ఈడీ కస్టడీకి ‘కలర్‌ ప్రిడెక్షన్‌’ గ్యాంగ్‌  | Color Prevention Gang Is In ED Custody At Hyderabad | Sakshi
Sakshi News home page

ఈడీ కస్టడీకి ‘కలర్‌ ప్రిడెక్షన్‌’ గ్యాంగ్‌ 

Published Wed, Sep 23 2020 10:06 AM | Last Updated on Wed, Sep 23 2020 10:11 AM

Color Prevention Gang Is In ED Custody At Hyderabad - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, రంగారెడ్డి: ఈ–కామర్స్‌ పేరుతో సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్‌ గేమింగ్‌కు పాల్పడిన కలర్‌ ప్రివెక్షన్‌ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్‌ హూ సహా ముగ్గురిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌తోనూ ముడిపడి ఉన్న ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత నెల 13న రట్టు చేశారు. దీనిపై ఈడీకి ఓ సమగ్రమైన లేఖ రాశారు. ఈ దందాలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌ జరిగి ఉంటుందని అనుమానిస్తూ పూర్తి వివరాలను సమర్పించారు. వీటి ఆధారంగా ఈడీ ఈ నెల 15న యాన్‌ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్‌లపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. (లాక్‌డౌన్‌లోనూ ‘పవర్‌’ ఫుల్‌ గేమ్‌! )

ఆధారాల సేకరణ కోసం ఢిల్లీ, గుర్గావ్, ముంబైల్లోని మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసి 17  హార్డ్‌ డిస్క్‌లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఫోన్లతో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఈ నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఎనిమిది రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ వెబ్‌సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్‌ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది. చైనాకు చెందిన బీజింగ్‌ టి పవర్‌ సంస్థ సౌత్‌ఈస్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌గా యాన్‌ హూ పని చేస్తున్నాడు. గుర్గావ్‌ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్‌ తదితరులను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. 

వీరంతా కలిసి ఈ–కామర్స్‌ సంస్థల ముసుగులో గ్రోవింగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పాన్‌ యన్‌ టెక్నాలజీస్‌ సర్వీస్, లింక్‌యన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్, డాకీపే ప్రైవేట్‌ లిమిటెడ్, స్పాట్‌పే ప్రైవేట్‌ లిమిటెడ్, డైసీలింగ్‌ ఫైనాన్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఆర్‌ఓసీలో రిజిస్టర్‌ చేశారు. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో వివిధ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్‌ ప్రిడెక్షన్‌ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగించారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్‌ గేట్‌ వే అయిన పేటీఎం, గూగుల్‌ పేల ద్వారా లావాదేవీలు జరిగాయి. బెట్టింగ్‌కు సంబంధించిన డబ్బు డాకీ పే, లింక్‌ యన్‌ సంస్థలకు వెళ్ళింది. అక్కడ నుంచి హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు.

ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్ళినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌లో రూ.110 కోట్లు వెళ్ళినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులోని నాలుగు ఖాతాల్లో ఉన్న రూ.46.96 కోట్లను ఈడీ ్రïఫీజ్‌ చేసింది. ఈ  వ్యవహారంలో మనీలాండరింగ్‌ను నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. నిందితుల విచారణలో దీనికి సంబంధించి వివరాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement