సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌తో అమాయక ప్రజలను మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిన చైనా కంపెనీల వ్యవహారంలో బుధవారం పేటీఎం సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు పేటీఎం సౌత్ ఇండియా హెడ్ ధీరజ్ బుధవారం సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్, దర్యాప్తు అధికారి ఎస్సై మదన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. పేటీఎంకు వివిధ గేట్ వేల ద్వారా డబ్బు పంపిస్తే వాటిని ఒక దగ్గరకు చేర్చి రెండు మూడు రోజులకొకసారి హెచ్‌ఎస్‌బీసీ ఖాతాలకు పంపించాలనే ఒప్పందం చేసుకున్నట్టు పేటీఎం అధికారులు వివరణ ఇచ్చారని తెలిసింది. (ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!)
డిజిటల్ పేమెంట్లు కావడంతో తాము వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని, అలాగే ఈ సంస్థలతోను ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. కలర్ ప్రెడిక్షన్ పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ దందా నిర్వహిస్తూ ప్రజలను మోసంచేస్తున్న ఒక చైనీయుడు, ముగ్గురు భారతీయులను ఈ నెల 13న సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రూ.1107 కోట్లు బెట్టింగ్ రూపంలో వసూలు చేయగా.. రూ.110 కోట్లు చైనాకు తరలిపోయాయి. మరో రూ.30 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. మిగతా రూ. 967 కోట్లు ఎక్కడికి వెళ్లాయో ఆరా తీస్తున్నారు. హవాలా ద్వారా ఈ డబ్బు ఇతర దేశాల మీదుగా చైనాకు తరలినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు పేటీఎం నుంచి జరుగడంతో పేటీఎంకు నోటీసులు జారీచేసి, ఆయా కంపెనీలతో ఉన్న ఒప్పందాలపై సైబర్ క్రైమ్ పోలీసులు వివరణ కోరారు. (రూ.వెయ్యి కోట్లకుపైగా కొల్లగొట్టిన చైనీస్ కంపెనీ)
తమకు వివిధ కస్టమర్లు, పేమెంట్ గేట్‌వేల ద్వారా డబ్బు జమవుతుందని, కస్టమర్లకు చెల్లింపులు కూడా తమ ద్వారానే జరిగాయని వెల్లడించినట్లు తెలిసింది. ఇలా తమ ద్వారా రూ.649 కోట్ల డిపాజిట్ల్లు రెండు ఖాతాల్లో జమయ్యాయని చెప్పారని సమాచారం. దీంతోపాటు కొంత మొత్తం చెల్లింపులు కూడా చేశామని వివరించారు. చెల్లించిన సొమ్ము బెట్టింగ్‌లో గెలుపొందినవారికి ఇచ్చారా? అంటూ పోలీసులు ప్రశ్నించడంతో ఆ విషయం తమకు తెలియదని, కంపెనీ నుంచి వచ్చే సూచనలను బట్టి ఆ డబ్బు పంపించామని వివరించారు.
సమాచారం సేకరించిన ఈడీ, ఐటీ
బుధవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట పేటీఎం సంస్థ ప్రతినిధులు హాజరుకావడంతో, ఈడీ అధికారులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు కూడా వారి నుంచి విడిగా వివరాలు సేకరించారు. కాగా పేటీఎం సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకోవడంలో చైనా కంపెనీల మతలబు ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. పేటీఎంలోను చైనా సంస్థ అలీబాబా కంపెనీ షేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చైనీయులు పేటీఎంతో ఒప్పందాలు చేసుకుని ఉంటారా? అనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment