది. ఆ తర్వాతి ఏడాది 3.1–3.3 కోట్ల చ.అడుగులకు పెరుగుతుంది. ఆఫీసుల నుంచి కార్యకలాపాలకు ఎక్కువ కంపెనీలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో డిమాండ్‌లో మెరుగుదల ఉంటుంది. కమర్షియల్ రియల్టర్ల క్రెడిట్ ప్రొఫైల్స్ తగిన పరపతితో ఈ రెండేళ్లలో ఆరోగ్యంగా కొనసాగుతాయి. హైదరాబాద్‌సహా బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్లో 2022 మార్చి నాటికి 67 కోట్ల చ.అడుగుల గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వేగం పుంజుకున్న తర్వాత ఆఫీస్ స్పేస్ లీజింగ్ అక్టోబర్–మార్చిలో తాత్కాలికంగా వెనక్కి తగ్గుతుంది. సానుకూల అంశాలు.. ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 45 శాతం వాటా ఉన్న ఐటీ, ఐటీఈఎస్ విభాగంలో కొత్త ఉద్యోగుల చేరిక విషయంలో 2023–24లో సింగిల్ డిజిట్లో వృద్ధి నమోదు కానుంది. 30–50 శాతం ఉన్న ఆక్యుపెన్సీ మరింత పెరగనుంది. బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ–కామర్స్ విభాగాలు నూతనంగా ఆఫీస్ స్పేస్‌ను జతచేయనున్నాయి. ఆక్యుపెన్సీ 2022–23లో 84–85 శాతం వద్ద స్థిరపడవచ్చు. ఆసియా దేశాల్లోని పలు నగరాలతో పోలిస్తే భారత్‌లో అద్దె తక్కువ. ముంబైలో అద్దె చదరపు అడుగుకు రూ.130, బెంగళూరు 95, ఢిల్లీ ఎన్సీఆర్ 80 ఉంది. షాంఘై రూ.275, సియోల్ 200, మనీలా రూ.150 పలుకుతోంది. సింగపూర్ రూ.650, లండన్ 600, న్యూయార్క్, టోక్యో చెరి 550, హాంగ్‌కాంగ్ 500, సిడ్నీలో రూ.400 ఉంది. -
చిన్న దుకాణానికి రూ.1.72 కోట్ల లీజు.. ఒక్క అడుగు రూ.2.47 లక్షలు
ఇండోర్: గుడి ఆవరణలో కేవలం పూలు, పూజా సామగ్రి, ప్రసాదాలు విక్రయించే 69.50 చదరపు అడుగుల వైశాల్యమున్న చిన్నపాటి దుకాణాన్ని ఓ వ్యాపారి రూ.1.72 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ప్రఖ్యాత ఖజ్రానా గణేశ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఈ లీజు వ్యవహారం చోటుచేసుకుంది. ‘1–ఎ’ దుకాణాన్ని లీజుకు ఇవ్వడానికి ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. రూ.30 లక్షలు కనీస మొత్తంగా నిర్ణయించారు. వేలం పాటలో ఇది ఏకంగా రూ.1.72 కోట్లకు చేరింది. అంటే ఒక్కో చదరపు అడుగు స్థలం రూ.2.47 లక్షలు పలికింది. వాణిజ్య స్థలం లీజు కోసం ఈ స్థాయిలో ధర పలకడం అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. ఖాజ్రానా వినాయక ఆలయానికి దర్శించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ వ్యాపారం భారీగానే జరుగుతోంది. -
ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్
విభిన్న సంస్కృతులకు వేదికైన హైదరాబాద్ నగరం వేగంగా మెట్రోపాలిటన్ సిటీగా ఎదిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అవకాశాలను వేగంగా అందిపుచ్చుకుని అనతి కాలంలోనే దేశంలో పెద్ద నగరాల సరసన నిలిచింది. ఐటీ విషయంలో ఇప్పటికే చెన్నై, కోల్‌కతాలను వెనక్కి నెట్టిన హైదరాబాద్ తాజాగా ముంబైని వెనక్కి నెట్టేందుకు రెడీ అవుతోంది. అగ్రస్థానం సిలికాన్ సిటీదే ప్రస్తుతం దేశంలో కమర్షియల్ స్పేస్ లభ్యత విషయంలో బెంగళూరు నగరం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం అనేక స్టార్టప్ కంపెనీలు, ఐటీ కంపెనీలకు వేదికగా ఉంది. దీంతో ఇక్కడ కమర్షియల్ స్పేస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. రియల్టీ ఇండస్ట్రీ వర్గాల లెక్కల ప్రకారం బెంగళూరులో ప్రస్తుతం 16 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. రేసులో ఎన్సీఆర్ వందళ ఏళ్లుగా దేశ రాజధానిగా ఉన్న హస్తినలో పొలిటికల్ డెవలప్మెంట్ జరిగినంత వేగంగా ఐటీ, ఇతర ఇండస్ట్రీలు పుంజుకోలేదు. కానీ ఢిల్లీ నగర శివార్లలో వెలిసిన గురుగ్రామ్, నోయిడాలతో ఢిల్లీ నగర రూపు రేఖలు మారిపోయాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోకి వచ్చే ఈ మూడు నగరాలు ఐటీతో పాటు అనేక పరిశ్రమలకు నెలవుగా ఉన్నాయి. దీంతో ఇక్కడ అతి తక్కువ కాలంలోనే కమర్షియల్ స్పేస్‌కి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 11 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. ముంబై వెంటే భాగ్యనగరం దేశ వాణిజ్య రాజధాని ముంబై ఐటీ పరిశ్రమను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిందనే చెప్పాలి. దీంతో ఆ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా పూనెకు తరలిపోయాయి. ఐనప్పటికీ ఈ వాణిజ్య రాజధానిలో కమర్షియల్ స్పేస్‌కి డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ముంబై నగరంలో 10.50 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ మార్కు చేరుకునేందుకు దక్షిణాది నగరమైన హైదరాబాద్ రివ్వున దూసుకొస్తోంది. హైదరాబాద్, ఢిల్లీలదే రియల్టీ వర్గాల గణాంకాల ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో 7.6 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా మరో 4 కోట్ల చదరపు అడుగుల స్థలం 2023 కల్లా అందుబాటులోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది కల్లా హైదరాబాద్ నగరం కమర్షియల్ స్పేస్‌లో ముంబైని దాటనుంది. మరోవైపు ఢిల్లీని మినహాయిస్తే ముంబై, బెంగళూరులలో కమర్షియల్ స్పేస్ మార్కెట్ శాచురేషన్కి చేరుకుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోనాలుగైదేళ్ల పాటు ఢిల్లీ, హైదరాబాద్‌లలోనే కమర్షియల్ స్పేస్ జోష్ కనిపించనుంది. చదవండి: ఏడు ప్రధాన నగరాల్లో బిగ్ రియాల్టీ డీల్స్ ఇవే -
గార్డెన్ సిటీ కిందికి నిజాం నగరం పైకి!
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా దేశీయ కార్యాలయాల స్థలాల లావాదేవీలలో బెంగళూరు కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా జరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ విభాగం శరవేగంగా కోలుకుంటోంది. ఈ ఏడాది జూలై– సెప్టెంబర్ మూడో త్రైమాసికం (క్యూ3)లో హైదరాబాద్‌లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరగగా.. బెంగళూరులో 21 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఇదే సమయంలో భాగ్యనగరంలో 32 లక్షల చ.అ. స్పేస్ సరఫరాలోకి రాగా.. బెంగళూరులో కేవలం 9 లక్షల చ.అ. స్పేస్ అందుబాటులోకి వచ్చింది. 2021 క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్ లావాదేవీలు జరిగాయని కొల్లియర్స్ మార్కెట్ రీసెర్చ్ తెలిపింది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ పునఃప్రారంభిస్తుండటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్‌కు డిమాండ్ పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. రాయదుర్గం, హైటెక్ సిటీల్లోనే.. కరోనా సెకండ్ వేవ్ నిర్మాణ రంగంపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్ స్టాక్‌ను లీజుకు ఇవ్వడంపై డెవలపర్లు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లోని మొత్తం లావాదేవీలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గంలో అత్యధికంగా 53 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి. హైటెక్‌సిటీలో 40 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి. సరఫరాలోనూ మనమే టాప్.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్తగా 1.08 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 29 శాతం, పుణేలో 25 శాతం సప్లయి జరిగింది. ఈ ఏడాది క్యూ3లోని మొత్తం లీజులలో ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా 26 శాతంగా ఉంది. ఈ విభాగంలో లావాదేవీలు పుణే తర్వాత హైదరాబాద్‌లో ఎక్కువగా జరిగాయి. -
మెట్రో బాట..నోట్లవేట!
గ్రేటర్ మెట్రో వాణిజ్య బాట పట్టనుంది. మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన విలువైన స్థలాలను వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా కమర్షియల్ షెడ్లుగా అభివృద్ధి చేసి అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా కావూరిహిల్స్ సమీపంలోని లుంబినీ ఎన్క్లేవ్ వద్ద 2990 చదరపు గజాలు, మాదాపూర్ నీరూస్ ఎదురుగా ఉన్న 2 వేల చదరపు గజాలు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని 1210 చదరపు గజాల స్థలాల్లో వాణిజ్య షెడ్లను అభివృద్ధి చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు మెట్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. గతంలో మాల్స్ అభివృద్ధి చేయాలనుకున్న ప్రాంతాల్లో ‘కమర్షియల్ స్పేస్’ రూపకల్పనకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ దెబ్బతో ఆర్థికంగా ఎదురవుతున్న నష్టాలను ఎదుర్కొనేందుకు మెట్రో సంస్థ పలు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే నాంపల్లి చౌరస్తా వద్ద పీపీపీ విధానంలో ఓ ప్రైవేటుసంస్థ సౌజన్యంతో మల్టీలెవల్ కార్ పార్కింగ్ కేంద్రాన్ని నెలకొల్పుతోన్న హెచ్ఎంఆర్ సంస్థ..పాతనగరంలోని కిల్వత్ ప్రాంతంలోనూ మరో పార్కింగ్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు తాజాగా వాణిజ్య షెడ్ల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ అనంతరం సైతం భారీ నష్టాలను చవిచూస్తోన్న సంస్థ ..గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతుండడం గమనార్హం. మాల్స్ నుంచి వాణిజ్య స్థలాలుగా.... మెట్రో నిర్మాణ ఒప్పందం సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కేటాయించిన విలువైన స్థలాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులు, మాల్స్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్న విషయం విదితమే. నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో 69 కి.మీ మార్గంలో గతంలో 18 మాల్స్ నిర్మించాలని నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన, ఆర్థిక నష్టాల భయం నేపథ్యంలో మాల్స్ సంఖ్యను 4కు కుదించింది. ప్రస్తుతం మూసారాంబాగ్, ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్‌సిటీ వద్ద మాల్స్‌ను నిర్మించింది. మిగతా చోట్ల మాల్స్ నిర్మాణాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వాణిజ్య షెడ్లను పీపీపీ విధానంలో ఏర్పాటుచేసి అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత మేర ఆదాయాన్ని ఆర్జించాలని హెచ్ఎంఆర్ నిర్ణయించడం విశేషం. నష్టాల నుంచి గట్టెక్కేనా? గ్రేటర్ వాసుల కలల మెట్రోకు కోవిడ్ కలకలం, లాక్డౌన్ ఆర్థికంగా నష్టాల బాట పట్టించింది. గతేడాది మార్చికి ముందు మూడు మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లు.. ప్రస్తుతం 1.70 లక్షల నుంచి 2 లక్షలమంది ప్రయాణికులతో కనాకష్టంగా నెట్టుకొస్తున్నాయి. ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు, రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆదాయ ఆర్జన చేయాలనుకున్న సంస్థ ఆశలు తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం వస్తున్న ఆదాయం సరిపోకపోగా..నిత్యం మె ట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణకు అదనంగా నిర్మా ణ సంస్థ నిత్యం కోటి వ్యయం చేస్తున్నట్లు సమాచారం. మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీతోపాటు నిర్మాణ సంస్థ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ స్టేషన్ల పరిసరాలను, పార్కింగ్ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోన్న హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్)సంస్థ కూడా నష్టాల బాటపట్టింది. ప్రభుత్వం ఏటా వార్షిక బడ్జెట్లో కేటాయించే మొత్తం హెచ్ఎంఆర్ ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలకు కూడా కనాకష్టంగా సరిపోతోంది. దీంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు వాణిజ్య షెడ్ల నిర్మాణం ప్రతిపాదనలను హెచ్ఎంఆర్ ముందుకు తీసుకొచ్చినట్లు తెలిసింది. -
‘స్పేస్’ సిటీ!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాని అనుబంధ సంస్థలకు తోడు, బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణ ఉత్పాదక, ఇతర సేవలను అందించే సంస్థలు హైదరాబాద్‌లో తమ సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతుండటంతో నగరంలో కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. గతేడాది జనవరిలో నగరంలో కమర్షియల్ స్పేస్ 1.5 మిలియన్ చదరపు అడుగులు ఉండగా ఆ ఏడాది చివరినాటికి 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇక ఈ ఏడాది జూన్ నాటికి అది ఎనిమిది మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే 21% పెరుగుదల కన్పించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఒరాకిల్, ఎల్ అండ్ టీ, డెల్, ఇంటెల్, టీసీఎస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు నగరంలో అందుబాటులో ఉన్న 50 వేల నుంచి 4 లక్షల చదరపు అడుగుల స్థలాలను ఎంచుకుని లీజుకో, అద్దెకో తీసుకున్నాయి. దీన్నిబట్టి నగరంలో కమర్షియల్ స్పేస్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థ్ధం అవుతోంది. ఇదే ఊపు ఇలాగే కొనసాగితే దేశంలోనే కమర్షియల్ స్పేస్‌కు ఎక్కువగా డిమాండ్ ఉన్న బెంగళూరును 2021 నాటికి హైదరాబాద్ మించిపోతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. జోన్స్ లాంగ్ లాసెల్లీస్ (జేఎల్ఎల్) పల్స్ మంథ్లీ రియల్ ఎస్టేట్ మానిటర్ సంస్థ కూడా ఇదే అం శాన్ని ఇటీవల చేసిన పరిశోధనలో తేల్చింది. అందరిచూపు..హైదరాబాద్ వైపే బెంగళూరు నగరం ఐటీ, దాని అనుబంధ సంస్థ లకు కేరాఫ్‌గా నిలుస్తుండటంతో 2018 తొలి అర్ధ సంవత్సరం నాటికి 30 మిలియన్ చదరపు అడు గుల కమర్షియల్ స్పేస్‌కు చేరుకోగా 2019లో మొదటి 6 నెలల్లో హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, అడ్వర్టయిజింగ్, ఎడ్యుకేషన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్ వంటి సంస్థలు కొత్తగా విస్తరించాయి. ఇక హైదరాబాద్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి 2019 మొదటి 6 నెలల్లో కమర్షియల్ స్పేస్ వాటా 27 శాతానికి చేరింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు పలు మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని నెలకొల్పాలని చూస్తున్నాయి. నిర్మాణం పూర్తి చేసుకుని బుకింగ్ కానీ ప్రాజెక్టులు కూడా ఇటీవల మొత్తం పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి కూడా ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు. 21% పెరుగుదల 2018 జనవరిలో 1.5 చదరపు అడుగులు ఉండగా ఏడాది చివరి నాటికి 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. 2019 జనవరి నుంచి జూన్ నెల వరకు 8 మిలియన్ల చదరపు అడుగులకు కమర్షియల్ స్పేస్ చేరింది. 2019 సంవత్సరం చివరి నాటికి అది 18 మిలియన్ చదరపు అడుగులకు చేరుతుందని అంచనా. ఈ గణాంకాలను గమనిస్తే ఒక్క ఏడాదిలోనే నగరంలో 19% కమర్షియల్ స్పేస్ వినియోగంలోకి వచ్చింది. కొత్త ప్రాజెక్టులు గనుక పూర్తియితే 13 మిలియన్ చదరపు అడుగులకు చేరుకునే అవకాశం ఉండగా 2018తో పోలిస్తే 21% పెరుగనుంది. డిమాండ్ అధికంగా ఉండటంతో మల్టీనేషనల్ కంపెనీలు 1.5 లక్షల చదరపు అడుగుల నుంచి 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీలను విస్తరిస్తున్నాయి. దీంతో నగరంలో కార్యాలయాల విస్తరణకు డిమాండ్ బాగా పెరగడంతో ఖాళీగా ఉన్నటువంటి కమర్షియల్ స్పేస్ 3.6% కనిష్టానికి పడిపోయింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కమర్షియల్ స్థలం ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో గడిచిన ఆరు నెలల కాలంలో అద్దె ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైటెక్ సీటీ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో చదరపు అడుగు కమర్షియల్ స్పేస్ అద్దె ధర రూ.70 వరకు ఉండగా, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ జిల్లా పరిసరాల్లో రూ.60 వరకు చెల్లించడానికి సంస్థలు వెనుకాడటం లేదని తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబాయిల్లో అధికంగా ధరలు చెల్లించడానికి సంస్థలు ముందుకు రాకపోవడం చూస్తుంటే 2021 నాటికి హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ వాటాలో బెంగళూరును అధిగమించనుందని ఓ అంచనా. ఒప్పందాలకు అనుగుణంగా నిర్మిస్తున్న నిర్మాణాలు అధికంగా ఉండటంతో రానున్న కాలంలో నగరంలో కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ భారీగా ఉండనుంది. నగరం ఉత్తరం వైపు విస్తరిస్తుండటం అక్కడ మౌలిక వసతుల కల్పన కూడా అదే స్థాయిలో ఉండటంతో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు కార్యాలయాలను నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, బుద్వేల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలే కాకుండా ఇతర కంపెనీలు సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. -
ఏడాదిలో 300 ఫ్లాట్ల అప్పగింత!
• 5 లక్షల చ.అ.ల్లో వాణిజ్య స్థలం కూడా.. • శరవేగంగా ముస్తాబవుతున్న శాంతా శ్రీరామ్ ప్రాజెక్ట్‌లు: ఎండీ నర్సయ్య సాక్షి, హైదరాబాద్: గడువులోగా కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించడమే తమ లక్ష్యమంటోంది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులను ఆపలేదని.. శరవేగంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నామని సంస్థ ఎండీ నర్సయ్య ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. రానున్న ఏడాది కాలంలో 300 ఫ్లాట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఏడాది క్రితం నగరంలో ప్రారంభించిన నివాస, వాణిజ్య సముదాయాల పనుల పురోగతిని వివరించారు. ⇔ యూసుఫ్‌గూడలో 6 వేల గజాల్లో బ్లూ బర్డ్స్ హ్యాబిటేట్ లగ్జరీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 65 ఫ్లాట్లొస్తాయి. 1,800-2,200 చ.అ.ల్లో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.6 వేలు. 80 శాతం స్ట్రక్చర్ పనులు, 40 శాతం బ్రిక్ వర్క్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ⇔ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో 5,500 గజాల్లో డ్యూక్స్ గెలాక్సీని నిర్మిస్తున్నాం. 1,800-2,300 చ.అ.ల్లో ఫ్లాట్లు, స్టూడియో అపార్ట్మెంట్లుంటాయి. ధర చ.అ.కు రూ.8 వేలు. స్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. బ్రిక్ వర్క్ నడుస్తోంది. ఇది కూడా వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ⇔ మణికొండలో 6 ఎకరాల్లో స్ప్రింగ్ వ్యాలీ విల్లా ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. జీ+2 ఫ్లోర్లలో మొత్తం 40 ఇండిపెండెట్ విల్లాలుంటాయి. ఇప్పటికే 30 విల్లాల స్ట్రక్చర్, బ్రిక్ పనులు పూర్తయ్యాయి. ధర చ.అ.కు రూ.10 వేలు. 50 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. 9 నెలల్లో కొనుగోలుదారులకు అందిస్తాం. ⇔ ముషీరాబాద్‌లో 5,500 గజాల్లో చాలెట్ మిడోస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 90 ఫ్లాట్లు. 1,100-1,600 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5 వేలు. స్ట్రక్చర్ పనులు జరుగుతున్నాయి. ఏడాదిన్నరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ⇔ అమీర్‌పేటలో 70 ఫ్లాట్ల ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. 1,245- 1,500 చ.అ. మధ్య 2,3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.6 వేలు. ⇔ కిస్మత్పూర్లో 6 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 60 విల్లాలొస్తాయి. నిర్మాణ పనులు ప్రారంభించాం. ⇔ రెండు నెలల్లో అప్పా జంక్షన్, బహుదూర్‌పల్లిలో ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నాం. అప్పాలో ఎకరన్నర విస్తీర్ణంలో 900 ఫ్లాట్ల ప్రాజెక్ట్ రానుంది. బహుదూర్‌పల్లిలో 22 ఎకరాల్లో 200 విల్లాలు, 300 ఫ్లాట్ల ప్రాజెక్ట్ ప్రారంభించనున్నాం. 5 లక్షల చ.అ.ల్లో కమర్షియల్ స్పేస్ నగరంలో పలు కమర్షియల్ ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది కాలంలో 5 లక్షల చ.అ. వాణిజ్య స్థలం నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్ణయించాం. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 36లో 71 వేల చ.అ. ఎన్బీఆర్ కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇందులో 1,500 నుంచి 10 వేల చ.అ.ల్లో షాపింగ్ కాంప్లెక్స్, కార్యాలయాల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్యాట్నీ సెంటర్లో 9 లక్షల చ.అ.ల్లో ప్యాట్నీ మాల్, బేగంపేటలో 50 వేల చ.అ.ల్లో బ్లూ మూన్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో 2.84 లక్షల చ.అ.ల్లో ఓడియన్ మాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం.