గార్డెన్‌ సిటీ కిందికి నిజాం నగరం పైకి! | Hyderabad sees highest pre-commitment in office space leases | Sakshi
Sakshi News home page

గార్డెన్‌ సిటీ కిందికి నిజాం నగరం పైకి!

Published Sat, Oct 23 2021 6:48 AM | Last Updated on Sat, Oct 23 2021 6:48 AM

Hyderabad sees highest pre-commitment in office space leases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలిసారిగా దేశీయ కార్యాలయాల స్థలాల లావాదేవీలలో బెంగళూరు కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా జరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ విభాగం శరవేగంగా కోలుకుంటోంది. ఈ ఏడాది జూలై– సెప్టెంబర్‌ మూడో త్రైమాసికం (క్యూ3)లో హైదరాబాద్‌లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరగగా.. బెంగళూరులో 21 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఇదే సమయంలో భాగ్యనగరంలో 32 లక్షల చ.అ. స్పేస్‌ సరఫరాలోకి రాగా.. బెంగళూరులో కేవలం 9 లక్షల చ.అ. స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది.

2021 క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్‌ లావాదేవీలు జరిగాయని కొల్లియర్స్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ తెలిపింది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ పునఃప్రారంభిస్తుండటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్‌కు డిమాండ్‌ పెరుగుతుందని కొల్లియర్స్‌ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్‌ నాయర్‌ తెలిపారు.

రాయదుర్గం, హైటెక్‌ సిటీల్లోనే..
కరోనా సెకండ్‌ వేవ్‌ నిర్మాణ రంగంపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పటికే ఉన్న ఆఫీస్‌ స్పేస్‌ స్టాక్‌ను లీజుకు ఇవ్వడంపై డెవలపర్లు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లోని మొత్తం లావాదేవీలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గంలో అత్యధికంగా 53 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి. హైటెక్‌సిటీలో 40 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి.

సరఫరాలోనూ మనమే టాప్‌..
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్తగా 1.08 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ సరఫరా జరిగింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 29 శాతం, పుణేలో 25 శాతం సప్లయి జరిగింది. ఈ ఏడాది క్యూ3లోని మొత్తం లీజులలో ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌ వాటా 26 శాతంగా ఉంది. ఈ విభాగంలో లావాదేవీలు పుణే తర్వాత హైదరాబాద్‌లో ఎక్కువగా జరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement