ప్రత్యూష్ సిన్హా నివేదిక సిద్ధం!
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ సిద్ధం చేసింది. కమిటీ సభ్యులు ఈ నివేదికను మంగళవారం సాయంత్రమే ప్రధాని కార్యాలయ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. అక్కడ ఆమోదం లభిస్తే 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అదే రోజు సాయంత్రం లేదా 17న కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో మార్గదర్శకాలను అందుబాటులో ఉంచవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల భారత సర్వీసు పోస్టులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యూష్ సిన్హా కమిటీ విభజించింది. దీని ప్రకారం తెలంగాణకు 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్ఎస్ పోస్టులను కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఐఎఫ్ఎస్ పోస్టులు అవసరమని కేంద్రానికి సిఫార సు చేసింది. జిల్లాల నిష్పత్తి ఆధారంగా ఈ కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే.
అధికారులను సంఖ్యాపరంగా విభజన చేసినా, ఎవరిని ఎక్కడికి పంపాలి, ఆప్షన్లు ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై మంగళవారం నాటికి కసరత్తు పూర్తయింది. విభజన మార్గదర్శకాల తయారీలో పారదర్శకత, సమన్యాయానికి ప్రాధాన్యమిస్తూనే గతంలో మూడు రాష్ట్రాల విభజన సమయంలో ఉద్యోగుల విభజన చేసిన యూసీ అగర్వాల్ కమిటీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక విభజన అనంతరం ఏ రాష్ట్రాల్లో పనిచేస్తారన్న దానిపై అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి అనధికారికంగా సీల్డ్ కవర్లో అభిప్రాయాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ సేకరించింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని, అయితే దానిని హక్కుగా మాత్రం భావించరాదని అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే తమకు కచ్చితంగా ఆప్షన్లు ఉండి తీరాలన్న అఖిల భారత స్థాయి అధికారుల డిమాండ్ పట్ల కమిటీ ఎలా స్పందించిందన్నది తెలియరాలేదు. కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారన్నది సస్పెన్స్‌గానే ఉంది.