‘స్పేస్‌’ సిటీ! | Commercial Space Demand Increase In Hyderabad | Sakshi
Sakshi News home page

‘స్పేస్‌’ సిటీ!

Published Mon, Aug 12 2019 2:21 AM | Last Updated on Mon, Aug 12 2019 4:57 AM

Commercial Space Demand Increase In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ దాని అనుబంధ సంస్థలకు తోడు, బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణ ఉత్పాదక, ఇతర సేవలను అందించే సంస్థలు హైదరాబాద్‌లో తమ సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతుండటంతో నగరంలో కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. గతేడాది జనవరిలో నగరంలో కమర్షియల్‌ స్పేస్‌ 1.5 మిలియన్‌ చదరపు అడుగులు ఉండగా ఆ ఏడాది చివరినాటికి 5.8 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. ఇక ఈ ఏడాది జూన్‌ నాటికి అది ఎనిమిది మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే 21% పెరుగుదల కన్పించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఒరాకిల్, ఎల్‌ అండ్‌ టీ, డెల్, ఇంటెల్, టీసీఎస్‌ వంటి పెద్ద ఐటీ కంపెనీలు నగరంలో అందుబాటులో ఉన్న 50 వేల నుంచి 4 లక్షల చదరపు అడుగుల స్థలాలను ఎంచుకుని లీజుకో, అద్దెకో తీసుకున్నాయి. దీన్నిబట్టి నగరంలో కమర్షియల్‌ స్పేస్‌కు ఎంత డిమాండ్‌ ఉందో అర్థ్ధం అవుతోంది. ఇదే ఊపు ఇలాగే కొనసాగితే దేశంలోనే కమర్షియల్‌ స్పేస్‌కు ఎక్కువగా డిమాండ్‌ ఉన్న బెంగళూరును 2021 నాటికి హైదరాబాద్‌ మించిపోతుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు అంటున్నారు. జోన్స్‌ లాంగ్‌ లాసెల్లీస్‌ (జేఎల్‌ఎల్‌) పల్స్‌ మంథ్లీ రియల్‌ ఎస్టేట్‌ మానిటర్‌ సంస్థ కూడా ఇదే అం శాన్ని ఇటీవల చేసిన పరిశోధనలో తేల్చింది.  

అందరిచూపు..హైదరాబాద్‌ వైపే  
బెంగళూరు నగరం ఐటీ, దాని అనుబంధ సంస్థ లకు కేరాఫ్‌గా నిలుస్తుండటంతో 2018 తొలి అర్ధ సంవత్సరం నాటికి 30 మిలియన్‌ చదరపు అడు గుల కమర్షియల్‌ స్పేస్‌కు చేరుకోగా 2019లో మొదటి 6 నెలల్లో హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, అడ్వర్టయిజింగ్, ఎడ్యుకేషన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్‌ వంటి సంస్థలు కొత్తగా విస్తరించాయి. ఇక హైదరాబాద్‌లో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగి 2019 మొదటి 6 నెలల్లో కమర్షియల్‌ స్పేస్‌ వాటా 27 శాతానికి చేరింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు పలు మల్టీ నేషనల్‌ కంపెనీలు హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని నెలకొల్పాలని చూస్తున్నాయి. నిర్మాణం పూర్తి చేసుకుని బుకింగ్‌ కానీ ప్రాజెక్టులు కూడా ఇటీవల మొత్తం పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి కూడా ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు.

21% పెరుగుదల 
2018 జనవరిలో 1.5 చదరపు అడుగులు ఉండగా ఏడాది చివరి నాటికి 5.8 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. 2019 జనవరి నుంచి జూన్‌ నెల వరకు 8 మిలియన్‌ల చదరపు అడుగులకు కమర్షియల్‌ స్పేస్‌ చేరింది. 2019 సంవత్సరం చివరి నాటికి అది 18 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుతుందని అంచనా. ఈ గణాంకాలను గమనిస్తే ఒక్క ఏడాదిలోనే నగరంలో 19% కమర్షియల్‌ స్పేస్‌ వినియోగంలోకి వచ్చింది. కొత్త ప్రాజెక్టులు గనుక పూర్తియితే 13 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకునే అవకాశం ఉండగా 2018తో పోలిస్తే 21% పెరుగనుంది.  

డిమాండ్‌ అధికంగా ఉండటంతో 
మల్టీనేషనల్‌ కంపెనీలు 1.5 లక్షల చదరపు అడుగుల నుంచి 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీలను విస్తరిస్తున్నాయి. దీంతో నగరంలో కార్యాలయాల విస్తరణకు డిమాండ్‌ బాగా పెరగడంతో ఖాళీగా ఉన్నటువంటి కమర్షియల్‌ స్పేస్‌ 3.6% కనిష్టానికి పడిపోయింది. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కమర్షియల్‌ స్థలం ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో గడిచిన ఆరు నెలల కాలంలో అద్దె ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైటెక్‌ సీటీ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో చదరపు అడుగు కమర్షియల్‌ స్పేస్‌ అద్దె ధర రూ.70 వరకు ఉండగా, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ జిల్లా పరిసరాల్లో రూ.60 వరకు చెల్లించడానికి సంస్థలు వెనుకాడటం లేదని తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబాయిల్లో అధికంగా ధరలు చెల్లించడానికి సంస్థలు ముందుకు రాకపోవడం చూస్తుంటే 2021 నాటికి హైదరాబాద్‌ కమర్షియల్‌ స్పేస్‌ వాటాలో బెంగళూరును అధిగమించనుందని ఓ అంచనా. ఒప్పందాలకు అనుగుణంగా నిర్మిస్తున్న నిర్మాణాలు అధికంగా ఉండటంతో రానున్న కాలంలో నగరంలో కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ భారీగా ఉండనుంది. నగరం ఉత్తరం వైపు విస్తరిస్తుండటం అక్కడ మౌలిక వసతుల కల్పన కూడా అదే స్థాయిలో ఉండటంతో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు కార్యాలయాలను నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, బుద్వేల్, ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలే కాకుండా ఇతర కంపెనీలు సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement